విధ్వంసం సృష్టించిన లంక నేవీ
సాక్షి, చెన్నై: తమ సముద్ర జలాల్లోకి ప్రవేశించారంటూ తమిళ జాలర్లను నిర్బంధించే శ్రీలంక నేవీ ఈసారి మరింత పేట్రేగిపోయింది. ఏకంగా తమిళ జాలర్ల బోట్లపై దాడి చేసి ధ్వంసం చేసింది. కచ్ఛతీవు దీవి సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లిన తమిళజాలర్లను వెంటాడిన శ్రీలంక నావికా దళం మరోసారి ఇక్కడికి వస్తే తీవ్ర పరిణామాలుంటాయని హెచ‍్చరించింది. అంతటితో ఆగక దాదాపు ఇరవై బోట్లను ధ్వంసం చేసింది. వారి దాడిలో 10మంది మత్స్యకారులు కూడా గాయపడ్డారు.
క్షతగాత్రులను తోటి వారు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత వారిని డిశ్చార్జి చేశారు. సోమవారం రాత్రి సముద్రంలోకి వెళ్లిన దాదాపు 2,500 మంది మత్స్యకారులను శ్రీలంక నేవీ బలవంతంగా వెనక్కి పంపేసింది. తమ బంధీలుగా చేసుకున్న దాదాపు 80 మంది మత్స్యకారులను నేడు విడుదలయ్యారు. వీరంతా రామనాథపురం, పుదుక్కొట్టై, నాగపట్టణం, కన్యాకుమారి, తిరునల్వేలి, మధురై, పుదుచ్చేరి జిల్లాలకు చెందిన వారని అధికారులు తెలిపారు.