MSME Ministry
-
ఎంఎస్ఎంఈలకు కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్
న్యూఢిల్లీ: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈలు) కేంద్రీకృత ఫిర్యాదుల పోర్టల్‌ను ఏర్పాటు చేయాలని అసోచామ్ డిమాండ్ చేసింది. ఆర్బీఐ అంబుడ్స్‌మన్ తరహాలో ఇది ఉండాని.. పలు శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అంశాలు ఈ పోర్టల్ ద్వారా లేవనెత్తేందుకు అవకాశం ఉండాలని కోరింది. ఫిర్యాదుల దాఖలు, పరిష్కారం విషయంలో ఎంఎస్ఎంఈలు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నాయంటూ ఈ కీలక సూచన చేసింది. వ్యాపార నిర్వహణలో ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లపై ఈగ్రోవ్ ఫౌండేష్ సాయంతో అసోచామ్ సర్వే నిర్వహించింది. ఎంఎస్ఎంఈ సమస్యల పరిష్కారం, వాటి బలోపేతానికి సూచనలతో ఒక నివేదికను విడుదల చేసింది. ‘‘2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించే లక్ష్యంలో భాగంగా ఎంఎస్ఎంఈలకు సంబంధించి వ్యూహాత్మక ప్రణాళిక, కార్యాచరణను ఈ నివేదిక తెలియజేస్తుంది. సంఘటిత, అసంఘటిత రంగంలోని మన ఎంఎస్ఎంఈలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంక్‌లు, దిగ్గజ కంపెనీల నుంచి మద్దతు అవసరం’’అని అసోచామ్ ప్రెసిడెంట్ సంజయ్ నయ్యర్ పేర్కొన్నారు. ఎంఎస్ఎంఈలకు కార్పొరేట్ ఆదాయపన్ను రేటును 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించాలని, సులభతర జీఎస్టీ వ్యవస్థను తీసుకురావాలని అసోచామ్ కోరింది. కేంద్రీకృత పోర్టల్.. ఎంఎస్ఎంఈల నమోదు, వ్యాపారానికి సంబంధించి అన్ని రకాల డాక్యుమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో సమర్పించేందుకు ఆన్లైన్ పోర్టల్ తీసుకురావాలని అసోచామ్ తన నివేదికలో కోరింది. జీఎస్టీ రిజి్రస్టేషన్, నిబంధనల అమలు ప్రక్రియలను సైతం సులభతరంగా మార్చాలని పేర్కొంది. స్పష్టమైన నిబంధనలతో మద్దతుగా నిలవాలని కోరింది. సహేతుక కారణాలున్నప్పటికీ సకాలంలో జీఎస్టీ రిటర్నుల ఫైలింగ్, చెల్లింపులు చేయని ఎంఎస్ఎంఈలపై కఠిన జరిమానాలు విధిస్తున్నట్టు పేర్కొంది. జాప్యం తీవ్రత, కారణాలకు అనుగుణంగా పెనాల్టీలో మార్పులు ఉండాలని సూచించింది. జరిమానాలు ఎంఎస్ఎంఈలకు భారంగా మారరాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2047 నాటికి వికసిత భారత్ లక్ష్యం సాకారం కావాలంటే వ్యాపార నమూనాలో నిర్మాణాత్మక మార్పు అవసరమని అసోచామ్ సెక్రటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. ‘‘ఈ నిర్మాణాత్మక మార్పులో ఎంస్ఎంఈలు భాగంగా ఉండాలి. అభివృద్ధి చెందిన భారత్‌లో ఎంఎస్ఎంఈలు గొప్ప పాత్ర పోషించాలి. మా అధ్యయనం ఇదే అంశాన్ని బలంగా చెప్పింది’’అని సూద్ వివరించారు. పెరుగుతున్న కారి్మక శక్తికి ఎంఎస్ఎంఈలు పరిష్కారం చూపించగలవని, ఉత్పాదకతతో కూడిన ఉపాధిని అందించగలవని ఈగ్రోవ్ వ్యవస్థాపక చైర్మన్ చరణ్‌సింగ్ అన్నారు. వ్యవసాయ యూనివర్సిటీల మాదిరే ప్రతీ రాష్ట్రంలోనూ ఎంఎస్ఎంఈ యూనివర్సిటీ ఏర్పాటును పరిశీలించాలని, ఎంఎస్ఎంఈల ఉత్పత్తులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ప్రత్యేకంగా సమన్వయ మండలిని ఏర్పాటు చేసి, పథకాల అమలు సాఫీగా సాగేలా చూడాలని, రాష్ట్రాల పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఈ నివేదిక సూచించింది. జీడీపీలో 30 శాతం వాటా, తయారీ రంగంలో 45 శాతం వాటా, ఎగుమతుల్లో 46 శాతం వాటా కలిగిన ఎంఎస్ఎంఈలు దేశ ఆర్థిక వ్యవస్థలో ఎంతో కీలక పాత్ర పోషిస్తున్నట్టు ఈ నివేదిక గుర్తు చేసింది. -
చిన్న సంస్థలకు ఈ–కామర్స్‌తో దన్ను
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు తమ లాభాలను పెంచుకోవడానికి, మార్కెటింగ్ వ్యయాలను తగ్గించుకోవడానికి, కొత్త మార్కెట్లలో విస్తరించడానికి ఈ–కామర్స్ ఎంతగానో తోడ్పడుతోందని కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి భాను ప్రతాప్ సింగ్ వర్మ తెలిపారు. చిన్న వ్యాపారాలు తమ మేనేజ్మెంట్ నైపుణ్యాలను, టెక్నాలజీని మరింతగా మెరుగుపర్చుకోవాలని ఆయన సూచించారు. పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన భారతీయ ఎంఎస్ఎంఈల సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. ఎంఎస్ఎంఈలు దేశీయంగా ఉపాధి కల్పనలోనూ, తయారీ కార్యకలాపాలను విస్తరించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన తెలిపారు. 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీ లక్ష్యాన్ని సాధించే క్రమంలో వాటిపై మరింతగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని వర్మ చెప్పారు. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వ చేయూత.. కరోనా మహమ్మారి కష్టకాలంలో కూడా చిన్న పరిశ్రమలు ఎదురొడ్డి నిల్చాయని మంత్రి తెలిపారు. కొన్ని యూనిట్లు ఆర్థిక కష్టాలతో మూతబడే పరిస్థితికి వచ్చినా ప్రభుత్వం జోక్యం చేసుకుని తగు తోడ్పాటునివ్వడంతో గట్టెక్కాయని ఆయన చెప్పారు. ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకే కేంద్రం ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్‌ను (ఈసీఎల్జీఎస్) ఆవిష్కరించినట్లు మంత్రి వివరించారు. దీని కింద చిన్న సంస్థలకు రూ. 3.1 లక్ష కోట్ల మేర నిధులను కేటాయించినట్లు ఎంఎస్ఎంఈ శాఖ కార్యదర్శి బీబీ స్వెయిన్ తెలిపారు. డీ2సీ మార్కెట్ నివేదిక ఆవిష్కరణ.. కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ప్రాక్సిస్, షిప్‌రాకెట్, సీఐఐ సంయుక్తంగా రూపొందించిన భారత డీ2సీ మార్కెట్ నివేదికను మంత్రి ఆవిష్కరించారు. దీని ప్రకారం ఆన్లైన్లో ఆర్డర్లు తీసుకుని నేరుగా కస్టమర్లకు పంపే చాలా మటుకు డీ2సీ (డైరెక్ట్ టు కస్టమర్స్) సంస్థలకు ఢిల్లీ, బెంగళూరు, ముంబై ప్రధాన సరఫరా, డిమాండ్ హబ్‌లుగా ఉంటున్నాయి. 2022 ఆర్థిక సంవత్సరంలో నిత్యావసరాలు మొదలైన ఉత్పత్తుల మార్కెట్ పరిమాణం 571 బిలియన్ డాలర్లుగా, ఆభరణాల మార్కెట్ 82 బిలియన్ డాలర్లు, దుస్తులు.. పాదరక్షలు 81 బిలియన్ డాలర్లు, ఎలక్ట్రానిక్స్ మార్కెట్ 9.4 బిలియన్ డాలర్లుగా ఉండవచ్చని నివేదిక అంచనా వేసింది. -
చిన్న సంస్థల ఎగుమతుల కోసం మార్కెట్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్!
