- తమిళనాడులో సంక్షోభానికి మోదీ సర్కారే కారణం
- ఓపీఎస్, ఈపీఎస్‌పై మండిపడ్డ దినకరన్
సాక్షి, చెన్నై: తన వర్గం ఎమ్మెల్యేలపై తాజాగా స్పీకర్ అనర్హత వేటు వేయడంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై దినకరన్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. తన వర్గం ఎమ్మెల్యేలపై వేటు వెనుక కేంద్రం హస్తముందని ఆయన ఆరోపించారు. తమిళనాడులో తలెత్తిన రాజకీయ సంక్షోభానికి కేంద్రమే కారణమని, ప్రస్తుతం రాష్ట్రంలో పరిస్థితి పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలా ఉందని మండిపడ్డారు. చిన్నమ్మను అన్నాడీఎంకే నుంచి తొలగించిన ఈ పళనిస్వామి (ఈపీఎస్), ఓ పన్నీర్ సెల్వం (ఓపీఎస్) మోసగాళ్లని అభివర్ణించారు. పన్నీర్ సెల్వం 'బాహుబలి'లో కట్టప్పలాగా వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. తన వర్గం ఎమ్మెల్యేలపై వేటువిషయంలో న్యాయస్థానంపై నమ్మకముందని, హైకోర్టు తీర్పు తమకు అనుకూలంగా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
'తమిళ ప్రజలను దెబ్బతీసే ఏ అంశాన్నైనా మేం లేవనెత్తుతాం. తమిళనాడు ప్రజలు అంతా చూస్తున్నారు. తమిళనాడు సంక్షోభం వెనుక కేంద్రమే ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే. ఈపీఎస్, ఓపీఎస్ మోసగాళ్లుగా గుర్తుండిపోతారు. ఈపీఎస్ ప్రజల చేత ఎన్నుకోబడలేదు. అతన్ని శశికళే సీఎంను చేసింది. ఓపీఎస్ ఓ కట్టప్పలాంటి వాడు. పోలీసులు ఉగ్రవాదులను వెంటాడినట్టు మా ఎమ్మెల్యేలను వెంటాడుతున్నారు' అని ఆయన 'న్యూస్18' చానెల్‌తో పేర్కొన్నారు.