‘గవర్నర్‌కు శాంతిభద్రతల’పై ప్రధాని మోడీకి కేసీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ‘‘హైదరాబాద్‌పై గవర్నర్‌కు పెత్తనమిచ్చే నిబంధనలను పాటించాలంటూ.. మీ అనుమతి లేకుండానే కేంద్ర హోంశాఖ తెలంగాణ సర్కారుకు లేఖ రాసిందని మేం గట్టిగా విశ్వసిస్తున్నాం.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాదని గవర్నర్ ద్వారా పాలనను చేతుల్లోకి తీసుకోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.. ఇది ఎంతో బాధ కలిగిస్తోంది.. ఈ విషయంలో మీరు తక్షణం జోక్యం చేసుకోవాలి..’’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి తెలంగాణ సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోనూ హైదరాబాద్ విషయంలో తెలంగాణ మంత్రిమండలి సలహా మేరకే గవర్నర్ పనిచేయాలని ఉందని, రాజ్యాంగం ప్రకారమూ ఇదే సరైన విధానమని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో వెంటనే కలగజేసుకుని సమస్య పరిష్కారానికి చర్య తీసుకోవాలంటూ కేసీఆర్ శనివారం రాత్రి ప్రధానికి లేఖ రాశారు.
కేసీఆర్ లేఖ పూర్తి పాఠమిదీ...
ప్రధాని నరేంద్రమోడీ గారికి,
‘సమాఖ్య వ్యవస్థకు సంబంధించి అత్యంత ముఖ్యమైన రాజ్యాంగపరమైన అంశం గురించి ఎంతో బాధతో ఈ లేఖ రాస్తున్నాను. కేంద్ర హోంశాఖ నుంచి అందిన లేఖ మమ్మల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం కింద గవర్నర్ అధికారాలు, విధులను గురించి రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలంటూ కొన్ని అనవసర నిబంధనలను ఆ లేఖలో పేర్కొన్నారు. పోలీసుస్టేషన్లలో స్టేషన్ హౌస్ ఆఫీసర్‌ను, ఏసీపీ/డీసీపీలను నియమించే విషయంలో కూడా ప్రభుత్వం నిర్దిష్ట విధానాన్ని పాటించాలని సూచించే వరకు ఆ నిబంధనలు ఉన్నాయి. రాజ్యాంగం ప్రకారం మంత్రి మండలి సలహా మేరకే గవర్నర్ పనిచేయాల్సి ఉంటుంది. అదేవిధంగా గవర్నర్ విధుల నిర్వహణ గురించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 8(3)లో కూడా ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి మండలితో సంప్రదింపుల తర్వాతే గవర్నర్ తన నిర్ణయాధికారాన్ని వినియోగించాలి. మంత్రి మండలి మినహా మరే ఇతర పరిపాలనాపరమైన వ్యవస్థ గవర్నర్‌కు సలహాలు ఇవ్వడానికి పునర్వ్యవస్థీకరణ చట్టం, రాజ్యాంగం ఎలాంటి అవకాశం కల్పించలేదు. ఈ విషయాల్లో గవర్నర్ మంత్రి మండలి నుంచి తప్ప మరెవరి నుంచీ సలహాలు లేదా సూచనలు తీసుకోలేరు. తెలంగాణ మంత్రి మండలిని కాదని గవర్నర్ ద్వారా పరిపాలనా వ్యవస్థను చేతుల్లోకి తీసుకోవాలని అనుకోవడం మన దేశ సమాఖ్య స్ఫూర్తికి విఘాతం కలిగించడమే అవుతుంది. కేంద్ర హోంశాఖ ద్వారా మా ప్రభుత్వానికి అందిన లేఖను దీనితో పాటు జతచేస్తున్నాను. మీ అనుమతి తీసుకోకుండానే హోం శాఖ మాకు ఈ లేఖను పంపించిందని విశ్వసిస్తున్నాను. ఈ విషయంలో మీరు వెంటనే జోక్యం చేసుకుని సమాఖ్య సంప్రదాయాలు, ప్రజాస్వామిక విధానాలకు అనుగుణంగా హోం శాఖ తమ లేఖను ఉపసంహరించుకునే విధంగా ఆదేశాలు ఇవ్వగలరు..’
- కె.చంద్రశేఖరరావు
సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
Published Sun, Aug 10 2014 1:09 AM | Last Updated on Mon, Jul 29 2019 6:58 PM
Advertisement
Advertisement