లక్నో మెంటార్‌గా జహీర్‌ ఖాన్‌! | Punjab Kings looks for Indian coach to replace Trevor Bayliss | Sakshi
Sakshi News home page

లక్నో మెంటార్‌గా జహీర్‌ ఖాన్‌!

Published Fri, Aug 23 2024 11:30 AM | Last Updated on Fri, Aug 23 2024 2:51 PM

Punjab Kings looks for Indian coach to replace Trevor Bayliss

భారత మాజీ పేసర్‌తో ఫ్రాంచైజీ మంతనాలు

పంజాబ్‌ కింగ్స్‌ కోచ్‌ రేసులో వీవీఎస్‌ లక్ష్మణ్‌

న్యూఢిల్లీ: భారత మాజీ పేసర్‌ జహీర్‌ ఖాన్‌ను మెంటార్‌గా నియమించుకునేందుకు ఐపీఎల్‌ ఫ్రాంచైజీ లక్నో సూపర్‌ జెయింట్స్‌ (ఎల్‌ఎస్‌జీ) ప్రయత్నాలు చేస్తోంది. మెగా వేలం ప్రారంభానికి ముందే జహీర్‌తో ఒప్పందం కుదుర్చుకోవాలని లక్నో జట్టు యాజమాన్యం భావిస్తోంది. ముంబై ఇండియన్స్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌ హెడ్‌గా పనిచేస్తున్న జహీర్‌ ఖాన్‌.. ఐపీఎల్‌లో 10 సీజన్లపాటు మూడు జట్ల తరఫున 100 మ్యాచ్‌లు ఆడి 102 వికెట్లు పడగొట్టాడు.

2017లో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన జహీర్‌... అప్పటి నుంచి ముంబై ఇండియన్స్‌తో  కొనసాగుతున్నాడు. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించిన గౌతమ్‌ గంభీర్‌ 2023 సీజన్‌ అనంతరం లక్నోను వీడి కోల్‌కతా నైట్‌రైడర్స్‌ (కేకేఆర్‌) జట్టుకు మారాడు. ఈ సీజన్‌లో గంభీర్‌ మార్గదర్శకత్వంలో కోల్‌కతా జట్టు అద్వితీయ ప్రదర్శన కనబర్చి మూడోసారి ఐపీఎల్‌ ట్రోఫీ కైవసం చేసుకుంది. ‘టీమ్‌ మెంటార్‌గా జహీర్‌ ఖాన్‌ను నియమించేందుకు లక్నో సూపర్‌ జెయింట్స్‌ యాజమాన్యం ప్రయత్నిస్తోంది.

గంభీర్‌ నిష్క్రమణతో అతడి స్థానాన్ని జహీర్‌తో భర్తీ చేయాలని అనుకుంటున్నారు’ అని పలు కథనాలు వెలుగులోకి వచ్చాయి. గంభీర్‌ మెంటార్‌షిప్‌లో 2022, 2023లో ప్లేఆఫ్స్‌కు చేరిన లక్నో... ఈ ఏడాది అంతగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా లక్నో బౌలింగ్‌ కోచ్‌ మోర్నీ మోర్కెల్‌ కూడా ఆ జట్టును వీడి... భారత జాతీయ జట్టు బౌలింగ్‌ కోచ్‌గా నియమితుడయ్యాడు. దీంతో లక్నో జట్టు ఐపీఎల్‌ మెగా వేలానికి ముందు సహాయక సిబ్బంది ఎంపిక పూర్తి చేయాలని భావిస్తోంది.

మరోవైపు పంజాబ్‌ కింగ్స్‌ జట్టు కూడా కోచ్‌ కోసం అన్వేషణ కొనసాగిస్తోంది. హెడ్‌ కోచ్‌ ట్రేవర్‌ బేలిస్‌ స్థానంలో భారత ఆటగాడికే ఈ బాధ్యతలు అప్పగించాలని పంజాబ్‌ యాజమాన్యం భావిస్తోంది. అయితే ఈ జాబితాలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ పేరు బలంగా వినిపిస్తోంది. ఆటపై అపార అనుభవం ఉన్న లక్ష్మణ్‌ ప్రధాన కోచ్‌ పదవికి సరైన ప్రత్యామ్నాయం అని పంజాబ్‌ మేనేజ్‌మెంట్‌ భావిస్తోంది.

అయితే గత కొన్నాళ్లుగా బీసీసీఐతో కొనసాగుతున్న వీవీఎస్‌.. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) హెడ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరో ఏడాది కాలం లక్ష్మణ్‌ ఎన్‌సీఏ హెడ్‌గా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో పంజాబ్‌ ప్రయత్నాలు ఫలిస్తాయా చూడాలి!    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement