చెన్నై, సాక్షి ప్రతినిధి:‘నడి సంద్రంలో మునిగిన నావ, దాహం తీర్చుకునేందుకు ఏదీ త్రోవ...అందుకే మూత్రం తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నాం’ అని సముద్రంలో చేపలవేటకు వెళ్లి వారం రోజుల పాటు అవస్థలు పడిన తమిళనాడు జాలర్లు తెలిపారు. వారి కథనం మేరకు.. చెన్నై కాశిమేడు జీవరత్నం నగర్‌కు చెందిన కడుంపాడి(42), మాయాండి (30), శక్తివేల్ (29), మణి (30), సురేష్ (32) గత నెల 21వ తేదీన ఫైబర్ బోటును తీసుకుని సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. 22వ తేదీ అర్ధరాత్రి రాక్షస అలల తాకిడికి వీరు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. చేపలవేటకు వెళ్లిన వారు రెండురోజులైనా తిరిగి రాకపోవడంతో మత్స్యకార గ్రామాల్లో విషాదం అలుముకుంది.
తమవారిని వెతికిపెట్టాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సముద్రతీర గస్తీదళాలు హెలికాప్టర్‌తో గాలించాయి. జాలర్లు సైతం అనేక బోట్లలో సముద్రంలో వెతికినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో తమవారు క్షేమంగా ఉన్నారని సమాచారం అందడంతో తమిళ జాలర్ల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇదిలావుండగా జాలర్లు కొట్టుకుపోతున్న బోటును ఈదుకుంటూ వెళ్లి పట్టుకున్నారు. మరికొంత సేపటికి మళ్లీ రాక్షస అలరావడంతో పడవబోల్తా పడడమేగాక ఇంజిన్‌లోకి నీళ్లు వెళ్లి చెడిపోయింది. బోల్తాపడిన పడవ పైభాగంలో ఐదుగురు నిలుచుని ఆదుకునేవారి కోసం ఎదురుచూశారు. ఇలా రెండురోజులు గడిచిపోగా ఆకలి, తట్టుకోలేని దాహం వేసింది. నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి జీవం ఉన్న చేపలను ఆరగించి ఆకలిని తీర్చుకున్నారు.
దాహం తీర్చుకునేందుకు ఉప్పునీటిని తాగలేకపోయారు. మూత్రాన్ని దోసిట్లో పట్టుకుని తాగి దాహం తీర్చుకున్నారు. ఇలా వారం రోజులు గడిచిపోగా ఆకలి కారణంగా నలుగురు జాలర్లు స్పృహ తప్పిపోయారు. వారిని రక్షించుకుంటూ కాలం గడుపుతున్న మణిని మచిలీపట్నం సముద్రతీరంలో చేపలు పడుతున్న ఆంధ్రా జాలర్లు గుర్తించారు. వారిని చూడగానే మణి రక్షించండి అంటూ కేకలు వేయసాగాడు. ఆంధ్రా జాలర్లు వారందరినీ ఒడ్డుకు తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సతో కోలుకున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లు గత నెల 31వ తేదీన స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు జాలర్ల కుటుంబాలు సంతోషించాయి. మంగళవారం మీడియా ముందుకు వచ్చిన కడుంపాండి జరిగిన ఘటనను వివరించాడు. తమ ప్రాణాలు కాపాడిని ఆంధ్రా జాలర్లకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేశాడు.
మూత్రం తాగి బతికాం
Published Wed, Jun 3 2015 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 3:07 AM
Advertisement
Advertisement