పీఎంకు ‘పన్నీర్’ తొలిలేఖ | Tamil Nadu CM Panneerselvam writes to PM Modi on fishermen issue | Sakshi
Sakshi News home page

పీఎంకు ‘పన్నీర్’ తొలిలేఖ

Published Thu, Oct 2 2014 1:25 AM | Last Updated on Sat, Sep 2 2017 2:14 PM

పీఎంకు ‘పన్నీర్’ తొలిలేఖ

పీఎంకు ‘పన్నీర్’ తొలిలేఖ

జాలర్ల విడుదలకు వినతి
చెన్నై, సాక్షి ప్రతినిధి : పీఎంకు లేఖ రాయడం ద్వారా కొత్త సీఎం విధుల్లో నిమగ్నమయ్యూరు. శ్రీలంక చెరలో ఉన్న తమిళనాడు మత్స్యకారుల విడుదలపై జోక్యం చేసుకోవాలని ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్‌సెల్వం తొలిసారిగా ప్రధానికి లేఖను రాశారు.
 రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న ప్రధాన సమస్యల్లో శ్రీలంక వివాదం ఒకటి. భారత్ చేతుల్లోని కచ్చదీవులపై హక్కులను శ్రీలంకకు అప్పగించిన నాటి నుంచి అంటే సుమారు మూడు దశాబ్దాలుగా ఈ వివాదం నలుగుతూనే ఉంది. రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలోకి వచ్చినా, ముఖ్యమంత్రి పీఠంపై ఎవరు కూర్చున్నా వారి ముందు ఉండే ప్రధాన సమస్య శ్రీలంక దాష్టీకమే.

తమ సరిహద్దుల్లోని కచ్చదీవుల్లోకి తమిళ జాలర్ల చేపలవేట సాగిస్తున్నారని ఆరోపిస్తూ శ్రీలంక సముద్రతీర గస్తీ దళాలు తరచూ విరుచుకు పడుతుంటాయి. మత్స్యకారులను, వారి పడవలను వారి దేశానికి తీసుకెళుతుంటారుు. భారతదేశం నుంచి ఒత్తిడి రాగానే విడిచిపెట్టడం, మళ్లీ చెరపట్టడం శ్రీలంకకు పరిపాటి. ఇలా ప్రస్తుతం శ్రీలంక చెరలో ఉన్న 20 మంది జాలర్లను, 75 మరపడవలను విడిపించేలా చొరవ తీసుకోవాలని ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం బుధవారం ప్రధాని నరేంద్రమోడీకి ఉత్తరం రాశారు. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత  సీఎం హోదాల్లో కేంద్రంపై ఒత్తిడి తె స్తూ సాగించిన కృషి ఫలితంగా గతంలో 76 మంది మత్స్యకారుల్లో 72 మందిని మంగళవారం నాడు శ్రీలంక విడుదల చేసిందని తెలిపారు.

జాలర్ల విడుదలపై జోక్యం చేసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. అయితే, మత్స్యకారులను విడుదల చేసినా వారి స్వాధీనంలో ఉన్న 71 మరపడవలను మాత్రం అప్పగించలేదని ప్రధాని దృష్టికి సీఎం పన్నీర్‌సెల్వం తన ఉత్తరం ద్వారా తీసుకెళ్లారు. గతనెల 27వ తేదీన రామేశ్వరం నుంచి చేపల వేటకు వెళ్లిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక మళ్లీ చెరపట్టిందని తెలిపారు. జాలర్లందరినీ కాంగేశన్ హార్బర్‌కు తరలించి శ్రీలంక కోర్టులో ప్రవేశపెట్టగా ఈనెల 10 వ తేదీ వరకు రిమాండ్ విధించినట్లు చెప్పారు. గత నెల 29న మరో 16 మందిని శ్రీలంక దళాలు అరెస్ట్ చేశాయన్నారు. శ్రీలంక చెరలో ఉన్న మత్స్యకారులను విడుదల చేయించాలని, అలాగే వారి స్వాధీనంలో ఉన్న మరపడవలను సైతం అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఎం పన్నీర్‌సెల్వం బుధవారం ప్రధానికి లేఖ రాశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement