పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (ఫైల్ ఫోటో)
కోల్‌కతా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ లేఖ రాశారు. 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి చేసిన సిఫారసులను వ్యతిరేకిస్తున్నట్లు ఆమె ఆ లేఖలో తెలిపారు. జనాభా అధారిత సంవత్సరంగా 1971 బదులు 2011 సంవత్సరంగా మార్చడం, దాని వల్ల కలిగే నష్టాల గురించి లేఖలో వివరించారు. 15వ ఆర్థిక సంఘం కొత్తగా చేసిన సిఫారసుల వల్ల రాష్ట్రాలకు నిధుల పంపకంలో తీవ్ర నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. 15 ఆర్థిక సంఘం సిఫారసులను వ్యతిరేకిస్తు మోదీకి లేఖ రాసిన మొదటి సీఎం మమతనే కావడం విశేషం. గత కొంతకాలంగా 15వ ఆర్థిక సంఘం కేంద్రానికి చేసిన సిఫారసులను రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే బహిరంగంగా ఏ రాష్ట్రం విమర్శించలేదు. కాగా జనాభా అధారిత సంవత్సరంగా 1971కి బదులుగా 2011ను ప్రతిపాదించడంతో తమ రాష్ట్రానికి 25,000 కోట్ల నుంచి 35,000 కోట్ల నష్టపోయే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు.
సమాఖ్య విధానంలో రాష్ట్రాల అభిప్రాయం తెలుసుకోకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం సమాఖ్య విధానానికి విరుద్ధం అని మమత విమర్శించారు. గత ఐదేళ్లుగా 1971 జనాభా ఆధారంగానే రాష్ట్రంలో అనేక సామాజిక, కుటుంబ సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు ఆమె ఆ లేఖలో ప్రస్తావించారు. జనాభా ఆధారిత సంవత్సరాన్ని మార్చడంతో పశ్చిమ బెంగాల్ మాత్రమేకాక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, ఒడిశా లాంటి రాష్ట్రాలు అధికంగా నిధులు కోల్పోతున్నాయని లేఖలో వివరించారు. ఉత్తర భారతంలో ఉన్న రాష్ట్రాలు బిహార్, రాజస్తాన్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్ లాంటి రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం అధికంగా నిధులు మంజూరుచేస్తోందని, మిగిలిన రాష్ట్రాలకు కేంద్రం నిధుల కుదించడం అన్యాయమని విమర్శించారు.
Comments
Please login to add a commentAdd a comment