సాక్షి, చెన్నై : అన్నాడీఎంకే తిరుగుబాటు నేత, ఆర్కే నగర్ ఎమ్మెల్యే దినకరన్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి పళనిస్వామి తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. మూడు నెలల్లో పళని ప్రభుత్వం కూలిపోతుందంటూ ఫలితాల రోజున దినకరన్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సీఎం పళని, శనివారం ఊటీలో నిర్వహించిన ఎంజీఆర్ జయంతి ఉత్సవాల్లో స్పందించారు.
‘‘1974లో నేను అన్నాడీఎంకేలో చేరా. కార్యకర్త స్థాయి నుంచి పని చేసి ఆ స్థాయికి ఎదిగా. నాతోపాటు చాలా మంది అన్నాడీఎంకే కోసం అహర్శిశలు కృషి చేశాం. కానీ, దినకరన్ మాత్రం దొడ్డి దారిలో పార్టీలోకి ప్రవేశించారు అని అన్నారు. ఆర్కే నగర్ లో దినకరన్ విజయం సాధించడానికి కారణం హవాలా ఫార్ములానే అని పళని ఉద్ఘాటించారు. ఇదే సమయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న దినకరన్ ఎక్కడకు వెళ్లాలో అక్కడికే వెళతారంటూ వ్యాఖ్యలు చేశారు.
తాము ప్రజల కోసం పాటుపడుతుంటే... దినకరన్ సొంత కుటుంబం కోసం పాకులాడుతున్నారని పళని విమర్శించారు. ఎమ్మెల్యేగా గెలిచిన దినకరన్ ఆ పదవిని కొంత కాలం మాత్రమే అనుభవించగలరని.. భవిష్యత్తులో అతనికి గుణపాఠం చెప్పి తీరతామని పళని పేర్కొన్నారు. ఇక రజనీకాంత్ పొలిటికల్ ఎంట్రీ అంశంపై స్పందించేందుకు ఆయన నిరాకరించారు.
దినకరన్ ఓ బచ్చా... పన్నీర్ సెల్వం
మరోవైపు డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం కూడా దినకరన్ పై మండిపడ్డారు. అన్నాడీఎంకేలో తాను సీనియర్ నని, దినకరన్ ఓ బచ్చా.. ఎల్‌కేజీ స్టూడెంట్ అని ఎద్దేవా చేశారు. జయలలిత చేత పార్టీ నుంచి బహిష్కరింపబడిన వారు ఇప్పుడు పార్టీపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. పార్టీని కూల్చాలని దినకరన్, డీఎంకేలు చేసే యత్నాలు ఫలించవని ఆయన చెప్పారు.
రజనీ ఎంట్రీపై దినకరన్ స్పందన...
రజనీకాంత్ రాజకీయ ప్రవేశ ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వేళ... దినకరన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రకటన వెలువడటానికి ముందే నిన్న ఓ జాతీయ మీడియాతో దినకరన్ మాట్లాడుతూ.. తమిళనాడుకు ఒకే ఎంజీఆర్.. ఒకే అమ్మ(జయలలిత) ఉంటారు. వారి స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు అని తెలిపారు. అమ్మ విధేయులను తప్ప వేరే ఏ ముఖాన్ని ఆమె అభిమానులు అంగీకరించబోరని దినకరన్ చెప్పారు.
తమిళ రాజకీయంలో ప్రస్తుతానికి ప్రతిపక్ష డీఎంకే ప్రేక్షక పాత్ర వహిస్తుండగా.. ఈ నలుగురు మాత్రం వార్తల్లో నిలుస్తూ ట్రెండింగ్‌గా మారారు.
Comments
Please login to add a commentAdd a comment