కోల్‌కతా: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈనెల 15వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. తమ రాష్ట్ర అవసరాలకు మద్దతుగా నిలిచే ఆర్థిక అధికారాలు లేని నీతిఆయోగ్ వృథా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘రాష్ట్రాల ప్రణాళికలకు ఆర్థికంగా తోడ్పాటునందించే అధికారం లేని నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం దండగ. ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వరు.
ఈ వ్యవస్థ కంటే అంతర్ రాష్ట్ర కౌన్సిల్‌ను బలోపేతం చేయడం అవసరం. లేకుంటే రాష్ట్రాల మధ్య అసమతౌల్యాన్ని తగ్గించేలా నిధులు కేటాయించే అధికారాన్ని నీతి ఆయోగ్‌కు ఇవ్వాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కూడా సుప్రీంకోర్టులోని కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ‘జడ్జీల ఎంపిక కోసం సుప్రీంకోర్టులో కొలీజియం ఉంటుంది. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ఎన్నికల సంఘంలో కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలి’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment