వీవీఎస్ లక్ష్మణ్ ఖాతాలోంచి 10 లక్షలు మాయం!!
ప్రఖ్యాత క్రికెటర్, సొగసరి బ్యాట్స్మన్ వీవీఎస్ లక్ష్మణ్ హ్యాకర్ల బారిన పడ్డారు. ఆయన ఈమెయిల్ అకౌంట్ను ఓ వ్యక్తి హ్యాకింగ్ చేసి, ఏకంగా ఆయన ఖాతాలోంచి 10 లక్షల రూపాయలు మాయం చేశాడు!! ఇజాతుల్ షేక్ అనే నిందితుడిని ఈ కేసులో కోల్కతాలోని సాల్ట్ లేక్ పోలీసులు పట్టుకున్నారు. అతడిని విచారించేందుకు, ఇక్కడకు తీసుకొచ్చేందుకు సైబరాబాద్ పోలీసు బృందం ఒకటి కూడా ఇప్పటికే కోల్కతా బయల్దేరింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఐపీఎల్ టీం సన్రైజర్స్ మెంటార్ అయిన లక్ష్మణ్ ఐదు రోజుల క్రితం సైబరాబాద్ పోలీసులకు ఫోన్ చేసి, తన బ్యాంకు ఖాతా లోంచి రూ. 10 లక్షలు తనకు తెలియకుండానే విత్డ్రా అయిపోయాయని, డబ్బులు డ్రా అయిన తర్వాత తనకు ఎస్ఎంఎస్ వచ్చిందని తెలిపారు. ఎవరో తన ఈ మెయిల్ ఐడీని హ్యాక్ చేసి, ఈ పని చేసి ఉంటారని ఆయన తెలుసుకున్నారు. హ్యాకర్ ఇజాతుల్ షేక్, వీవీఎస్ ఈమెయిల్ అకౌంట్ను హ్యాక్ చేసి, దాన్నుంచి ఆయన బ్యాంకుకు ఓ మెయిల్ పంపి, తన ఖాతాలోంచి రూ. 10 లోలను సాల్ట్ లేక్లోని ఓ బ్యాంకు ఖాతాకు పంపాల్సిందిగా కోరారు. దాంతో బ్యాంకు అధికారులు అలాగే పంపేశారు.
పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించి, కోల్కతా సాల్ట్లేక్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు బ్యాంకుకు ఆ మొత్తం వెళ్లినట్లు గుర్తించారు. సాల్ట్లేక్ పోలీసు ఉన్నతాధికారికి, బ్యాంకు అధికారులకు ఫ్యాక్స్ పంపి, ఆ ఖాతాను ఫ్రీజ్ చేయాల్సిందిగా కోరారు. అయితే.. అదృష్టవశాత్తు లక్ష్మణ్ ఖాతా నుంచి వేరే ఖాతాకు మళ్లిన పది లక్షల రూపాయలను ఇంకా ఎవరూ డ్రా చేయలేదని తెలిసింది. బ్యాంకు అధికారులు పన్నిన వలలో హ్యాకర్ ఇజాతుల్ షేక్ సులభంగా పడిపోయాడు. అతడి ఖాతా గురించి కొన్ని వివరాలు కావాలని, అందువల్ల బ్యాంకుకు రావాలని కోరగా.. వెంటనే వచ్చాడు. అప్పటికే అక్కడ కాసుకుని ఉన్న పోలీసులు తక్షణ అతడిని అరెస్టు చేశారు.