‘జీఎస్టీ’ కోసం మళ్లీ భేటీ
పార్లమెంటు వర్షాకాల భేటీపై వెంకయ్య సంకేతాలు
* వివిధ రాజకీయ పార్టీల నేతలతో ప్రభుత్వం మంతనాలు
* కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత ఖర్గేతో భేటీ అయిన వెంకయ్య
* అవసరమైతే సోనియా, రాహుల్‌లను కలిసేందుకూ సిద్ధం
న్యూఢిల్లీ: వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) బిల్లు ఆమోదం కోసం పార్లమెంటు వర్షాకాల భేటీని త్వరలో మళ్లీ సమావేశపరచే అవకాశముందని కేంద్ర ప్రభుత్వం సూచనప్రాయంగా తెలిపింది. తేదీలు ఇంకా ఖరారు కానప్పటికీ.. వచ్చే నెల (సెప్టెంబర్)లో సమావేశాలు జరిగే అవకాశముందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
బిల్లు ఆమోదం కోసం సహకరించాలని కోరుతూ వివిధ రాజకీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించింది. పార్లమెంటు సమావేశాలు ఈ నెల 13వ తేదీన నిరవధిక వాయిదా పడిన అనంతరం.. ఆ సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా (పూర్తిగా ముగించకుండా) ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మంగళవారం లోక్‌సభలో కాంగ్రెస్ పక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గేను కలిశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లుపై తాను ఇప్పటికే పలు పార్టీల నేతలను కలిశానని చెప్పారు.
పార్లమెంటు సమావేశాలు సజావుగా సాగేందుకు అవసరమైతే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీలను కూడా కలిసేందుకు సిద్ధమని పేర్కొన్నారు. అన్ని రాజకీయ పార్టీలూ జాతీయ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. ‘‘పార్లమెంటు పనిచేయాలి. ప్రజాస్వామ్యంలో ఆరోగ్యవంతమైన చర్చకు ప్రత్యామ్నాయం లేదు. జీఎస్టీ, రియల్ ఎస్టేట్ నియంత్రణ, భూసేకరణ బిల్లులు చాలా ముఖ్యమైనవి. జీఎస్టీ బిల్లు ఆమోదంలో జాప్యం జరిగితే.. భారత ప్రజలు, ప్రత్యేకించి యువత ఆకాంక్షలను అది దెబ్బతీస్తుంది’’ అని పేర్కొన్నారు.
జీఎస్టీ బిల్లుకు ఎప్పుడు ఆమోదం లభిస్తుందని ప్రభుత్వం ఆశిస్తోందని ప్రశ్నించగా.. ‘‘సాధ్యమైనంత త్వరలో’’ అని బదులిచ్చారు. ఆ బిల్లుకు కాంగ్రెస్ సహా పలు పార్టీలు కోరుతున్న సవరణల గురించి ప్రస్తావించగా.. పార్లమెంటు ప్రారంభమైతే వాటిని పరిష్కరించగలమని.. ప్రభుత్వం వాటిని పరిశీలించే ఆలోచనతోనే ఉందని, అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘‘ఆగస్టు 31వ తేదీ వరకూ సమయం ఉంది.
గడువులోగా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. భూసేకరణ ఆర్డినెన్స్‌ను మళ్లీ జారీ చేయకపోతే.. భూసేకరణకు సంబంధించి మరో 13 చట్టాలు కూడా చెల్లకుండాపోతాయి’’ అని వివరించారు. ప్రస్తుతం అమలులో ఉన్న భూసేకరణ ఆర్డినెన్స్ గడువు ఈ నెల 31వ తేదీతో ముగుస్తున్నందున ఈ లోగా దాని స్థానంలో చట్టం తెచ్చే అవకాశం లేకపోవటంతో.. నాలుగోసారి భూ ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశముందని వెంకయ్య పరోక్షంగా సూచించారు.
తుది బిల్లును చూశాకే: కాంగ్రెస్
న్యూఢిల్లీ/లక్నో: ప్రభుత్వం తుదిగా రూపొందించిన జీఎస్టీ బిల్లును పరిశీలించే వరకూ ఆ బిల్లుకు తాము మద్దతు ఇచ్చేదీ లేనిదీ చెప్పలేమని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. వెంకయ్య నాయుడు తనను కలసిన అనంతరం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో వేర్వేరుగా ఆమోదించాల్సి ఉందని.. రెండు సభల సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి ఆమోదించరాదని పేర్కొన్నారు. సంయుక్త సమావేశం ఏర్పాటు చేయాలంటే 14 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల్సి ఉంటుందన్నారు.
జీఎస్టీ బిల్లుకు కాంగ్రెస్ వ్యతిరేకం కాదని ఆ పార్టీ సీనియర్ నేత జైరాం రమేశ్ ఉద్ఘాటించారు. అది రాజ్యసభ ఆమోదం పొందాలంటే.. 4 సవరణలు ప్రతిపాదించిన కాంగ్రెస్ మద్దతు కీలకమని లక్నోలో అన్నారు. ‘‘జీఎస్టీ దేశ ప్రయోజనానికి సంబంధించినదే. కానీ.. 2011లో (యూపీఏ హయాంలో) ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టినపుడు ఒక్క వ్యక్తి కారణంగా - నాటి గుజరాత్ సీఎం నరేంద్రమోదీ కారణంగా బీజేపీ దానిని వ్యతిరేకించింది.
ఇప్పుడు అదే వ్యక్తి జీఎస్టీ ప్రాధాన్యం గురించి ప్రచారం చేస్తున్నారు.. ఆ బిల్లు తెచ్చిన ఘనత కాంగ్రెస్‌కు దక్కరాదని భావిస్తున్నారు’’ అని పేర్కొన్నారు. ప్రస్తుత రూపంలోని బిల్లులో చాలా లోపాలు ఉన్నాయన్నారు. పన్ను రేటు నిర్ణయించటం, పురపాలక సంఘాలు, పంచాయతీలకు పరిహారం, వివాదాల పరిష్కారానికి స్వతంత్ర వ్యవస్థ ఏర్పాటు వంటివి అందులో ఉన్నాయని చెప్పారు.