రెట్రో ట్యాక్స్ కేసులపై ఉన్నతస్థాయి కమిటీ
న్యూఢిల్లీ: రెట్రోస్పెక్టివ్ పన్ను సవరణ (2012 ఏప్రిల్‌కు ముందునాటి ఒప్పందాలపైనా పన్ను వర్తింపు) కారణంగా వెలుగులోకివచ్చే ఆదాయపు పన్ను కేసులను పరిశీలించేందుకు వీలుగా ప్రభుత్వం గురువారం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు(సీబీడీటీ) నియమించిన ఈ నలుగురు సభ్యుల కమిటీకి సీబీడీటీకి చెందిన విదేశీ పన్నులు, పన్నుల పరిశోధన యూనిట్-1 జాయింట్ సెక్రటరీ నేతృత్వం వహించనున్నారు.
అసెసింగ్ ఆఫీసర్(ఏఓ) నుంచి వచ్చే ఇలాంటి కేసులపై 60 రోజుల్లోగా ఈ కమిటీ తగిన పరిశీలనజరిపి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని సీబీడీటీ విడుదల చేసిన నోటిఫికేషనలో పేర్కొంది. రెట్రో ట్యాక్స్ కేసులపై కొత్త యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.
వొడాఫోన్ ఇండియాలో హాంకాంగ్‌కు చెందిన హచిసన్ టెలికం వాటాను బ్రిటన్ సంస్థ వొడాఫోన్ కొనుగోలు చేసిన ఒప్పందానికి సంబంధించి ఆ కంపెనీకి ఐటీ శాఖ పన్ను నోటీసు ఇవ్వడం తెలిసిందే. దీనిపై వొడాఫోన్ సుప్రీం కోర్టులో న్యాయపోరాటంచేసి విజయం సాధించడంతో అప్పటి యూపీఏ ప్రభుత్వం ఐటీ చట్లాల్లో ఈ రెట్రోస్పెక్టివ్ పన్ను సవరణను తీసుకొచ్చింది.
దీని ప్రకారం భారత్‌తో సంబంధం ఉన్న కంపెనీలకు సంబంధించి దేశీయంగా, లేదా విదేశాల్లో ఎక్కడ ఎలాంటి కొనుగోలు, అమ్మకం లావాదేవీలు జరిగినా దానిపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించేలా, పాత కేసులకూ వర్తింపజేస్తూ నిబంధనలు తీసుకొచ్చారు. దీంతో వొడాఫోన్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్ రూ.11,217 కోట్ల పన్నుతో పాటు దీనిపై వడ్డీని కూడా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. దీనిపై ఇంకా వివాదం నడుస్తూనే ఉంది. కాగా, ఈ మొత్తం ఉదంతంపై విదేశీ, స్వదేశీ ఇన్వెస్టర్ల నుంచి తీవ్ర విమర్శలు తలెత్తడంతో రెట్రో ట్యాక్స్ నిబంధనలను చాలా జాగ్రత్తగా అమలు చేస్తామని జైట్లీ బడ్జెట్‌లో చెప్పారు.