దేశం విడిచి వెళ్తున్న వారందరూ ముందుగా ట్యాక్స్ బకాయిలన్నీ తప్పనిసరిగా చెల్లించాలంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) స్పందించింది. ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 చట్టంలోని సెక్షన్ 230కు సంబంధించి వివరణ ఇచ్చింది.
పన్ను చెల్లింపుదారుల్లో కలకలం సృష్టించిన ఈ వార్తలపై సీబీడీటీ స్పందిస్తూ.. దేశం విడిచి వెళ్తున్న ప్రతి భారతీయ పౌరుడు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలని సెక్షన్ 230 ఆదేశించదని పేర్కొంది. ఆవశ్యకమైన నిర్దిష్ట పరిస్థితులలో మాత్రమే ఇది వర్తిస్తుంది. 2004 ఫిబ్రవరి 5 నాటి సీబీడీటీ ఇన్‌స్ట్రక్షన్ నంబర్ 1/2004 ప్రకారం, తీవ్రమైన ఆర్థిక అవకతవకలకు పాల్పడిన వ్యక్తులు లేదా ప్రత్యక్ష పన్ను బకాయిలు రూ. 10 లక్షలకు పైగా ఉన్నవారికి మాత్రమే దేశం విడిచి వెళ్లే ముందు ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ తప్పనిసరి. ఎందుకంటే ఇలాంటి వారు ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్ విచారణలో ప్రత్యక్షంగా పాల్గొనడం అవసరం.
అంతేకాకుండా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ జారీ ఏకపక్ష ప్రక్రియ కాదు. దీనికి ఇన్‌కమ్ టాక్స్ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్ లేదా ఇన్‌కమ్ టాక్స్ చీఫ్ కమిషనర్ నుంచి లిఖితపూర్వకమైన ముందస్తు అనుమతి అవసరం. ఇన్‌కమ్ టాక్స్ యాక్ట్, వెల్త్ టాక్స్ యాక్ట్, గిఫ్ట్-టాక్స్ యాక్ట్, ఎక్స్‌పెండిచర్-టాక్స్ యాక్ట్, మనీ యాక్ట్, 2015 వంటి వివిధ పన్ను చట్టాల కింద సదరు వ్యక్తికి ఎటువంటి బకాయిలు లేవని ఈ సర్టిఫికెట్ నిర్ధారిస్తుంది. దీన్ని ఇటీవలి ఫైనాన్స్ బిల్లులో ప్రతిపాదించారు.
ఫైనాన్స్ (నం. 2) బిల్లు, 2024లో క్లాజ్ 71లో బ్లాక్ మనీ యాక్ట్, 2015కు సంబంధించిన సూచనలను చేరుస్తూ సెక్షన్ 230కి సవరణలు ప్రతిపాదించారు. ఈ సవరణలు వచ్చే అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. దీని ప్రకారం.. గుర్తించిన కేటగిరీల కింద కొంతమంది వ్యక్తులు దేశం విడిచి వెళ్లేముందు తప్పనిసరిగా ట్యాక్స్ క్లియరెన్స్ సర్టిఫికెట్ పొందాలి.
Comments
Please login to add a commentAdd a comment