న్యూఢిల్లీ: లఘు, చిన్న, మధ్య తరహా సంస్థల (ఎంఎస్ఎంఈ) ఎగుమతులకు ఊతమిచ్చేందుకు అంతర్జాతీయ మార్కెట్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని కేంద్ర మంత్రి నారాయణ్ రాణె తెలిపారు. విదేశీ మార్కెట్లకు ఎగుమతుల డేటా సంబంధ సమాచారానికి ఇది కేంద్రంగా ఉండగలదని ఆయన వివరించారు. ఎంట్రప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఈడీఐఐ) నిర్వహించిన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు చెప్పారు. గణాంకాల ప్రకారం.. భారత ఎగుమతుల్లో దాదాపు 45 శాతం వాటా ఎంఎస్ఎంఈ రంగానిదే ఉంటోంది. అయితే, విదేశీ మార్కెట్లకు సంబంధించిన విశ్వసనీయ వాణిజ్య గణాంకాలు అందుబాటులో లేకపోతుండటం వల్ల చిన్న సంస్థలు తమ సామర్థ్యాల మేరకు ఎగుమతులు చేయలేకపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంఎస్ఎంఈ రంగాన్ని పటిష్టం చేసేందుకు, రుణ లభ్యత పెంచేందుకు, మెరుగైన సాంకేతికత అందించేందుకు, ఎగుమతి మార్కెట్లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెడుతోందని ఎంఎస్ఎంఈ శాఖ మంత్రి అయిన రాణె వివరించారు. ఎంఎస్ఎంఈ రంగాన్ని దేశ ఎకానమీకి చోదక శక్తిగా మార్చేందుకు తగు మార్గదర్శ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత వర్గాలకు ఆయన సూచించారు. దీటుగా పోటీపడేలా చిన్న సంస్థలను తీర్చిదిద్దేందుకు మరింత అధ్యయనం, ఆవిష్కరణలు, సరికొత్త వ్యాపార ఐడియాలు అవసరమని రాణె చెప్పారు. -
ఇది చరిత్రాత్మక నిర్ణయం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలనూ ఎంఎస్ఎంఈ పరిధిలోకి తీసుకొస్తున్నట్టు నిన్న కేంద్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కీలక నిర్ణయంపై ప్రధాని నరేంద్ర మోదీ నేడు స్పందించారు. సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) జాబితాలో రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలను చేర్చి తమ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందని మోదీ అన్నారు. దీని వల్ల కోట్లాది మంది వర్తకులకు లబ్ధి చేకూరుతుందని మోదీ చెప్పారు. వేగంగా ఆర్థిక సాయం అందడంతో పాటు వారి వ్యాపారాలు వృద్ధి చెందుతాయన్నారు. వ్యాపారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్లో ఆయన ట్వీట్ చేశారు. ఇక నూతన మార్గదర్శకాలను ఆయన విడుదల చేశారు. కొత్త నిబంధనలతో దాదాపు 2.5 కోట్ల మంది రిటైల్, హోల్ సేల్ వర్తకులు లబ్ధి పొందుతారని చెప్పారు. దీంతో ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రాధాన్య రంగాలకు రుణాల్లో చిరు వర్తకులకు లాభం కలుగుతుంది. అంతేగాకుండా ఉద్యమ్ రిజిస్ట్రేషన్ పోర్టల్ లో వారు నమోదు చేసుకోవచ్చు. Our government has taken a landmark step of including retail and wholesale trade as MSME. This will help crores of our traders get easier finance, various other benefits and also help boost their business. We are committed to empowering our traders. https://t.co/FTdmFpaOaU — Narendra Modi (@narendramodi) July 3, 2021 అఖిల భారత ట్రేడర్ల సమాఖ్య సీఏఐటీ.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించింది. ఇకపై ఎంఎస్ఎంఈలకు వర్తించే ప్రభుత్వ స్కీములు, ప్రయోజనాలు తమకు కూడా లభించగలవని సీఏఐటీ జాతీయ ప్రెసిడెంట్ బీసీ భార్తియా, సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తాజా నిర్ణయంతో ఆయా వర్గాలకు రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం ప్రాధాన్యతా రంగం కింద రుణాలు పొందేందుకు వీలుంటుందని పేర్కొన్నారు. చిన్న సంస్థలను పటిష్టం చేసేందుకు, ఆర్థిక వృద్ధికి వాటిని చోదకాలుగా మార్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని గడ్కరీ నిన్న ట్వీట్ చేశారు. తాజా మార్గదర్శకాలతో ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద 250 కోట్లపైగా టర్నోవర్ ఉన్న హోల్‌సేల్ వ్యాపారులు, చిన్నస్థాయి రిటైలర్లు త్వరగతిన ఫైనాన్స్ పొందే అవకాశం ఉంటుందని వెల్లడించారు. వారు ఉద్యమ్ పోర్టల్‌లో కూడా నమోదు చేసుకోవచ్చని తెలిపారు. -
వచ్చే ఐదేళ్లలో కోటి ఎంఎస్ఎంఈ ఉద్యోగాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వచ్చే నాలుగైదేళ్లలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (ఎంఎస్ఎంఈ) కంపెనీలు ఒక కోటికిపైగా ఉద్యోగాలను సృష్టించనున్నాయని నోమురా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తన నివేదికలో వెల్లడించింది. మధ్యతరగతి వర్గాలు పెరగడం, ఖర్చు చేయదగ్గ ఆదాయాల్లో వృద్ధి వెరశి భారత్‌ను వినియోగానికి ఆకర్షణీయ మార్కెట్‌గా నిలబెట్టనున్నాయి. అయితే వినియోగం అవుతున్న ఉత్పత్తుల్లో దిగుమతుల వాటా గణనీయంగా ఉండడంతో దేశీయంగా తయారీ రంగంలో ఉద్యోగ అవకాశాల సృష్టి పరిమితం అవుతోందని నివేదిక తెలిపింది. మరోవైపు పలు క్లస్టర్లలో ప్రత్యేకంగా ఎంఎస్ఎంఈ కంపెనీల్లో తయారీకి బూస్ట్‌నిచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీంతో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని వివరించింది. కాగా, దేశవ్యాప్తంగా వర్క్ ఫోర్స్ 48 కోట్లుంది. 2025 నాటికి వీరికి అదనంగా 4.5 కోట్ల మంది జతకూడనున్నారు. మొత్తం పనివారిలో తయారీ రంగంలో 12.5 శాతం మంది ఉంటారు. సింహభాగం ఎంఎస్‌ఎంఈదే.. ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ 2017–18 వార్షిక నివేదిక ప్రకారం.. తయారీ రంగంలో 3.6 కోట్ల ఉద్యోగాలతో ఎంఎస్ఎంఈ కంపెనీలు 70 శాతం వాటాను కైవసం చేసుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మారుతున్న వినియోగదార్ల అభిరుచులు, సాంకేతిక మార్పుల ప్రభావం తయారీ రంగంపై ప్రస్ఫుటంగా కనపడుతోంది. కొత్త ఉద్యోగాల కల్పనలో సూక్ష్మ, చిన్న కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయని ఎన్ఆర్ఐ కన్సల్టింగ్ పార్ట్నర్ ఆశిమ్ శర్మ వ్యాఖ్యానించారు. మార్కెట్ ఆధారిత వ్యూహాలు అనుసరించి ఈ రంగ కంపెనీలు తమ సామర్థ్యాన్ని పెంచుకోవాలని సూచించారు. ఎంఎస్ఎంఈ కంపెనీలు తయారు చేసిన వస్తువులు వాడుతున్న కస్టమర్లలో ప్రభావితం చేయగల కంపెనీలుగానీ వ్యక్తులుగానీ ఈ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్లుగా ఉండాలని నివేదిక అభిప్రాయపడింది. తద్వారా ఈ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని తెలిపింది. -
చిన్న సంస్థల కోసం ప్రపంచ బ్యాంకుతో భారత్ జట్టు
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) తమ ఉత్పాదకతను పెంచుకోవడంలో తోడ్పడే దిశగా ప్రపంచ బ్యాంకుతో భారత్ 200 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిధులతో టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ సెంటర్ సిస్టమ్ ప్రోగ్రామ్ (టీసీఎస్‌పీ)కి సంబంధించి ఒప్పం దంపై ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వం సోమవారం సంతకాలు చేశాయి. టీసీఎస్‌పీ కింద కొత్తగా 15 టెక్నాలజీ కేంద్రాలను (టీసీ) ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్న 18 టీసీలను ఆధునీకరించడం తదితర పనులు చేపడతారు. ఇందుకు మొత్తం రూ. 2,200 కోట్లు (దాదాపు 400 మిలియన్ డాలర్లు) వ్యయం కానుండగా సగభాగం (200 మిలియన్ డాలర్లు) ప్రపంచ బ్యాంకు రుణ రూపంలో అందిస్తోంది. టెక్నాలజీ, వ్యాపారపరమైన సలహాలు ఇవ్వడం ద్వారా చిన్న సంస్థల ఉత్పాదకతను పెంచడంలో తోడ్పాటు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.