లోక్‌సభ నిరవధిక వాయిదా | Indefinite Adjournment of the Lok Sabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభ నిరవధిక వాయిదా

Published Fri, Dec 20 2024 11:13 AM | Last Updated on Fri, Dec 20 2024 12:39 PM

Indefinite Adjournment of the Lok Sabha

ఢిల్లీ : లోక్‌సభ నిరవధికంగా వాయిదా పడింది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అవమాన పరిచారంటూ ఇండియా కూటమి నేతలు పార్లమెంట్ శీతాకాల సమావేశాల చివరి రోజైన శుక్రవారం పార్లమెంట్‌ వద్ద నిరసన చేపట్టారు. విపక్ష నేతల నిరసనకు పోటా పోటీగా ఎన్డీయే కూటమి నేతలు సైతం ప్లకార్డ్‌లతో ఆందోళనకు దిగారు. దీంతో సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

నవంబర్ 25న ప్రారంభమైన పార్లమెంట్‌ శీతాకాల సమావేశం మొదటి వారంలో పలు మార్లు వాయిదా పడింది. రాజ్యాంగం, ఫెడరలిజం, ప్రజాస్వామ్యంపై డిబేట్,బీఆర్ అంబేద్కర్‌పై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం, ప్రియాంక గాంధీ లోక్‌సభ అరంగేట్రం వంటి అనేక అంశాలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో ప్రధాన చర్చకు దారి తీశాయి.  

పార్లమెంట్‌ సమావేశాల ప్రారంభం తొలి వారంలో గౌతమ్ అదానీపై అమెరికా వేసిన అభియోగంపై చర్చ జరగాలని డిమాండ్ చేయడంతో పాటు పలు అంశాలపై ప్రతిపక్షాలు నిరసనలు చేపట్టాయి. చర్చకు అధికార పక్షం అంగీకరించకపోవడంతో నిరసనలకు దారి తీసింది.  

ఈ సెషన్‌లోనే  'ఒక దేశం, ఒకే ఎన్నికల' బిల్లుపై చర్చ జరిగింది. జమిలి ఎన్నికలపై విపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో  జమిలి ఎన్నికల కోసం లోక్‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లుపై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం 31 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని ఏర్పాటుచేసింది. ఈ మేరకు తీర్మానాన్ని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్‌వాల్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.  బడ్జెట్‌ సమావేశాల చివరి రోజు ఇవాళ జమిలి ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి లోక్ సభ పంపంది. 

రాజ్యసభ ఛైర్మన్‌ జగదీప్‌ ధన్‌ఖడ్‌పై విపక్షాల అవిశ్వాస తీర్మానం వీగింది. ధన్‌ఖడ్‌ పక్షపాతంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. అయితే, 14 రోజుల నోటీసు లేకపోవడం,డ్రాఫ్టింగ్‌లో లోపాలతో సహా విధానపరమైన కారణాలతో అవిశ్వాస తీర్మానాన్ని పక్కన పెట్టారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement