భార‌త క్రికెట్‌లో విషాదం.. దిగ్గ‌జ స్పిన్న‌ర్ క‌న్నుమూత‌ | Padmakar Shivalkar passes away aged 84 | Sakshi
Sakshi News home page

#Padmakar Shivalkar: భార‌త క్రికెట్‌లో విషాదం.. దిగ్గ‌జ స్పిన్న‌ర్ క‌న్నుమూత‌

Published Tue, Mar 4 2025 8:33 AM | Last Updated on Tue, Mar 4 2025 9:59 AM

Padmakar Shivalkar passes away aged 84

భారత క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పద్మాకర్‌ శివాల్కర్‌ (84) సోమవారం కన్నుమూశారు. దేశవాళీ క్రికెట్‌లో అద్భుతమైన రికార్డు ఉన్నా... దురదృష్టవశాత్తూ భారత జట్టు తరఫున ఒక్క మ్యాచ్‌ కూడా ఆడలేకపోయిన ఆటగాళ్ల జాబితాలో పద్మాకర్‌ పేరు ముందుంటుంది. పద్మాకర్‌తో పాటు రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన రాజీందర్‌ గోయల్‌కు కూడా ఎప్పుడూ భారత్‌కు ఆడే అవకాశం రాలేదు.

దిగ్గజ బౌలర్‌ బిషన్‌సింగ్‌ బేడి కెరీర్‌ ఆ సమయంలో ఉధృతంగా సాగుతుండగా... బేడీని కాదని మరో లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ను ఎంపిక చేసే అవకాశమే లేకపోయింది.   1961 నుంచి 1987 మధ్య 26 ఏళ్ల పాటు పద్మాకర్‌ ఫస్ట్‌ క్లాస్‌ కెరీర్‌ సాగింది. 124 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ కేవలం 19.69 సగటుతో 589 వికెట్లు పడగొట్టారు. 42 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కనబర్చిన పద్మాకర్‌కు 13 సార్లు మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. 

ఇందులో ముంబై తరఫునే రంజీ ట్రోఫీలో 361 వికెట్లు వచ్చాయి. ఇప్పటికీ ఈ ముంబై రికార్డు చెరిగిపోలేదు. 1965–1976 మధ్య 11 సీజన్ల పాటు వరుసగా పద్మాకర్‌ ముంబై జట్టులో భాగం కాగా... 10 సార్లు టీమ్‌ టైటిల్‌ గెలుచుకుంది. 1980–81 సీజన్‌లో మరోసారి టైటిల్‌ విజయంపై భాగమైన తర్వాత పద్మాకర్‌ కొంత కాలం ఆటకు దూరమయ్యారు. ఆపై ఏడేళ్ల విరామం తర్వాత 1987–88 సీజన్‌లో పద్మాకర్‌ 47 ఏళ్ల వయసులో మళ్లీ ముంబై తరఫున బరిలోకి దిగి మరో రెండు మ్యాచ్‌లు ఆడటం విశేషం. 

చెన్నైలో జరిగిన 1972–73 సీజన్‌ ఫైనల్‌ మ్యాచ్‌లలో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 34 పరుగులకే 13 వికెట్లు పడగొట్టి జట్టును విజేతగా నిలపడం ఆయన  కెరీర్‌లో చిరస్మరణీయ ప్రదర్శన. 2017లో బీసీసీఐ పద్మాకర్‌ను సీకే నాయుడు లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డుతో సత్కరించింది. పద్మాకర్‌ను జట్టులోకి తీసుకునే విధంగా సెలక్టర్లను ఒప్పించలేకపోవడం తన కెప్టెన్సీ కెరీర్‌లో అమితంగా బాధించిన క్షణం అని సునీల్‌ గావస్కర్‌ సంతాపం వ్యక్తం చేశారు.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement