చిన్న సంస్థల కోసం ప్రపంచ బ్యాంకుతో భారత్ జట్టు
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) తమ ఉత్పాదకతను పెంచుకోవడంలో తోడ్పడే దిశగా ప్రపంచ బ్యాంకుతో భారత్ 200 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిధులతో టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది.
టెక్నాలజీ సెంటర్ సిస్టమ్ ప్రోగ్రామ్ (టీసీఎస్‌పీ)కి సంబంధించి ఒప్పం దంపై ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వం సోమవారం సంతకాలు చేశాయి. టీసీఎస్‌పీ కింద కొత్తగా 15 టెక్నాలజీ కేంద్రాలను (టీసీ) ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్న 18 టీసీలను ఆధునీకరించడం తదితర పనులు చేపడతారు. ఇందుకు మొత్తం రూ. 2,200 కోట్లు (దాదాపు 400 మిలియన్ డాలర్లు) వ్యయం కానుండగా సగభాగం (200 మిలియన్ డాలర్లు) ప్రపంచ బ్యాంకు రుణ రూపంలో అందిస్తోంది. టెక్నాలజీ, వ్యాపారపరమైన సలహాలు ఇవ్వడం ద్వారా చిన్న సంస్థల ఉత్పాదకతను పెంచడంలో తోడ్పాటు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం.