
దగ్ధమవుతున్న చెన్నై మరపడవ
ముత్తుకూరు: చెన్నై హార్బర్ నుంచి గురువారం 10 మంది మత్స్యకారులతో బయలుదేరిన ఓ మెకనైజ్‌డ్ ఫిషింగ్ బోటు బంగాళాఖాతంలో అగ్ని ప్రమాదానికి గురైంది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఇండియన్ కోస్టుగార్డ్స్(ఐఎస్‌జీఎస్) వెంటనే సముద్రంలోకి వెళ్లి ఎగసి పడుతున్న మంటలను అదుపు చేసి, ఆర్పివేశారు. ఐఎస్‌జీఎస్ అధికారుల కథనం ప్రకారం..చెన్నై కాసిమేడుకు చెందిన 10 మంది మత్స్యకారులు మరపడవలో చేపల వేటకు బయలు దేరారు. కృష్ణపట్నం పోర్టుకు సుమారు 12.5 నాటికల్ మైళ్ల దూరంలో శుక్రవారం మధ్యాహ్నం ఈ మరపడవలోని గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు పడవను చుట్టు ముట్టాయి.
ఇందులోని మత్స్యకారులంతా నీటిలోకి దూకి, మరో పడవలోకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. చెన్నైలోని ‘మారిటైమ్ రెస్క్యూ కో–ఆర్డినేషన్ సెంటర్’ ద్వారా ఈ ప్రమాద విషయం కృష్ణపట్నం ఇండియన్ కోస్టుగార్డ్స్ కు చేరింది. ఐఎస్‌జీఎస్ సీ–449 నౌక ద్వారా కోస్టుగార్డులు సముద్రంలోకి వెళ్లి, పడవ నుంచి వెలువడే మంటలను ఆర్పివేశారు. వీరికి సహాయంగా చెన్నై నుంచి ఐఎస్‌జీఎస్ సీ–436 నౌక ప్రమాద స్థలికి చేరింది. అతికష్టంపై మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.