న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ కేసును ఇటు సీబీఐ అధికారులు, అటు ఈడీ ఎంతో కీలకంగా తీసుకుంది. ఈ కేసులో అణువణువు ఎంతో క్లుప్తంగా విచారణ చేస్తున్నాయి దర్యాప్తు ఏజెన్సీలు. కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఎలాగైనా భారత్‌కు రప్పించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో టాప్ సీబీఐ అధికారికి షాక్ తగిలింది. నీరవ్ మోదీ కేసును విచారిస్తున్న టాప్ సీబీఐ అధికారి ఈ-మెయిల్ అకౌంట్ బ్లాక్ అయింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సింగ్ కంప్యూటర్ కూడా సీజ్ అయింది. దీంతో నీరవ్ మోదీ కేసుకు సంబంధించి ఏమైనా కీలకమైన సమాచారం లీకైందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది.
సిమ్లాలో రాజీవ్ సీంగ్ మెయిల్ ఓపెన్ అయిందని, పెద్ద మొత్తంలో మెయిల్స్‌ను పంపించుకున్నారని తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన త్రిపురకు వచ్చారు. ఈమెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి, హ్యాకర్లు పంపించుకున్న డాక్యుమెంట్లలో బ్యాంకు మోసాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్టు వెల్లడవుతోంది. తొలుత ఆయన ఈమెయిల్ అకౌంట్ ద్వారా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయని మే 16న గుర్తించారు. ఆ అనంతరం ఆయన అకౌంట్‌ను ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్‌టీ) బ్లాక్ చేసింది. సీఈఆర్‌టీ, సీబీఐను అలర్ట్ చేసిన అనంతరం సిమ్లాలో మరోసారి సింగ్ అకౌంట్ యాక్సస్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఈ-మెయిల్ అకౌంట్‌ను బ్లాక్, ఎవరు ఈ పన్నాగానికి పాల్పడ్డారో సైబర్ క్రైమ్ అధికారులు విచారిస్తున్నారు.
నీరవ్ కేసుకు సంబంధించిన ఏమైనా సమాచారం లీకైందా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. సీబీఐ సైతం ఈ ఈమెయిల్ లీక్‌పై విచారణ ప్రారంభించింది. నీరవ్ కేసు విచారిస్తున్న టాప్ అధికారి ఈ-మెయిల్ హ్యాక్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. తన అకౌంట్ నుంచి అనుమానిత కార్యకలాపాలు సాగడంపై సింగ్ వెంటనే స్పందించలేదు. మరోవైపు విదేశాల్లో చక్కర్లు కొడుతున్న నీరవ్ మోదీకి సంబంధించి మరింత కీలక సమాచారాన్ని అధికారులు సేకరించారు. కనీసం ఆరు భారతీయ పాస్‌పోర్ట్ లతో వివిధ దేశాలలో తిరుగుతున్నట్టు కనుగొన్నారు. ఈ నేరానికి మోదీపై తాజా ఎఫ్ఐఐఆర్ నమోదు చేయాలని దర్యాప్తు బృందాలు కోరుతున్నాయని సీనియర్ అధికారులు ధృవీకరించారు. ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉండటం, అలాగే రద్దు చేయబడిన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించడం నేరమని అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment