Concern Programs
-
ఉద్యమ నినాదం.. 8.46
మినియాపోలిస్/వాషింగ్టన్: అమెరికాలో పోలీసుల దౌర్జన్యానికి, వివక్షకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి ‘8.46’అన్న అంకె నినాదంగా మారుతోంది. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్‌ను మే 25న మినియాపోలీస్ పోలీసు అధికారి డెరెక్ చెవెన్ నేలకు అదిమిపెట్టి ఉంచిన సమయం 8 నిమిషాల 46 సెకన్లు అని విచారణ సందర్భంగా తెలియడంతో ఉద్యమకారులు ఆ అంకెను నినాదంగా మార్చారు. ఈ సమయాన్ని ఇంత కచ్చితంగా ఎలా నిర్ధారించారన్న అంశంపై స్పష్టత లేకపోయినప్పటికీ ఆందోళనకారుల్లో మాత్రం బాగా ప్రాచుర్యం పొందింది. బోస్టన్, టాకోమా, వాషింగ్టన్లలో జరిగిన ప్రధర్శనలు 8.46 నిమిషాలపాటు జరగడం.. హ్యూస్టన్‌లో చర్చిల్లో ప్రార్థనలు నిర్వహించే వాళ్లు చేతుల్లో మైనపు వత్తులు పెట్టుకుని అంతే సమయం మోకాళ్లపై పాకుతూ నిరసన వ్యక్తం చేయడం ఈ అంకెకు ఏర్పడిన ప్రాధాన్యానికి సూచికలు. టెలివిజన్ చానళ్లు వయాకామ్‌సీబీఎస్ గతవారం ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పిస్తూ 8.46 నిమిషాలపాటు ప్రసారాలు నిలిపివేసింది. గూగుల్ సీఈఓ నివాళి 8 నిమిషాల 46 సెకన్లపాటు మౌనం వహించడం ద్వారా ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పించాలని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఉద్యోగులకు రాసిన లేఖలో కోరారు. జాతివివక్షపై జరిగే పోరుకు గూగుల్ సుమారు రూ.210 కోట్లు విరాళంగా ఇవ్వనుందన్నారు. జాతి అసమానతల నివారణ కోసం పనిచేస్తున్న సంస్థలకు కోటీ ఇరవై లక్షల డాలర్ల నగదు సాయం అందిస్తామని, సంస్థలు జాతి వివక్షపై పోరాడేందుకు, కీలకమైన సమాచారం అందించేందుకు 2.5 కోట్ల డాలర్ల విలువైన ప్రకటనలను గ్రాంట్ రూపంలో ఇస్తామని పిచాయ్ వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా సెంటర్ ఫర్ పోలీసింగ్ ఈక్విటీ అండ్ ఈక్వల్ జస్టిస్ ఇనిషియేటివ్‌కు పది లక్షల డాలర్ల విరాళం ఇవ్వనున్నట్లు తెలిపారు. జార్జ్ ఫ్లాయిడ్ ఉదంతం తరువాత అమెరికా వ్యాప్తంగా అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా రాజకీయంగా చురుకుగా మారారు. నవంబర్‌లో అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒబామా మరోసారి ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేస్తూండటం గమనార్హం. ‘సమాజంలోని సమస్యలను ఎత్తి చూపడం ద్వారా అధికారంలో ఉన్న వారిపై ఒత్తిడి పెంచాలి. అదే సమయంలో ఆచరణ సాధ్యమైన చట్టాలు, పరిష్కార మార్గాలు సూచించాలి’’అని అన్నారు. గాంధీ విగ్రహం ధ్వంసం అమెరికాలో జరుగుతున్న ఆందోళనల్లో భారతీయ దౌత్య కార్యాలయం వద్ద ఉన్న గాంధీజీ విగ్రహం ధ్వంసమైంది. జూన్ 2వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉండవచ్చునని దౌత్యకార్యాలయ సిబ్బంది భావిస్తున్నారు. ఈ అంశంపై అమెరికా విదేశీ వ్యవహారాల శాఖకు సమాచారం అందించామని, స్థానిక పోలీసు అధికారులు సంఘటనపై విచారణ ప్రారంభించారని అధికారులు తెలిపారు. శాంతి, అహింసలకు మారుపేరుగా భావించే గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేయడంపై భారత్‌లో అమెరికా రాయబారి కెన్ జుస్టర్ క్షమాపణలు కోరారు. ఫ్లాయిడ్‌కు కరోనా? ఫ్లాయిడ్ రెండు నెలల క్రితం కోవిడ్ బారిన పడినట్లు తెలిసింది. హెన్నిపిన్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ చేసిన శవపరీక్ష నివేదికలో ఈ విషయాన్ని పేర్కొన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రచురించింది. మినసోటా ఆరోగ్య శాఖ అధికారులు ఫ్లాయిడ్ నుంచి నమూనాలు సేకరించి పరీక్షలు జరిపారని కరోనా సోకినట్లు ఏప్రిల్ 3న నిర్ధారించారని ఆండ్రూ బేకర్ అనే ప్రఖ్యాత మెడికల్ ఎగ్జామినర్ తెలిపినట్లు కథనం తెలిపింది. అయితే అతడి మరణానికి కరోనాకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఫ్లాయిడ్‌కు కరోనా సోకినట్లు తనకు సమాచారం లేదని కుటుంబసభ్యుల కోరిక మేరకు శవపరీక్ష నిర్వహించిన మైకెల్ బాడెన్ తెలిపారు. అంత్యక్రియల నిర్వాహకులకు ఈ విషయం చెప్పలేదని దీంతో చాలామంది ఇప్పుడు కోవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారని అన్నారు. -
దిశ ఘటనపై ఢిల్లీలో ఆందోళనలు
సాక్షి, న్యూఢిల్లీ: దిశ ఘటనకు నిరసనగా ఢిల్లీలో ఆందోళనలు ఉధృతంగా కొనసాగుతున్నాయి. దేశంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం కఠిన చట్టం చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ద్వారా కేసులను త్వరితగతిన విచారించి దోషులను ఉరి తీయాలన్న డిమాండ్‌తో ప్రజా సంఘా లు, విద్యార్థి సంఘాలు, యువతులు మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఉద్యమించారు. హత్యాచారాలకు పాల్పడే దోషులను ఆరు నెలల్లో ఉరి తీయాలన్న డిమాండ్‌తో ఢిల్లీ మహిళా కమిషన్ చైర్పర్సన్ స్వాతి మలివాల్ నిరాహార దీక్షకు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. అత్యాచారాల కేసుల్లో దోషులను ఆరు నెలల్లో ఉరి తీయాలని ఆమె ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
మరో రిజర్వేషన్ల పోరాటం
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో మరాఠాల తర్వాత మరో సామాజిక వర్గం విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనలు చేపట్టింది. ధన్గర్ సామాజిక వర్గీయులు(గొర్రెల కాపరులు).. తమను షెడ్యూల్డ్ తెగ (ఎస్టీ)ల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం మహారాష్ట్రవ్యాప్తంగా నిరసనల్లో పాల్గొన్నారు. ధన్గర్ సంఘర్ష సమితి మహారాష్ట్ర రాజ్య (డీఎస్‌ఎస్‌ఎంఆర్) ఈ నిరసనలకు నేతృత్వం వహించింది. ముంబైతోపాటు విదర్భ, పశ్చిమ, ఉత్తర మహారాష్ట్రల్లో నిరసనలు సాగాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపై వాహనాలకు అడ్డంగా మేకలు, గొర్రెలను తోలి వినూత్నంగా రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్–ఎన్సీపీ కూటమి మహారాష్ట్రలో అధికారంలో ఉన్నప్పుడే ధన్గర్ ప్రజలు రిజర్వేషన్లు కోరుతూ ఆందోళనకు దిగారు. ప్రస్తుత బీజేపీ సీఎం ఫడ్నవిస్ అప్పట్లో ధన్గర్ సమాజం ఏర్పాటు చేసిన వేదికపై మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే తొలి మంత్రివర్గ సమావేశంలో ఈ సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లయినా తమ గురించి పట్టించుకోవడం లేదని ఆందోళనకారులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కల్పించే అంశంపై నివేదికను రూపొందిస్తున్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఈ నెల 26లోపు తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలనీ, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. -
బాబు వైఫల్యంతోనే రాష్ట్రం అధోగతి
స్కేయూ: సీఎం చంద్రబాబు పాలనా వైఫల్యంతోనే రాష్ట్రం అధోగతి పాలవుతోందని ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలనే డిమాండ్‌తో వైఎస్సార్ విద్యార్థి విభాగం గత రెండు రోజులుగా ఎస్కేయూ వేదికగా వివిధ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఎస్కేయూ ప్రధాన ద్వారం వద్ద శుక్రవారం వంటా–వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు ముందు ప్రత్యేక హోదాతో పాటు ప్యాకేజీ కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. ప్రత్యేక హోదా కల్పిస్తే రాయితీలతో కూడిన పరిశ్రమలు వస్తాయని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తే అరెస్ట్ చేస్తూ ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారని దుయ్యబట్టారు. అనంతరం రాప్తాడు నియోజకవర్గ సమన్వయ కర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి, రాష్ట్ర ప్రభుత్వం లొంగుబాటు ధోరణితో రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని విమర్శించారు. సీఎం చంద్రబాబు మీద నమ్మకం లేకపోవడంతోనే కేంద్రం ఆశించినంత స్థాయిలో నిధులు ఇవ్వలేదన్నారు. కేంద్రం గతంలో ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేయడమే ఇందుకు కారణమన్నారు. అనంతపురం నియోజకవర్గ సమన్వయ కర్త నదీం అహమ్మద్ మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతోనే పన్నురాయితీ, జీఎస్టీ, అమ్మకం పన్ను రాయితీలు లభిస్తాయని, ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మాత్రమేనన్నారు. కార్యక్రమంలో మాజీ మేయర్ రాగే పరుశురాం, చవ్వా రాజశేఖర్ రెడ్డి, వైవీ శివా రెడ్డి, అనంతపురం నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జీవీ లింగారెడ్డి, మద్ది రెడ్డి నరేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి హనుమంతురెడ్డి, ఎస్కేయూ అధ్యక్షుడు భాను ప్రకాష్‌రెడ్డి, క్రాంతికిరణ్, శ్రీనివాసరెడ్డి, జయచంద్రారెడ్డి , అశోక్‌రెడ్డి, తిరుపాల్‌నాయక్, హేమంత్, రాజా రెడ్డి, మనప్రీతిరెడ్డి, పునీత్, భవిత్‌రెడ్డి , జిల్లా ప్రధాన కా ర్యదర్శులు పెద్దన్న, బాబా సలాం యువజన విభాగం నగర అధ్యక్షుడు నాయుడు, బాలకృష్ణారెడ్డి, బిల్లే మం జునా«థ్, నూర్ మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
మూత్రం తాగి బతికాం
చెన్నై, సాక్షి ప్రతినిధి:‘నడి సంద్రంలో మునిగిన నావ, దాహం తీర్చుకునేందుకు ఏదీ త్రోవ...అందుకే మూత్రం తాగి ప్రాణాలు నిలబెట్టుకున్నాం’ అని సముద్రంలో చేపలవేటకు వెళ్లి వారం రోజుల పాటు అవస్థలు పడిన తమిళనాడు జాలర్లు తెలిపారు. వారి కథనం మేరకు.. చెన్నై కాశిమేడు జీవరత్నం నగర్‌కు చెందిన కడుంపాడి(42), మాయాండి (30), శక్తివేల్ (29), మణి (30), సురేష్ (32) గత నెల 21వ తేదీన ఫైబర్ బోటును తీసుకుని సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. 22వ తేదీ అర్ధరాత్రి రాక్షస అలల తాకిడికి వీరు ప్రయాణిస్తున్న బోటు బోల్తా పడింది. చేపలవేటకు వెళ్లిన వారు రెండురోజులైనా తిరిగి రాకపోవడంతో మత్స్యకార గ్రామాల్లో విషాదం అలుముకుంది. తమవారిని వెతికిపెట్టాలని ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. సముద్రతీర గస్తీదళాలు హెలికాప్టర్‌తో గాలించాయి. జాలర్లు సైతం అనేక బోట్లలో సముద్రంలో వెతికినా ఫలితం లేకపోయింది. ఈ పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో తమవారు క్షేమంగా ఉన్నారని సమాచారం అందడంతో తమిళ జాలర్ల కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నాయి. ఇదిలావుండగా జాలర్లు కొట్టుకుపోతున్న బోటును ఈదుకుంటూ వెళ్లి పట్టుకున్నారు. మరికొంత సేపటికి మళ్లీ రాక్షస అలరావడంతో పడవబోల్తా పడడమేగాక ఇంజిన్లోకి నీళ్లు వెళ్లి చెడిపోయింది. బోల్తాపడిన పడవ పైభాగంలో ఐదుగురు నిలుచుని ఆదుకునేవారి కోసం ఎదురుచూశారు. ఇలా రెండురోజులు గడిచిపోగా ఆకలి, తట్టుకోలేని దాహం వేసింది. నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి జీవం ఉన్న చేపలను ఆరగించి ఆకలిని తీర్చుకున్నారు. దాహం తీర్చుకునేందుకు ఉప్పునీటిని తాగలేకపోయారు. మూత్రాన్ని దోసిట్లో పట్టుకుని తాగి దాహం తీర్చుకున్నారు. ఇలా వారం రోజులు గడిచిపోగా ఆకలి కారణంగా నలుగురు జాలర్లు స్పృహ తప్పిపోయారు. వారిని రక్షించుకుంటూ కాలం గడుపుతున్న మణిని మచిలీపట్నం సముద్రతీరంలో చేపలు పడుతున్న ఆంధ్రా జాలర్లు గుర్తించారు. వారిని చూడగానే మణి రక్షించండి అంటూ కేకలు వేయసాగాడు. ఆంధ్రా జాలర్లు వారందరినీ ఒడ్డుకు తీసుకొచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్సతో కోలుకున్న తమిళనాడుకు చెందిన ఐదుగురు జాలర్లు గత నెల 31వ తేదీన స్వగ్రామాలకు చేరుకున్నారు. ప్రాణాలతో తిరిగి వచ్చినందుకు జాలర్ల కుటుంబాలు సంతోషించాయి. మంగళవారం మీడియా ముందుకు వచ్చిన కడుంపాండి జరిగిన ఘటనను వివరించాడు. తమ ప్రాణాలు కాపాడిని ఆంధ్రా జాలర్లకు మరీ మరీ కృతజ్ఞతలు తెలియజేశాడు.