joint secretary
-
ఢిల్లీ వర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం(డీయూఎస్‌యూ) ఎన్నికల్లో కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా(ఎన్ఎస్యూఐ) ఘన విజయం సాధించింది. ఏడేళ్ల తర్వాత ప్రెసిడెంట్, జాయింట్ సెక్రటరీ పోస్టులను ఈ సంఘం గెలుచుకుంది. అదే సమయంలో, ఆర్ఎస్ఎస్ అనుబంధ భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ)కి వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ పోస్టులను సాధించుకోవడం విశేషం. ప్రెసిడెంట్ పదవికి జరిగిన పోటీలో ఏబీవీపీకి చెందిన రిషబ్ చౌదరిపై ఎన్ఎస్యూఐ అభ్యర్థి రౌనక్ ఖత్రి 1,300కుపైగా ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఎన్ఎస్యూఐ చివరిగా సారిగా 2017లో డీయూఎస్‌యూ ప్రెసిడెంట్ పదవిని దక్కించుకుంది. ఫలితాలు వెల్లడవ్వగానే ఎన్ఎస్యూఐ పక్షం విద్యార్థులు తమ నేతలను భుజాలపై మోసుకుంటూ ర్యాలీ నిర్వహించారు. క్యాంపస్ ఆవరణలో లౌడ్ స్పీకర్ల వాడకం, బాణసంచా కాల్చడం, డోళ్లు వాయించడంపై నిషేధం ఉంది. -
పోస్టుల్లేకపోయినా పదోన్నతులు!
సాక్షి, హైదరాబాద్: ఉన్నత విద్యా మండలిలో పదోన్నతులు వివాదాస్పదమవుతున్నాయి. ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులకు పదోన్నతులు ఇచ్చేందుకు అవసరమైన పోస్టులు లేవని, వారు పని చేస్తున్న పోస్టులనే అప్‌గ్రేడ్ చేశారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఉన్నత విద్యా మండలికి చెందిన పాలక మండలి ఆమోదం కానీ, అటు ప్రభుత్వ ఆమోదం తీసుకోకుండానే ఇష్టానుసారంగా పదోన్నతులు కల్పించారన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. 12 మందికి పదోన్నతులు మండలిలో జాయింట్ సెక్రటరీ పోస్టు లేకపోయినా ప్రస్తుతం పనిచేస్తున్న డిప్యూటీ సెక్రటరీకి జాయింట్ సెక్రటరీ స్థాయిలో పదోన్నతి కల్పించి, ఆయనకు ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు కట్టబెట్టారని, అది నిబంధనలకు విరుద్ధమనే వాదనలు విన్పిస్తున్నాయి. అలాగే మండలిలో ప్రస్తుతం ఒకటే అసిస్టెంట్ సెక్రటరీ పోస్టు ఉంది. దానికి తోడు మరొక పోస్టును అసిస్టెంట్ సెక్రటరీ పోస్టుగా అప్‌గ్రేడ్ చేసి ఆ పోస్టుల్లో ఇద్దరికి పదోన్నతులు కల్పించినట్లు తెలిసింది. అలాగే సూపరింటెండెంట్ పోస్టు ఒకటే ఉన్నప్పటికీ, మరో నాలుగు పోస్టులను అప్‌గ్రేడ్ చేసి మొత్తంగా ఐదుగురికి పదోన్నతులు కల్పించారు. అయితే అందులో ఇద్దరు ఆ పదోన్నతులను తిరస్కరించినట్లు తెలిసింది. ఇలా మొత్తంగా 12 మందికి పదోన్నతులు కల్పించారు. అయితే 1994 ఫిబ్రవరి 14వ తేదీన అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఉన్నత విద్యా మండలి పోస్టుల భర్తీ విధానానికి సంబంధించిన జీవో 51 లో ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు భర్తీ ప్రక్రియ ఉంది. ఆ పోస్టును డిప్యూటీ డైరెక్టర్ స్థాయి వారికి పదోన్నతి కల్పించి భర్తీ చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. కానీ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టు మండలిలో లేదు. దీంతో ఆ పోస్టు జోలికి ఎవరూ వెళ్లలేదు. ఏ పోస్టునూ అప్‌గ్రేడ్ చేయలేదు: కార్యదర్శి ఈ వ్యవహారంపై ఉన్నత విద్యా మండలి కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావును వివరణ కోరగా.. ప్రభుత్వం అన్ని శాఖల్లో పదోన్నతులు కల్పించాలని చెప్పిందన్నారు. అందులో భాగంగానే తాము ఏడేళ్లుగా పనిచేస్తున్న తమ సిబ్బందికి పదోన్నతులు కల్పించామని తెలిపారు. ఏ పోస్టును కూడా ఆప్‌గ్రేడ్ చేయలేదని, వ్యక్తిగత పదోన్నతులు మాత్రమే ఇచ్చామని చెప్పారు. -
అందుకే రాజీనామా చేస్తున్నా
తెలుగు ఫిల్మ్ చాంబర్ జాయింట్ సెక్రటరీ పదవికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవికి దర్శక–నిర్మాత నట్టి కుమార్ శనివారం రాజీనామా చేశారు. ‘‘చిన్న నిర్మాతల సినిమాలను విడుదల చేయనీకుండా కొంతమంది అడ్డుకుంటు న్నారు.. దానికి నిరసనగానే రాజీనామా చేశా. ఏప్రిల్ వరకు పెద్ద సినిమాలు విడుదల కావు కాబట్టి ఐదుగురు పెద్ద వ్యక్తులు థియేటర్లని మార్చి వరకూ ఓపెన్ చేయకూడదని అనుకుంటున్నారు. థియేటర్స్‌ని నడిపించకపోతే థియేటర్ లీజ్ ఓనర్స్ అయిన నిర్మాతల ఇంటి ముందు ధర్నా చేస్తా’’ అన్నారు నట్టి కుమార్. -
కేంద్రంలో ‘ప్రైవేటు’ కార్యదర్శులు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో సంయుక్త కార్యదర్శిగా సేవలు అందించేందుకు తొలిసారి 9 మంది ప్రైవేటు రంగ నిపుణుల్ని తీసుకున్నారు. ఈ తొమ్మిది మంది పేర్లను యూపీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. అమీర్‌దూబే(పౌర విమానయాన శాఖ), అరుణ్ గోయల్ (వాణిజ్యం), రాజీవ్ సక్సేనా(ఆర్థిక వ్యవహారాలు), సుజిత్ కుమార్ బాజ్‌పేయి(పర్యావరణం అడవులు, వాతావరణ మార్పు), సౌరభ్ మిశ్రా (ఆర్థిక సేవలు), దినేశ్ దయానంద్ జగ్దలే(నూతన, పునరుత్పాదక ఇంధనం), సుమన్ ప్రసాద్(రోడ్డు రవాణా), భూషణ్ కుమార్(షిప్పింగ్), కొకోలీ ఘోష్(వ్యవసాయం, రైతు సంక్షేమం) త్వరలోనే బాధ్యతలు స్వీకరిస్తారని వెల్లడించింది. నైపుణ్యవంతులైన ప్రైవేటు వ్యక్తుల సేవలను వాడుకునేందుకు కేంద్రం గతేడాది ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా రెవిన్యూ, వాణిజ్యం, ఆర్థిక సేవలు, వ్యవసాయం, రోడ్డు రవాణా, షిప్పింగ్ సహా పలు శాఖల్లో పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీంతో మొత్తం 6,077 మంది దరఖాస్తు చేసుకోగా, వీటిని వడపోసిన యూపీఎస్సీ చివరకు 9 మందిని ఎంపిక చేసింది. -
నీరవ్ కేసు : టాప్ సీబీఐ అధికారికి షాక్!
