
సాక్షి, చెన్నై: తమ కుటుంబంలోకి తొలి ఆడబిడ్డ వచ్చిందన్న ఆనందంలో ఉన్న ఓ కుటుంబాన్ని ఏసీ రూపంలో మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం తాగి నిద్రకు ఉపక్రమించిన బిల్డర్ ఏసీలో షార్ట్‌సర్క్యూట్ కారణంగా జరిగిన అగ్నిప్రమాదంలో సజీవ దహనం అయ్యాడు. వివరాల్లోకి వెళితే.. చెన్నై చూలైమేడు ఇలంగో అడిగల్ వీధికి చెందిన సురేష్ కుమార్(52) భవన నిర్మాణ సంస్థ నడుపుతున్నాడు. ఆయనతో పాటు ఇంట్లో కుమారుడు స్టీఫెన్ రాజ్, కోడలు సుజిత ఉన్నారు.
కోడలు సుజిత బుధవారం పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వడపళణిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్న తల్లీబిడ్డను కుటుంబసభ్యులందరూ వెళ్లి పరామర్శించారు. ఇక సురేష్‌కుమార్ ఆనందానికి అవధులు లేవు. మనవరాలు పుట్టిన ఆనందంతో మిత్రులు, సహచరులకు ఫోన్లు చేసి మరీ చెప్పేశాడు. కుటుంబ సభ్యులందరూ ఆస్పత్రిలో ఉండడంతో బుధవారం రాత్రి ఒంటరిగా సురేష్‌కుమార్ ఇంటికి వెళ్లాడు. మిత్రులకు ఫోన్లు చేస్తూ, మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం సేవించాడు. తన గదిలో ఏసీ సైతం వేసుకుని నిద్రకు ఉపక్రమించినట్టుంది.
గురువారం వేకువజామున సురేష్‌కుమార్ ఇంటి పై అంతస్తు నుంచి పొగ రావడాన్ని ఇరుగు పొరుగు వారు గుర్తించారు. పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టిలోనికి వెళ్లారు. అప్పటికే అక్కడ సురేష్‌కుమార్ సజీవదహనమై పడి ఉండడంతో మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. ఆ గదిలో మద్యం బాటిళ్లు, సిగరేట్ ముక్కలు ఉండటాన్ని గుర్తించారు. ఏసీలో షార్ట్ సర్క్యూట్ జరిగి ఉండడంతో ఈ ప్రమాదం జరిగినట్టు నిర్ధారించారు. మనవరాలు పుట్టిన ఆనందంలో అతిగా మద్యం సేవించడంతో విద్యుదాఘాతం నుంచి తప్పించుకోలేక ఆయన ఆహుతై ఉంటాడని పోలీసులు పేర్కొంటున్నారు.
చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్ డిమాండ్, అవే కావాలంటున్న ప్రజలు!
Comments
Please login to add a commentAdd a comment