Inter-State Council
-
అంతర్రాష్ట్ర మండలి పునర్నిర్మాణం
న్యూఢిల్లీ: దేశ సమాఖ్య విధానంలో సహకార స్పూర్తిని పెంచేందుకు కృషి చేసే అంతర్రాష్ట్ర మండలిని కేంద్రం పునర్నిర్మించింది. ఈ మండలి అధ్యక్షుడు ప్రధాని మోదీ కాగా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్రమంత్రులు సభ్యులుగా ఉంటారు. మరో 10 మంది కేంద్ర మంత్రులు మండలి శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. దీంతోపాటు, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది. శాసనసభలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించింది. కేంద్రం–రాష్ట్రాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివిధ అంశాలను అంతర్రాష్ట్ర, జోనల్ మండలులు పరిశీలించి, పరిష్కారాలు వెతుకుతాయి. ఇవి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు చేస్తుంటాయి. హోం మంత్రి అధ్యక్షుడిగా ఏర్పాటైన మండలి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, వీరేంద్ర కుమార్, గజేంద్రసింగ్ షెకావత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు. -
నీతి ఆయోగ్ భేటీ వృథా
కోల్‌కతా: ప్రధాని మోదీ అధ్యక్షతన ఈనెల 15వ తేదీన జరగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిరాకరించారు. తమ రాష్ట్ర అవసరాలకు మద్దతుగా నిలిచే ఆర్థిక అధికారాలు లేని నీతిఆయోగ్ వృథా అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖ రాశారు. ‘రాష్ట్రాల ప్రణాళికలకు ఆర్థికంగా తోడ్పాటునందించే అధికారం లేని నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లడం దండగ. ముఖ్యమంత్రులకు మాట్లాడే అవకాశం ఇవ్వరు. ఈ వ్యవస్థ కంటే అంతర్ రాష్ట్ర కౌన్సిల్‌ను బలోపేతం చేయడం అవసరం. లేకుంటే రాష్ట్రాల మధ్య అసమతౌల్యాన్ని తగ్గించేలా నిధులు కేటాయించే అధికారాన్ని నీతి ఆయోగ్‌కు ఇవ్వాలి’అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కమిషనర్ల నియామకానికి కూడా సుప్రీంకోర్టులోని కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలని మమతా బెనర్జీ డిమాండ్ చేశారు. ‘జడ్జీల ఎంపిక కోసం సుప్రీంకోర్టులో కొలీజియం ఉంటుంది. ఎన్నికల కమిషనర్ల నియామకం కోసం ఎన్నికల సంఘంలో కొలీజియం వంటి వ్యవస్థ ఉండాలి’ అని అన్నారు. -
అంతర్రాష్ట్ర మండలి నుంచి స్మృతీ ఔట్
న్యూఢిల్లీ: రాష్ట్రాలు, కేంద్రం మధ్య సమన్వయం కోసం పనిచేసే అంతర్రాష్ట్ర మండలి నుంచి కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, సదానంద గౌడలను తప్పించారు. ప్రధాని మోదీ అధ్యక్షులుగా ఉన్న ఈ మండలిలో కొత్తగా కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్‌ను సభ్యునిగా తీసుకున్నారు. మండలిలో మార్పులుచేర్పులు జరిగాయని తాజాగా విడుదలైన ఓ ఉత్తర్వు ద్వారా తెలుస్తోంది. మండలి స్టాండింగ్ కమిటీలో ఎలాంటి మార్పులు లేవు. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఇకమీదట కూడా మండలిలో కొనసాగనున్నారు. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల మధ్య సమస్యలు ఉత్పన్నమైతే పరిష్కారం చూపేందుకు 1990 మేలో ప్రధాని అధ్యక్షతన అంతరాష్ట్ర మండలిని ఏర్పాటుచేశారు. దాదాపు పదేళ్ల తర్వాత ప్రధాని ఈ జులైలో మండలి 11వ సమావేశం జరిగింది. ప్రస్తుత మండలిలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలు, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీ, వెంకయ్య నాయుడు, నితిన్ గడ్కరీ, మనోహర్ పరీకర్ సభ్యులుగా ఉన్నారు. వీరుగాక మరో పదిమంది కేంద్రమంత్రులు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు.