email account hacked
-
నీరవ్ కేసు : టాప్ సీబీఐ అధికారికి షాక్!
న్యూఢిల్లీ : పంజాబ్ నేషనల్ బ్యాంకులో భారీ కుంభకోణానికి పాల్పడిన నీరవ్ మోదీ కేసును ఇటు సీబీఐ అధికారులు, అటు ఈడీ ఎంతో కీలకంగా తీసుకుంది. ఈ కేసులో అణువణువు ఎంతో క్లుప్తంగా విచారణ చేస్తున్నాయి దర్యాప్తు ఏజెన్సీలు. కుంభకోణానికి పాల్పడి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని ఎలాగైనా భారత్‌కు రప్పించాలని శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో టాప్ సీబీఐ అధికారికి షాక్ తగిలింది. నీరవ్ మోదీ కేసును విచారిస్తున్న టాప్ సీబీఐ అధికారి ఈ-మెయిల్ అకౌంట్ బ్లాక్ అయింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాజీవ్ సింగ్ కంప్యూటర్ కూడా సీజ్ అయింది. దీంతో నీరవ్ మోదీ కేసుకు సంబంధించి ఏమైనా కీలకమైన సమాచారం లీకైందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. సిమ్లాలో రాజీవ్ సీంగ్ మెయిల్ ఓపెన్ అయిందని, పెద్ద మొత్తంలో మెయిల్స్‌ను పంపించుకున్నారని తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన త్రిపురకు వచ్చారు. ఈమెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి, హ్యాకర్లు పంపించుకున్న డాక్యుమెంట్లలో బ్యాంకు మోసాలకు సంబంధించిన సమాచారం ఉన్నట్టు వెల్లడవుతోంది. తొలుత ఆయన ఈమెయిల్ అకౌంట్ ద్వారా అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నాయని మే 16న గుర్తించారు. ఆ అనంతరం ఆయన అకౌంట్‌ను ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ) బ్లాక్ చేసింది. సీఈఆర్టీ, సీబీఐను అలర్ట్ చేసిన అనంతరం సిమ్లాలో మరోసారి సింగ్ అకౌంట్ యాక్సస్ చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఆయన ఈ-మెయిల్ అకౌంట్‌ను బ్లాక్, ఎవరు ఈ పన్నాగానికి పాల్పడ్డారో సైబర్ క్రైమ్ అధికారులు విచారిస్తున్నారు. నీరవ్ కేసుకు సంబంధించిన ఏమైనా సమాచారం లీకైందా? అనే కోణంలో కూడా విచారణ కొనసాగుతోంది. సీబీఐ సైతం ఈ ఈమెయిల్ లీక్‌పై విచారణ ప్రారంభించింది. నీరవ్ కేసు విచారిస్తున్న టాప్ అధికారి ఈ-మెయిల్ హ్యాక్ కావడం తీవ్ర చర్చనీయాంశమైంది. తన అకౌంట్ నుంచి అనుమానిత కార్యకలాపాలు సాగడంపై సింగ్ వెంటనే స్పందించలేదు. మరోవైపు విదేశాల్లో చక్కర్లు కొడుతున్న నీరవ్ మోదీకి సంబంధించి మరింత కీలక సమాచారాన్ని అధికారులు సేకరించారు. కనీసం ఆరు భారతీయ పాస్‌పోర్ట్ లతో వివిధ దేశాలలో తిరుగుతున్నట్టు కనుగొన్నారు. ఈ నేరానికి మోదీపై తాజా ఎఫ్ఐఐఆర్ నమోదు చేయాలని దర్యాప్తు బృందాలు కోరుతున్నాయని సీనియర్ అధికారులు ధృవీకరించారు. ఒకటి కంటే ఎక్కువ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉండటం, అలాగే రద్దు చేయబడిన పాస్‌పోర్ట్‌ను ఉపయోగించడం నేరమని అధికారులు పేర్కొన్నారు. -
అమృతా రాయ్ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్(67) ప్రేమాయణంతో వెలుగులోకి వచ్చిన రాజ్యసభ టీవీ వ్యాఖ్యాత అమృతా రాయ్(43)తన ఈమెయిల్ ఖాతాను హ్యాక్ చేశారని చేసిన ఫిర్యాదుపై ఢిల్లీ పోలీసులు గురువారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తన ఈమెయిల్‌ను హ్యాక్ చేసి, తన గౌరవాన్ని మంటగలిపే సమాచారాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు సమాచార,సాంకేతిక పరిజ్ఞాన(ఐటీ) చట్టం, ఐపీసీ సెక్షన్ల కింద కేసు పెట్టారు. అమృతతో తనకు సన్నిహిత సంబంధముందని దిగ్విజయ్ బుధవారం ట్విట్టర్లో ప్రకటించడం తెలిసిందే. అమృత, ఆమె భర్త విడాకులకు దరఖాస్తు చేసుకున్నారని, అది పరిష్కారమయ్యాక ఆమెను పెళ్లి చేసుకుంటానని ఆయన తెలిపారు. -
ఆర్థికశాఖలో ఈమెయిల్ అకౌంట్ హ్యాక్!!
ఆర్థిక మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి ఈమెయిల్ అకౌంట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ చేశారు. ఇంగ్లండ్‌లోని ఈ హ్యాకర్, ఏకంగా డబ్బులు పంపాలని కోరుతూ ఆ అకౌంట్ నుంచి మెయిల్స్ పంపేశాడు కూడా. తన ఈమెయిల్ హ్యాకింగ్‌కు గురైందని, అందువల్ల లండన్ చిరునామా నుంచి వచ్చే మెయిళ్లు వేటినీ పట్టిచుకోవద్దని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి, అదనపు డీజీ (మీడియా అండ్ కమ్యూనికేషన్) డీఎస్ మాలిక్ తెలిపారు. తాను చాలా ఇబ్బందుల్లో ఉన్నానని, అందువల్ల అత్యవసరంగా డబ్బులు అవసరమని చెబుతూ అత్యవసరంగా 1500 పౌండ్లు ('సుమారు లక్షన్నర రూపాయలు) పంపాలని సదరు హ్యాకర్ తన మెయిళ్లలో పేర్కొన్నాడు. లండన్‌లో ఉన్నానని, తన పనులన్నీ పూర్తిచేసుకోవాలంటే 1500 పౌండ్లు కావాలని, వీలైనంత త్వరగా ఆ సొమ్ము తిరిగి ఇచ్చేస్తానని తెలిపాడు. వెస్ట్రన్ యూనియన్ మనీ ట్రాన్స్ఫర్ ద్వారా ఆ సొమ్ము పంపాలంటూ పలువురు పాత్రికేయులకు ఈ మెయిల్ పంపాడు. తన చిరునామాను 191 కింగ్స్టన్ రోడ్డు, లండన్, ఎస్‌డబ్ల్యు1హెచ్, యునైటెడ్ కింగ్డమ్ అని పేర్కొన్నాడు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న మాలిక్, లండన్ నుంచి పంపినట్లుగా ఆ హ్యాకర్ మెయిల్స్ పంపేశాడు!! -
వీవీఎస్ లక్ష్మణ్ ఖాతాలోంచి 10 లక్షలు మాయం!!
ప్రఖ్యాత క్రికెటర్, సొగసరి బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్ హ్యాకర్ల బారిన పడ్డారు. ఆయన ఈమెయిల్ అకౌంట్‌ను ఓ వ్యక్తి హ్యాకింగ్ చేసి, ఏకంగా ఆయన ఖాతాలోంచి 10 లక్షల రూపాయలు మాయం చేశాడు!! ఇజాతుల్ షేక్ అనే నిందితుడిని ఈ కేసులో కోల్‌కతాలోని సాల్ట్ లేక్ పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించేందుకు, ఇక్కడకు తీసుకొచ్చేందుకు సైబరాబాద్ పోలీసు బృందం ఒకటి కూడా ఇప్పటికే కోల్‌కతా బయల్దేరింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఐపీఎల్ టీం సన్‌రైజర్స్ మెంటార్ అయిన లక్ష్మణ్ ఐదు రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులకు ఫోన్ చేసి, తన బ్యాంకు ఖాతా లోంచి రూ. 10 లక్షలు తనకు తెలియకుండానే విత్‌డ్రా అయిపోయాయని, డబ్బులు డ్రా అయిన తర్వాత తనకు ఎస్ఎంఎస్ వచ్చిందని తెలిపారు. ఎవరో తన ఈ మెయిల్ ఐడీని హ్యాక్ చేసి, ఈ పని చేసి ఉంటారని ఆయన తెలుసుకున్నారు. హ్యాకర్ ఇజాతుల్ షేక్, వీవీఎస్ ఈమెయిల్ అకౌంట్‌ను హ్యాక్ చేసి, దాన్నుంచి ఆయన బ్యాంకుకు ఓ మెయిల్ పంపి, తన ఖాతాలోంచి రూ. 10 లోలను సాల్ట్ లేక్‌లోని ఓ బ్యాంకు ఖాతాకు పంపాల్సిందిగా కోరారు. దాంతో బ్యాంకు అధికారులు అలాగే పంపేశారు. పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, కోల్‌కతా సాల్ట్‌లేక్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు బ్యాంకుకు ఆ మొత్తం వెళ్లినట్లు గుర్తించారు. సాల్ట్‌లేక్ పోలీసు ఉన్నతాధికారికి, బ్యాంకు అధికారులకు ఫ్యాక్స్ పంపి, ఆ ఖాతాను ఫ్రీజ్ చేయాల్సిందిగా కోరారు. అయితే.. అదృష్టవశాత్తు లక్ష్మణ్ ఖాతా నుంచి వేరే ఖాతాకు మళ్లిన పది లక్షల రూపాయలను ఇంకా ఎవరూ డ్రా చేయలేదని తెలిసింది. బ్యాంకు అధికారులు పన్నిన వలలో హ్యాకర్ ఇజాతుల్ షేక్ సులభంగా పడిపోయాడు. అతడి ఖాతా గురించి కొన్ని వివరాలు కావాలని, అందువల్ల బ్యాంకుకు రావాలని కోరగా.. వెంటనే వచ్చాడు. అప్పటికే అక్కడ కాసుకుని ఉన్న పోలీసులు తక్షణ అతడిని అరెస్టు చేశారు.