గస్తీ ముమ్మరం
చెన్నై, సాక్షి ప్రతినిధి : పాకిస్తాన్ ముష్కరులతో కూడిన మరపడవ భారతదేశ సముద్ర జలాల్లో ప్రవేశించడం, దగ్ధం కావడం వంటి పరిణామాలతో రాష్ట్రంలోని సముద్ర తీరాల్లో శనివారం నుంచి గస్తీని పెంచారు. దక్షిణాది రాష్ట్రాల సరిహద్దుల్లో మావోయిస్టులు పొంచి ఉన్నారనే సమాచారంతో అప్రమత్తంగా ఉన్న పోలీసులకు మరపడవ ద్వారా పాకిస్తాన్ ముష్కరులు భారతదేశంలోకి ప్రవేశించే యత్నం కంగారుపెట్టింది. రాష్ట్రంలోకి మావోయిస్టులు చొరబడకుండా సరిహద్దు ల్లో సిద్ధంగా ఉన్న పోలీసు బలగాలకు తాజా సంఘటన అదనపు అప్రమత్తతను సూచిం చింది. రాష్ట్రంలో చెన్నై నుంచి కన్యాకుమారి వరకు ఉన్న సముద్రతీర ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేశారు.
బందోబస్తు ఏర్పాట్లపై సముద్ర తీర గస్తీదళాల అదనపు డీజీపీ శైలేంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ, భారత సరిహద్దు సముద్ర జలాల్లో పాకిస్తాన్ పడవ ప్రవేశం తరువాత రాష్ట్రంలోని సరిహద్దులన్నీ కట్టుదిట్టం చేశామన్నారు. రాత్రి వేళ గస్తీని మరింతగా పెంచినట్లు చెప్పారు. సముద్ర తీర గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు తారసపడితే వెంటనే సమాచారం ఇవ్వాలని మత్స్యకారులను హెచ్చరించినట్లు తెలిపారు. సాధారణ పోలీసులు, గస్తీ దళాలు కలిసి బందోబస్తును పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. మత్స్యకార గ్రామాల్లో పోలీసుల సంఖ్యను పెంచిన దృష్ట్యా జాలర్లు సహకరించాలని కోరారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లే జాలర్లు విధిగా తమ గుర్తింపు కార్డును ధరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
పోలీస్ కంట్రోలు రూముకు బెదిరింపు
నగరంలోని రెండుచోట్ల బాంబును అమర్చినట్లుగా చెన్నై పోలీస్ కంట్రోల్ రూముకు శుక్రవారం రాత్రి ఫోన్ కాల్ వచ్చింది. రాత్రి 11.30 గంటలకు గుర్తు తెలియని వ్యక్తి తాను ఇంటెలిజెన్స్ విభాగం నుంచి మాట్లాడుతున్నానని పరిచ యం చేసుకుని, మౌంట్ రోడ్డు కథిడ్రల్ రోడ్డు, ఎల్డామ్స్ రోడ్డుల్లో బాంబులు పెట్టినట్లు చెప్పాడు. వెంటనే వాహనాల రాకపోకలను ఆపి ప్రజల ప్రాణాలను కాపాడండి అంటూ ఫోన్ కట్ చేశాడు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ రెండు రోడ్లలో ట్రాఫిక్‌ను మళ్లించి రాత్రి 1 గంట వరకు తనిఖీ చేపట్టారు. డాగ్‌స్క్వాడ్ బృందం ఎంతగా వెతికినా బాంబు దొరకలేదు. బాంబు సమాచారం ఎవరో ఆకతాయిపనిగా నిర్ధారించుకుని ఊపిరి పీల్చుకున్నారు. ఫోన్ చేసింది ఎవరో తెలుకునే పనిలోపడ్డారు.