బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందంటూ సుమారు 13,000 పాఠశాలలు.. ప్రధాని మోదీకి ఫిర్యాదు చేశాయి. ‘ద అసోసియేటెడ్ మేనేజ్‌మెంట్స్ ఆఫ్ ప్రైమరీ అండ్ సెకండరీ స్కూల్స్’, ‘ద రిజిస్టర్డ్ అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ స్కూల్స్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్’.. ఈ మేరకు ప్రధానికి లేఖ రాశాయి. విద్యాసంస్థలకు గుర్తింపు పత్రం జారీ కోసం రాష్ట్ర విద్యాశాఖ లంచం డిమాండ్ చేసిన ఘటనను పరిశీలించాలని కోరాయి.
‘అశాస్త్రీయమైన, అహేతుకమైన, వివక్షణ లేని, పాటించని నిబంధనలు అన్‌ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలకు మాత్రమే వర్తింపజేస్తున్నారు. భారీ అవినీతి జరుగుతోంది. ఇప్పటికే చాలాసార్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బీసీ నగేష్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, వాటిని పక్కనపెట్టేశారు. బీసీ నగేశ్ రాజీనామా చేయాలి. మొత్తం వ్యవస్థలోని దుర్భర పరిస్థితులను అర్థం చేసుకోవటం, సమస్యలను పరిష్కరించటంలో విద్యాశాఖ అలసత్వం వహిస్తోంది. పాఠశాలల బడ్జెట్‌కు ఇద్దరు బీజేపీ మంత్రులు తీరని నష్టం చేకూరుస్తున్నారు. మరోవైపు.. వారి విద్యాస్థల్లోకి భారీగా పెట్టుబడి దారులను ఆహ్వానిస్తూ విద్యార్థుల నుంచి అధికమొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు.’ అని లేఖలో పేర్కొన్నాయి పాఠశాలల యాజమాన్యాలు.
విద్యాసంవత్సరం ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు ప్రభుత్వం సూచించిన పుస్తకాలు పాఠశాలలకు చేరలేదని అసోసియేషన్స్ ఆరోపించాయి. తల్లిదండ్రులు, విద్యార్థులపై భారం పడకుండా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఆచరణాత్మకంగా అమలు చేయగల నిబంధనలను రూపొందించి.. నియంత్రణలను సరళీకరించడానికి విద్యాశాఖ మంత్రికి శ్రద్ధ లేదని పేర్కొన్నాయి. ఈవిషయాన్ని పరిగణనలోకి తీసుకుని కర్ణాటక విద్యాశాఖ మంత్రిపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని కోరాయి.
ఇదీ చదవండి: Jayalalitha Death Mystery: 600 పేజీలతో నివేదిక.. సీఎం స్టాలిన్ చేతికి రిపోర్టు
Comments
Please login to add a commentAdd a comment