Padmakar sivalkar
-
భారత క్రికెట్లో విషాదం.. దిగ్గజ స్పిన్నర్ కన్నుమూత
భారత క్రికెట్లో అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న పద్మాకర్ శివాల్కర్ (84) సోమవారం కన్నుమూశారు. దేశవాళీ క్రికెట్లో అద్భుతమైన రికార్డు ఉన్నా... దురదృష్టవశాత్తూ భారత జట్టు తరఫున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన ఆటగాళ్ల జాబితాలో పద్మాకర్ పేరు ముందుంటుంది. పద్మాకర్‌తో పాటు రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు పడగొట్టిన రాజీందర్ గోయల్‌కు కూడా ఎప్పుడూ భారత్‌కు ఆడే అవకాశం రాలేదు.దిగ్గజ బౌలర్ బిషన్‌సింగ్ బేడి కెరీర్ ఆ సమయంలో ఉధృతంగా సాగుతుండగా... బేడీని కాదని మరో లెఫ్టార్మ్ స్పిన్నర్‌ను ఎంపిక చేసే అవకాశమే లేకపోయింది. 1961 నుంచి 1987 మధ్య 26 ఏళ్ల పాటు పద్మాకర్ ఫస్ట్ క్లాస్ కెరీర్ సాగింది. 124 మ్యాచ్‌లు ఆడిన ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ కేవలం 19.69 సగటుతో 589 వికెట్లు పడగొట్టారు. 42 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన కనబర్చిన పద్మాకర్‌కు 13 సార్లు మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన రికార్డు ఉంది. ఇందులో ముంబై తరఫునే రంజీ ట్రోఫీలో 361 వికెట్లు వచ్చాయి. ఇప్పటికీ ఈ ముంబై రికార్డు చెరిగిపోలేదు. 1965–1976 మధ్య 11 సీజన్ల పాటు వరుసగా పద్మాకర్ ముంబై జట్టులో భాగం కాగా... 10 సార్లు టీమ్ టైటిల్ గెలుచుకుంది. 1980–81 సీజన్లో మరోసారి టైటిల్ విజయంపై భాగమైన తర్వాత పద్మాకర్ కొంత కాలం ఆటకు దూరమయ్యారు. ఆపై ఏడేళ్ల విరామం తర్వాత 1987–88 సీజన్లో పద్మాకర్ 47 ఏళ్ల వయసులో మళ్లీ ముంబై తరఫున బరిలోకి దిగి మరో రెండు మ్యాచ్‌లు ఆడటం విశేషం. చెన్నైలో జరిగిన 1972–73 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లలో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 34 పరుగులకే 13 వికెట్లు పడగొట్టి జట్టును విజేతగా నిలపడం ఆయన కెరీర్లో చిరస్మరణీయ ప్రదర్శన. 2017లో బీసీసీఐ పద్మాకర్‌ను సీకే నాయుడు లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించింది. పద్మాకర్‌ను జట్టులోకి తీసుకునే విధంగా సెలక్టర్లను ఒప్పించలేకపోవడం తన కెప్టెన్సీ కెరీర్లో అమితంగా బాధించిన క్షణం అని సునీల్ గావస్కర్ సంతాపం వ్యక్తం చేశారు. -
శివాల్కర్, గోయల్‌లకు జీవిత సాఫల్య పురస్కారాలు
శాంతా రంగస్వామికి కూడా 8న బెంగళూరులో బీసీసీఐ వార్షిక అవార్డుల ప్రదానం న్యూఢిల్లీ: భారత దేశవాళీ క్రికెట్లో దిగ్గజాలుగా పేరు తెచ్చుకున్న మాజీ స్పిన్నర్లు రాజిందర్ గోయల్, పద్మాకర్ శివాల్కర్‌లు సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారానికి నామినేట్ అయ్యారు. వీరితో పాటు మహిళా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి కూడా ఉన్నారు. ఈ పురస్కారం పొందనున్న తొలి మహిళా క్రికెటర్‌గా ఆమె నిలవనుంది. మార్చి 8న బెంగళూరులో బీసీసీఐ వార్షిక అవార్డుల కార్యక్రమం జరుగుతుంది. ‘గోయల్, శివాల్కర్ భారత క్రికెట్‌కు అందించిన సేవలకు తగిన గుర్తింపు లభించాల్సిన అవసరం ఉందని ఎన్.రామ్, రామచంద్ర గుహ, డయానా ఎడుల్జిలతో కూడిన అవార్డుల కమిటీ అభిప్రాయపడింది’ అని బీసీసీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. హరియాణా తరఫున ఆడిన గోయల్ రంజీ చరిత్రలోనే అత్యధిక వికెట్లు (637) తీసిన బౌలర్‌గా పేరు తెచ్చుకున్నారు. ఓవరాల్‌గా ఆయన 750 ఫస్ట్ క్లాస్ వికెట్లు పడగొట్టారు. ఇక శివాల్కర్ ఆడిన 124 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 589 వికెట్లు తీయగా... ఇందులో 13 సార్లు పది వికెట్ల చొప్పున తీశారు. అయితే బిషన్ సింగ్ బేడీ ఉజ్వలంగా వెలుగుతున్న దశలోనే వీరి కెరీర్ కూడా సాగడంతో జాతీయ జట్టులో మరో ఎడంచేతి వాటం స్పిన్నర్‌కు స్థానం లేకుండా పోయింది. 1975–76లో బేడీపై వేటు కారణంగా శివాల్కర్ జట్టులోకి వచ్చినా 12వ ఆటగాడిగా ఉన్నారు. శాంతా రంగస్వామి నేతృత్వంలో భారత మహిళల జట్టు 12 టెస్టుల్లో, 16 వన్డేల్లో తలపడింది. మరోవైపు వామన్ విశ్వనాథ్ కుమార్, దివంగత రమాకాంత్ దేశాయ్‌లకు బీసీసీఐ ప్రత్యేక అవార్డులు దక్కనున్నాయి. అవార్డులకు ముందు రోజు జరిగే ఎంఏకే పటౌడీ స్మారక ఉపన్యాసంలో మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ ఉపన్యసిస్తారు.