న్యూఢిల్లీ: దేశ సమాఖ్య విధానంలో సహకార స్పూర్తిని పెంచేందుకు కృషి చేసే అంతర్రాష్ట్ర మండలిని కేంద్రం పునర్నిర్మించింది. ఈ మండలి అధ్యక్షుడు ప్రధాని మోదీ కాగా, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరుగురు కేంద్రమంత్రులు సభ్యులుగా ఉంటారు. మరో 10 మంది కేంద్ర మంత్రులు మండలి శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. దీంతోపాటు, హోంమంత్రి అమిత్ షా నేతృత్వంలో అంతర్రాష్ట్ర మండలి స్టాండింగ్ కమిటీని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది.
శాసనసభలు లేని కేంద్ర పాలిత ప్రాంతాల పరిపాలనాధికారులకు మండలిలో సభ్యులుగా అవకాశం కల్పించింది. కేంద్రం–రాష్ట్రాలు, వివిధ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య తలెత్తే వివిధ అంశాలను అంతర్రాష్ట్ర, జోనల్ మండలులు పరిశీలించి, పరిష్కారాలు వెతుకుతాయి. ఇవి ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సూచనలు చేస్తుంటాయి. హోం మంత్రి అధ్యక్షుడిగా ఏర్పాటైన మండలి స్టాండింగ్ కమిటీలో సభ్యులుగా కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, నరేంద్ర సింగ్ తోమర్, వీరేంద్ర కుమార్, గజేంద్రసింగ్ షెకావత్‌తోపాటు ఆంధ్రప్రదేశ్, అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉంటారు.
Comments
Please login to add a commentAdd a comment