ఈ-ఫైలింగ్ ప్రక్రియ మరింత సరళతరం
న్యూఢిల్లీ: ఇన్‌కం ట్యాక్స్ రిటర్నులను ఈ-ఫైలింగ్ చేసే ప్రక్రియను మరింత సులభతరం చేయనున్నట్లు ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) చైర్మన్ ఆర్‌కే తివారి తెలిపారు. ఆన్‌లైన్ పద్ధతిలో రిటర్నులు దాఖలు చేసే వారి సంఖ్య పెరుగుతుండటంతో నిబంధనలను సరళతరం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వివరించారు. గత ఆర్థిక సంవత్సరం మార్చ్ 22 నాటికి 1.80 కోట్ల మేర ఈ-రిటర్నులు రాగా ఈసారి 40 శాతం పెరిగి 2.56 కోట్ల దాకా వచ్చాయని తివారీ చెప్పారు. బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ (సీపీసీ) నెలకు 2.80 లక్షల రిటర్నులను ప్రాసెస్ చేస్తోందని తెలిపారు. ఈ-రిటర్నుల ప్రాసెసింగ్‌కి పట్టే సమయం కూడా 70 రోజుల నుంచి 61 రోజులకు తగ్గిందని తివారీ చెప్పారు.
మరోవైపు, ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ వివాదాలను నివారించడానికి మార్చ్ 31లోగా మరిన్ని బహుళ జాతి సంస్థలతో అడ్వాన్స్ ప్రైసింగ్ ఒప్పందాలు (ఏపీఏ) కుదుర్చుకోనున్నట్లు తివారీ తెలిపారు. భవిష్యత్‌లో కొన్నేళ్ల పాటు అంతర్జాతీయ లావాదేవీలకు సంబంధించి అనుసరించే ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్ విధానం గురించి పన్నుల శాఖతో కంపెనీలు ఈ ఏపీఏ ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. ఒకే గ్రూప్‌లోని రెండు సంస్థల మధ్య జరిగే లావాదేవీల విషయంలో సదరు గ్రూప్ పాటించే ధరల విధానాన్ని ట్రాన్స్‌ఫర్ ప్రైసింగ్‌గా పరిగణిస్తారు. చాలా మటుకు బహుళ జాతి కంపెనీలు దీన్ని అడ్డం పెట్టుకుని తమ లాభాలన్నీ .. తక్కువ పన్నులు ఉండే దేశాల్లోకి మళ్లిస్తున్నాయని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై వివాదాలను తగ్గించే ఉద్దేశంతో ఏపీఏలను ప్రభుత్వం ప్రవేశపెట్టింది.
ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధిస్తాం.. ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని సాధిస్తామన్న విశ్వాసాన్ని తివారీ వ్యక్తం చేశారు. ఇక్కడ సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో తివారీ మాట్లాడారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కేంద్రం రూ.6.36 లక్షల కోట్ల ప్రత్యక్ష పన్ను వసూళ్ల లక్ష్యాన్ని పెట్టుకుంది. మార్చి 22 వరకూ వీటిలో రూ.5.82 లక్షల కోట్ల వసూళ్లు జరిగినట్లు తివారీ తెలిపారు. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోల్చితే ఇది 13.6 శాతం అధికం. ముందస్తు పన్ను వసూళ్లు మొత్తంగా చూస్తే మార్చి 22తో ముగిసిన యేడాదికాలంలో 8.7 శాతం వృద్ధితో రూ.2,90,323 కోట్లుగా ఉన్నట్లు తివారీ వివరించారు.