SRH: సన్‌రైజర్స్‌ గుండెల్లో గుబులు.. మ్యాచ్‌ గనుక రద్దైతే! | Sakshi
Sakshi News home page

Playoff Race: సన్‌రైజర్స్‌ గుండెల్లో వర్షం గుబులు.. మ్యాచ్‌ రద్దైతే గనుక!

Published Wed, May 8 2024 11:40 AM

PC: SRH

ఐపీఎల్‌-2024 ప్లే ఆఫ్స్‌ రేసు రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే పదకొండేసి మ్యాచ్‌లు ఆడిన కోల్‌కతా నైట్‌ రైడర్స్‌(నెట్‌ రన్‌రేటు 1.453), రాజస్తాన్‌ రాయల్స్ రాయల్స్‌(నెట్‌ రన్‌రేటు 0.476) ఎనిమిది గెలిచి టాప్‌-2లో తిష్ట వేశాయి.

చెరో పదహారు పాయింట్లతో ప్లే ఆఫ్స్‌ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం మూడో స్థానం కోసం 12 పాయింట్లతో ఉన్న చెన్నై సూపర్‌ కింగ్స్, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (-0.065)మధ్య జరుగుతున్న పోటీలో ఇప్పటి వరకు రన్‌రేటు పరంగా మెరుగ్గా ఉన్న సీఎస్‌కే(0.700)నే పైచేయి సాధించింది.

ప్లే ఆఫ్స్‌ పోటీలో కీలక మ్యాచ్‌
దీంతో రైజర్స్‌ నాలుగో స్థానంలో కొనసాగుతుండగా.. రాజస్తాన్‌ రాయల్స్‌పై మంగళవారం నాటి విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ సైతం ముందుకు దూసుకువచ్చింది. ఇక లక్నో సూపర్‌ జెయింట్స్‌ సైతం 12 పాయింట్లతో ఆరో స్థానంలో కొనసాగుతూ టాప్‌-4పై కన్నేసింది.

ఈ నేపథ్యంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌- లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య బుధవారం నాటి మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్స్‌ రేసులో ముందుకు దూసుకువెళ్తుంది. అదే సమయంలో ఓడిన జట్టు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.

పొంచి ఉన్న వాన గండం
అయితే, సొంతగడ్డపై మ్యాచ్‌ జరుగనుండటం సన్‌రైజర్స్‌కు సానుకూల అంశమే అయినా.. వర్షం రూపంలో ప్రమాదం పొంచి ఉంది. ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో ఇప్పటి వరకు 56 మ్యాచ్‌లు జరిగాయి.

కానీ ఒక్క మ్యాచ్‌ కూడా వరణుడి కారణంగా రద్దు కాలేదు. అయితే, ఉప్పల్‌ స్టేడియంలో జరగాల్సిన సన్‌రైజర్స్‌- లక్నో మ్యాచ్‌కు మాత్రం వాన గండం పొంచి ఉంది. హైదరాబాద్‌లో మంగళవారం కుండపోతగా వర్షం కురిసింది.

ఈ నేపథ్యంలో స్టేడియం సిబ్బంది మైదానంలోని మధ్య భాగాన్ని కవర్లతో కప్పి ఉంచారు. అయితే, వాతావరణ శాఖ రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని మంగళవారం హెచ్చరించడం ఆరెంజ్‌ ఆర్మీ గుండెల్లో గుబులు రేపుతోంది.

మ్యాచ్‌ గనుక రద్దు అయితే
కాగా తాజా సీజన్‌లో ఆరంభ మ్యాచ్‌లో తడబడ్డా ప్యాట్‌ కమిన్స్‌ బృందం తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుంది. 266.. 277.. 287 స్కోర్లు నమోదు చేసి పరుగుల విధ్వంసానికి మారుపేరుగా నిలిచింది.

అయితే, గత కొన్ని మ్యాచ్‌ల నుంచి సన్‌రైజర్స్‌ పేలవ బ్యాటింగ్‌తో తేలిపోతోంది. ఆఖరిగా సోమవారం ముంబై ఇండియన్స్‌తో ఆడిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ ఏడు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది.  

ఇక బుధవారం నాటి మ్యాచ్‌ గనుక రద్దైతే సన్‌రైజర్స్‌, లక్నోల ఖాతాలో చెరో పాయింట్‌ చేరుతుంది. అలా కాక మ్యాచ్‌ సాఫీగా సాగితే గెలిచిన జట్టుకు రెండు పాయింట్లు వస్తాయి.

వాతావరణ శాఖ హెచ్చరిక
నగరంలో వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

చదవండి: సంజూ శాంసన్‌కు ఊహించని షాకిచ్చిన బీసీసీఐ
 

Advertisement
 
Advertisement
 
Advertisement