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ కేసును ఇటు సీబీఐ అధికారులు, అటు ఈడీ ఎంతో కీలకంగా తీసుకుంది. ఈ కేసులో అణువణువు ఎంతో క్లుప్తంగా విచారణ చేస్తున్నాయి దర్యాప్తు ఏజెన్సీలు. కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఎలాగైనా భారత్‌కు రప్పించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో టాప్ సీబీఐ అధికారికి షాక్ తగిలింది. నీరవ్ మోదీ కేసును విచారిస్తున్న టాప్ సీబీఐ అధికారి ఈ-మెయిల్ అకౌంట్ బ్లాక్ అయింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సింగ్ కంప్యూటర్ కూడా సీజ్ అయింది. దీంతో నీరవ్ మోదీ కేసుకు సంబంధించి ఏమైనా కీలకమైన సమాచారం లీకైందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సిమ్లాలో రాజీవ్ సీంగ్ మెయిల్ ఓపెన్ అయిందని, పెద్ద మొత్తంలో మెయిల్స్‌ను పంపించుకున్నారని తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన త్రిపురకు వచ్చారు. ఈమెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి, హ్యాకర్లు పంపించుకున్న డాక్యుమెంట్లలో బ్యాంకు మోసాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్టు వెల్లడవుతోంది. తొలుత ఆయన ఈమెయిల్ అకౌంట్ ద్వారా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయని మే 16న గుర్తించారు. ఆ అనంతరం ఆయన అకౌంట్‌ను ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) బ్లాక్ చేసింది. సీఈఆర్టీ, సీబీఐను అలర్ట్ చేసిన అనంతరం సిమ్లాలో మరోసారి సింగ్ అకౌంట్ యాక్సస్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఈ-మెయిల్ అకౌంట్‌ను బ్లాక్, ఎవరు ఈ పన్నాగానికి పాల్పడ్డారో సైబర్ క్రైమ్ అధికారులు విచారిస్తున్నారు. నీరవ్ కేసుకు సంబంధించిన ఏమైనా సమాచారం లీకైందా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. సీబీఐ సైతం ఈ ఈమెయిల్ లీక్‌పై విచారణ ప్రారంభించింది. నీరవ్ కేసు విచారిస్తున్న టాప్ అధికారి ఈ-మెయిల్ హ్యాక్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. తన అకౌంట్ నుంచి అనుమానిత కార్యకలాపాలు సాగడంపై సింగ్ వెంటనే స్పందించలేదు. మరోవైపు విదేశాల్లో చక్కర్లు కొడుతున్న నీరవ్ మోదీకి సంబంధించి మరింత కీలక సమాచారాన్ని అధికారులు సేకరించారు. కనీసం ఆరు భారతీయ పాస్‌పోర్ట్ లతో వివిధ దేశాలలో తిరుగుతున్నట్టు కనుగొన్నారు. ఈ నేరానికి మోదీపై తాజా ఎఫ్ఐఐఆర్ నమోదు చేయాలని దర్యాప్తు బృందాలు కోరుతున్నాయని సీనియర్ అధికారులు ధృవీకరించారు. ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉండటం, అలాగే రద్దు చేయబడిన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించడం నేరమని అధికారులు పేర్కొన్నారు. -
బ్యూరొక్రాట్లుగా ప్రైవేట్ నిపుణులు
న్యూఢిల్లీ: పలు కీలక ప్రభుత్వ విభాగాల్లో సీనియర్ స్థాయి ఉన్నతాధికారుల పోస్టులకు పబ్లిక్, ప్రైవేటు రంగాల్లోని నిపుణులకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దేశ నిర్మాణానికి దోహదం చేసే ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రముఖ దినపత్రికల్లో ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ప్రకారం.. రెవెన్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎకనమిక్ అఫైర్స్, వ్యవసాయం, రైతు సహకారం, సంక్షేమం, రోడ్డు రవాణా, హైవేలు, నౌకాయానం, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు, నూతన, పునరుత్పాదక ఇంధనం, పౌర విమానయానం, వాణిజ్య మంత్రిత్వ శాఖలకు నిపుణులైన పది మంది ప్రతిభావంతులైన వ్యక్తులు కావాలని ప్రభుత్వం ప్రకటించింది. లేటరల్ రిక్రూట్మెంట్ కింద ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారిని మూడేళ్ల కాల పరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో జాయింట్ సెక్రటరీలుగా నియమిస్తామని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ కాంట్రాక్టు గడువును పనితీరు ఆధారంగా ఐదేళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, అలాగే వివిధ పథకాల అమలులో జాయింట్ సెక్రటరీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు వివిధ మంత్రిత్వ శాఖల్లో అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, వాటి అనుబంధ సర్వీసుల నుంచి వచ్చే సెక్రటరీ, అదనపు సెక్రటరీల కింద పనిచేయాల్సి ఉంటుంది. వేతనం నెలకు రూ.1.44 లక్షల నుంచి 2.18 లక్షలు. దరఖాస్తులకు ఆఖరి తేదీ జూలై 30. సంఘీలకు స్థానం కల్పించేందుకే ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగాల్లో ‘సంఘీ’ (ఆరె స్సెస్ వ్యక్తులు)లను కూర్చోబెట్టడానికే ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. -
సహజ వనరులు దోచిపెట్టేందుకే మారణకాండ
జంగారెడ్డిగూడెం : గ్రీన్‌హంట్ పేరుతో ప్రభుత్వాలు దండకారణ్య ప్రాంతంలో ఉద్యమకారులను, ఆదివాసీలను దారుణగా కాల్చి చంపుతున్నాయని ఏపీ సీఎల్సీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నంబూరి శ్రీమన్నారాయణ ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు సహజ వనరులు కట్టబెట్టేందుకు ఈ మారణకాండ కొనసాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యహింసను పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చత్తీస్ఘడ్, ఒడిశా ప్రాంతాల్లో పౌరులను, ఆదివాసీలను, నక్సల్స్‌ను కాల్చి చంపడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. నక్సల్స్ సమస్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య అని ఈ సమస్య పరిష్కారానికి ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేయడం సమంజసంకాదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేశాయన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య పరిష్కారానికి తుపాకీతో సమాధానం చెప్పాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎ¯ŒSకౌంటర్ నిలుపుదల చేసి సహజ వనరుల పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. శాంతియుత సమాజం కోసం ఎన్కౌంటర్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూ.1,000, రూ.500 నోట్లు రద్దు వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. నగదు రహిత సమాజం భారతీయ సమాజంలో సాధ్యం కాదని పేర్కొన్నారు. కెన్యా తదితర చిన్నదేశాల్లో ఈ విధానం అమలు చేయడం వల్ల ద్రవ్యోల్భణం పెరిగి ఆయా దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని గుర్తుచేశారు. -
ఐఎంఏ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ రవికృష్ణ
నంద్యాల: ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా డాక్టర్ రవికృష్ణ ఎంపికయ్యారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో సోమవారం రాష్ట్ర శాఖ ఎన్నికలు నిర్వహించారు. డాక్టర్ రవికృష్ణ ఐఎంఏ నంద్యాల విభాగం కార్యదర్శి, అధ్యక్షుడిగా పని చేశారు. ఈ ఏడాది సంయుక్త కార్యదర్శిగా.. వచ్చే ఏడాది ఉపాధ్యక్షుడిగా ఆయనను ఏగ్రీవంగా ఎన్నుకున్నారు. గతంలో ఐఎంఏ కార్యదర్శిగా పని చేసిన డాక్టర్ విజయభాస్కరరెడ్డిని రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యుడిగా, డాక్టర్ అనిల్కుమార్ని వచ్చే ఏడాది సంయుక్త కార్యదర్శిగా ఎన్నుకున్నారు. -
చిన్న సంస్థల కోసం ప్రపంచ బ్యాంకుతో భారత్ జట్టు
న్యూఢిల్లీ: చిన్న, మధ్య తరహా సంస్థలు (ఎంఎస్ఎంఈ) తమ ఉత్పాదకతను పెంచుకోవడంలో తోడ్పడే దిశగా ప్రపంచ బ్యాంకుతో భారత్ 200 మిలియన్ డాలర్ల రుణ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ నిధులతో టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ సెంటర్ సిస్టమ్ ప్రోగ్రామ్ (టీసీఎస్‌పీ)కి సంబంధించి ఒప్పం దంపై ప్రపంచ బ్యాంకు, భారత ప్రభుత్వం సోమవారం సంతకాలు చేశాయి. టీసీఎస్‌పీ కింద కొత్తగా 15 టెక్నాలజీ కేంద్రాలను (టీసీ) ఏర్పాటు చేయడం, ప్రస్తుతం ఉన్న 18 టీసీలను ఆధునీకరించడం తదితర పనులు చేపడతారు. ఇందుకు మొత్తం రూ. 2,200 కోట్లు (దాదాపు 400 మిలియన్ డాలర్లు) వ్యయం కానుండగా సగభాగం (200 మిలియన్ డాలర్లు) ప్రపంచ బ్యాంకు రుణ రూపంలో అందిస్తోంది. టెక్నాలజీ, వ్యాపారపరమైన సలహాలు ఇవ్వడం ద్వారా చిన్న సంస్థల ఉత్పాదకతను పెంచడంలో తోడ్పాటు అందించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. -
రెట్రో ట్యాక్స్ కేసులపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: రెట్రోస్పెక్టివ్ పన్ను సవరణ (2012 ఏప్రిల్‌కు ముందునాటి ఒప్పందాలపైనా పన్ను వర్తింపు) కారణంగా వెలుగులోకివచ్చే ఆదాయపు పన్ను కేసులను పరిశీలించేందుకు వీలుగా ప్రభుత్వం గురువారం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నియమించిన ఈ నలుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీకి చెందిన విదేశీ పన్నులు, పన్నుల పరిశోధన యూనిట్-1 జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహించనున్నారు. అసెసింగ్ ఆఫీసర్(ఏఓ) నుంచి వచ్చే ఇలాంటి కేసులపై 60 రోజుల్లోగా ఈ కమిటీ తగిన పరిశీలనజరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీబీడీటీ విడుదల చేసిన నోటిఫికేషనలో పేర్కొంది. రెట్రో ట్యాక్స్ కేసులపై కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. వొడాఫోన్ ఇండియాలో హాంకాంగ్‌కు చెందిన హచిసన్ టెలికం వాటాను బ్రిటన్ సంస్థ వొడాఫోన్ కొనుగోలు చేసిన ఒప్పందానికి సంబంధించి ఆ కంపెనీకి ఐటీ శాఖ పన్ను నోటీసు ఇవ్వడం తెలిసిందే. దీనిపై వొడాఫోన్ సుప్రీం కోర్టులో న్యాయపోరాటంచేసి విజయం సాధించడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐటీ చట్లాల్లో ఈ రెట్రోస్పెక్టివ్ పన్ను సవరణను తీసుకొచ్చింది. దీని ప్రకారం భారత్‌తో సంబంధం ఉన్న కంపెనీలకు సంబంధించి దేశీయంగా, లేదా విదేశాల్లో ఎక్కడ ఎలాంటి కొనుగోలు, అమ్మకం లావాదేవీలు జరిగినా దానిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించేలా, పాత కేసులకూ వర్తింపజేస్తూ నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో వొడాఫోన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ రూ.11,217 కోట్ల పన్నుతో పాటు దీనిపై వడ్డీని కూడా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఇంకా వివాదం నడుస్తూనే ఉంది. కాగా, ఈ మొత్తం ఉదంతంపై విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర విమర్శలు తలెత్తడంతో రెట్రో ట్యాక్స్ నిబంధనలను చాలా జాగ్రత్తగా అమలు చేస్తామని జైట్లీ బడ్జెట్లో చెప్పారు.