అంబుడ్స్‌మన్ తరహాలో ఏర్పాటు చేయాలి
పన్నును 15 శాతానికి తగ్గించాలి
రాష్ట్రాల స్థాయిలో యూనివర్సిటీలు
పరిశ్రమల మండలి అసోచామ్ డిమాండ్
ఎంస్‌ఎంఈలపై నివేదిక విడుదల
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్‌ఎంఈలు) కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని అసోచామ్ డిమాండ్ చేసింది. ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ తరహాలో ఇది ఉండాని.. పలు శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఈ పోర్టల్ ద్వారా లేవనెత్తేందుకు అవకాశం ఉండాలని కోరింది.
ఫిర్యాదుల దాఖలు, పరిష్కారం విషయంలో ఎంఎస్‌ఎంఈలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయంటూ ఈ కీలక సూచన చేసింది. వ్యాపార నిర్వహణలో ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈగ్రోవ్ ఫౌండేష్ సాయంతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఎంఎస్‌ఎంఈ సమస్యల పరిష్కారం, వాటి బలోపేతానికి సూచనలతో ఒక నివేదికను విడుదల చేసింది.
‘‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే లక్ష్యంలో భాగంగా ఎంఎస్‌ఎంఈలకు సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక, కార్యాచరణను ఈ నివేదిక తెలియజేస్తుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని మన ఎంఎస్‌ఎంఈలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంక్‌లు, దిగ్గజ కంపెనీల నుంచి మద్దతు అవసరం’’అని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నయ్యర్ పేర్కొన్నారు. ఎంఎస్‌ఎంఈలకు కార్పొరేట్ ఆదాయపన్ను రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని, సులభతర జీఎస్‌టీ వ్యవస్థను తీసుకురావాలని అసోచామ్ కోరింది.
కేంద్రీకృత పోర్టల్..
ఎంఎస్‌ఎంఈల నమోదు, వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించేందుకు ఆన్‌లైన్ పోర్టల్ తీసుకురావాలని అసోచామ్ తన నివేదికలో కోరింది. జీఎస్‌టీ రిజి్రస్టేషన్, నిబంధనల అమలు ప్రక్రియలను సైతం సులభతరంగా మార్చాలని పేర్కొంది. స్పష్టమైన నిబంధనలతో మద్దతుగా నిలవాలని కోరింది.
సహేతుక కారణాలున్నప్పటికీ సకాలంలో జీఎస్‌టీ రిటర్నుల ఫైలింగ్, చెల్లింపులు చేయని ఎంఎస్‌ఎంఈలపై కఠిన జరిమానాలు విధిస్తున్నట్టు పేర్కొంది. జాప్యం తీవ్రత, కారణాలకు అనుగుణంగా పెనాల్టీలో మార్పులు ఉండాలని సూచించింది. జరిమానాలు ఎంఎస్‌ఎంఈలకు భారంగా మారరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాకారం కావాలంటే వ్యాపార నమూనాలో నిర్మాణాత్మక మార్పు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు.
‘‘ఈ నిర్మాణాత్మక మార్పులో ఎంస్‌ఎంఈలు భాగంగా ఉండాలి. అభివృద్ధి చెందిన భారత్‌లో ఎంఎస్‌ఎంఈలు గొప్ప పాత్ర పోషించాలి. మా అధ్యయనం ఇదే అంశాన్ని బలంగా చెప్పింది’’అని సూద్ వివరించారు. పెరుగుతున్న కారి్మక శక్తికి ఎంఎస్‌ఎంఈలు పరిష్కారం చూపించగలవని, ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించగలవని ఈగ్రోవ్ వ్యవస్థాపక చైర్మన్ చరణ్‌సింగ్ అన్నారు.
వ్యవసాయ యూనివర్సిటీల మాదిరే ప్రతీ రాష్ట్రంలోనూ ఎంఎస్‌ఎంఈ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని, ఎంఎస్‌ఎంఈల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం ఎంఎస్‌ఎంఈలకు ప్రత్యేకంగా సమన్వయ మండలిని ఏర్పాటు చేసి, పథకాల అమలు సాఫీగా సాగేలా చూడాలని, రాష్ట్రాల పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఈ నివేదిక సూచించింది. జీడీపీలో 30 శాతం వాటా, తయారీ రంగంలో 45 శాతం వాటా, ఎగుమతుల్లో 46 శాతం వాటా కలిగిన ఎంఎస్‌ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక గుర్తు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment