టీమిండియా తదుపరి హెడ్‌కోచ్‌ అతడే: పాక్‌ మాజీ క్రికెటర్‌ | Hot Hot Hot Candidate: Ex Pak Star Picks Gambhir Successor As Head Coach | Sakshi
Sakshi News home page

గంభీర్‌కు సవాలు.. టీమిండియా తదుపరి హెడ్‌కోచ్‌ అతడే: పాక్‌ మాజీ క్రికెటర్‌

Published Thu, Nov 14 2024 3:20 PM | Last Updated on Thu, Nov 14 2024 4:41 PM

Hot Hot Hot Candidate: Ex Pak Star Picks Gambhir Successor As Head Coach

టీమిండియా మాజీ బ్యాటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ను ఉద్దేశించి పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గౌతం గంభీర్‌ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్‌గా లక్ష్మణ్‌ ఎంపికయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్నాడు. సౌతాఫ్రికా పర్యటనలో భారత జట్టు అద్భుత ప్రదర్శనే అతడి శిక్షణా నైపుణ్యాలకు నిదర్శనమని కొనియాడాడు.

శుభారంభమే అయినా
టీ20 ప్రపంచకప్‌-2024లో భారత్‌ చాంపియన్‌గా అవతరించిన తర్వాత రాహుల్‌ ద్రవిడ్‌ హెడ్‌కోచ్‌ పదవి నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 2007, 2011 వరల్డ్‌కప్‌ హీరో గౌతం గంభీర్‌ ద్రవిడ్‌ స్థానాన్ని భర్తీ చేశాడు. శ్రీలంక పర్యటనతో తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి టీ20 సిరీస్‌లో క్లీన్‌స్వీప్‌ విజయం అందుకున్నాడు.

అయితే, లంకతో వన్డే సిరీస్‌లో చారిత్రక ఓటమి తర్వాత.. మళ్లీ సొంతగడ్డపై గంభీర్‌ మార్గదర్శనంలో టీమిండియా మరో వైట్‌వాష్‌ విజయం అందుకుంది. బంగ్లాదేశ్‌ను టెస్టుల్లో 2-0తో ఓడించింది. అయితే, ఆ తర్వాత మరో ఘోర ఓటమిని చవిచూసింది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో 3-0తో క్లీన్‌స్వీప్‌నకు గురై.. చెత్త రికార్డులు మూటగట్టుకుంది.

ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్‌కు అసలైన సవాలు
ఇక ఇప్పుడు ఆస్ట్రేలియా పర్యటన రూపంలో గంభీర్‌కు అసలైన సవాలు ఎదురుకానుంది. అక్కడ బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో టీమిండియా పాసైతేనే గంభీర్‌ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. లేదంటే.. విమర్శలతో పాటు కోచ్‌ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్లూ వచ్చినా ఆశ్చర్యం లేదు.

వెరీ వెరీ స్పెషల్‌ లక్ష్మణ్‌ మాత్రం
మరోవైపు.. ప్రధాన కోచ్‌ల గైర్హాజరీలో టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్న వీవీఎస్ లక్ష్మణ్‌ మాత్రం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత జింబాబ్వే టూర్‌లో లక్ష్మణ్‌ సారథ్యంలో యువ జట్టు 4-1తో టీ20 సిరీస్‌ గెలిచింది. తాజాగా సౌతాఫ్రికా గడ్డపై పటిష్ట ప్రొటిస్‌ జట్టుపై కూడా సూర్యకుమార్‌ సేన సత్తా చాటుతోంది.

సెంచూరియన్‌లో జరిగిన మూడో టీ20లో భారీ స్కోరు సాధించడమే గాక.. లక్ష్యాన్ని కాపాడుకుని గెలుపు జెండా ఎగురవేసింది. ఈ క్రమంలో నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ముందంజలో నిలిచింది.ఈ నేపథ్యంలో పాక్‌ మాజీ క్రికెటర్‌ బసిత్‌ అలీ లక్ష్మణ్‌పై ప్రశంసలు కురిపించాడు.

టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే హాట్‌, హాట్‌, హాట్‌ కేకు
‘‘ఈరోజు వీవీఎస్‌ వ్యూహాలను చూసిన తర్వాత.. టీమిండియా హెడ్‌కోచ్‌గా అతడే హాట్‌, హాట్‌, హాట్‌ కేకు అనిపించింది. సూర్యకుమార్‌ యాదవ్‌ను మూడో నంబర్‌లో బ్యాటింగ్‌కు పంపకుండా కొత్త ప్రణాళికను అమలు చేశాడు.

ఒకవేళ​ ఆస్ట్రేలియా పర్యటనలో గంభీర్‌ గనుక విఫలమైతే.. వీవీఎస్‌ తదుపరి కోచ్‌గా.. రేసులో ముందుకు దూసుకువస్తాడు. మూడో టీ20లో సూర్యను మూడో నంబర్‌లో పంపకుండా.. ఉండటం వల్లే సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో టీమిండియాకు అనుకూల ఫలితం వచ్చింది’’ అని బసిత్‌ అలీ పేర్కొన్నాడు.

11 పరుగుల తేడాతో టీమిండియా విజయం
కాగా సెంచూరియన్‌లో బుధవారం జరిగిన మూడో టీ20లో కెప్టెన్‌ సూర్యకుమార్‌కు బదులు తిలక్‌ వర్మ మూడో నంబర్‌లో బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే 107 పరుగులతో అజేయంగా నిలిచిన ఈ హైదరాబాదీ.. జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 219 పరుగులు చేసిన టీమిండియా.. 11 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయం సాధించింది.

చదవండి: చరిత్ర సృష్టించిన తిలక్‌ వర్మ.. ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా ఘనత

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement