చావో రేవో!
సాక్షి, చెన్నై: తమిళ జాలర్లపై శ్రీలంక సేనల పైశాచికత్వం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. యూపీఏ హయూంలో తమ మీద జరిగిన వరుస దాడులతో విసిగి వేసారిన తమిళ జాలర్లు, ఎన్నికల వేళ నరేంద్ర మోడీ ఇచ్చిన హామీతో ఊరట చెందారు. అయితే, కేంద్రంలో అధికారం మారిందేగానీ, జాలర్లకు భద్రత మాత్రం దక్కలేదు. శ్రీలంక సేనలు తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నారుు. బందీలుగా పట్టుకెళ్లడం, కేంద్రం ఒత్తిడితో విడిచి పెట్టడం పరిపాటిగా మారింది. అయితే, జాలర్ల పడవలను మాత్రం శ్రీలంక సేనలు అప్పగించడంలేదు.
కేంద్రం ఇటీవల కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ జాలర్లకు పుండు మీద కారం చల్లినట్టు అయింది. శ్రీలంకకు దారాదత్తం చేసిన ఒకప్పటి తమిళ భూభాగమైన కచ్చదీవుల్లో తమిళ జాలర్లకు చేపలను వేటాడే హక్కులేదని ప్రకటించడం ఆగ్రహం కలిగించింది. యూపీఏ బాణిలోనే కొత్త ప్రభుత్వం నడుస్తుండడంతో తమ భద్రత విషయంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో ఢీ కొట్టేందుకు జాలర్లు రెడీ అయ్యారు. వదిలేద్దాం: దినదిన గండంగా చేపల వేట మారుతుండడంతో ఈ వృత్తినే వదిలేద్దామన్న నిర్ణయానికి రామేశ్వరం జాలర్లు వచ్చారు. అప్పోసప్పో చేసి చేపల వేటకు వెళితే, చివరకు చిల్లి గవ్వ మిగలడంలేదని, ఇక, లంక సేన దాడు ల పుణ్యమా అని పడవలు పోగొట్టుకోవాల్సి వస్తోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
తమ భద్ర విషయంలో చావో రేవో తేల్చుకోవడం లేదా, వంశ పారంపర్యంగా వస్తున్న వృత్తిని వదులుకోవడమా? అన్నది తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. జాలర్ల సంఘాలన్నీ ఏకమై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు చేశారుుగడువు : సోమవారం రామేశ్వరం హార్బర్‌లో జాలర్ల సంఘాలు, జాలర్ల నేతృత్వంలో భారీ సమావేశం జరిగింది. ఇందులో ప్రధానంగా తమ భద్రత లక్ష్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. కడలిలో తమకు భద్రత కల్పించే విధంగా భరోసా ఇవ్వడం, లంక సేనల ఆగడాలకు పూర్తిగా కళ్లెం వేయడం లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడికి సిద్ధం అయ్యారు. కచ్చదీవుల్లో చేపల వేటపై తమకు ఉన్న హక్కును కాలరాసే విధంగా కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌ను పునః సమీక్షించడం, స్వేచ్ఛాయుత వాతావరణంలో తమకు అక్కడ చేపల్ని వేటాడుకునే అవకాశం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.