జాతీయ క్రికెట్‌లో అదరగొడుతున్న గుంటూరు యువ కెరటం
20 ఏళ్ల తర్వాత జిల్లాకు కెప్టెన్సీ అవకాశం
పేదరికాన్ని జయించి, విజయాల వైపు రషీద్ చూపు
గుంటూరు వెస్ట్: విజయాలకు అడ్డదారులుండవు. కఠోర సాధనతోపాటు క్రమశిక్షణ ఎంతటి వారినైనా విజయతీరాల వైపు నడిపిస్తాయని గుంటూరుకు చెందిన షేక్ రషీద్ నిరూపిస్తున్నాడు. ఇంతై వటుడింతై అన్నట్లు అండర్–14 చిన్నారుల క్రికెట్ నుంచి విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలాంటి వారితో క్రికెట్ ఆడే అవకాశాల్ని దక్కించుకున్నాడు. ఇప్పుడు ఆంధ్ర రంజీ క్రికెట్ జట్టు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. కేవలం 21 సంవత్సరాల వయస్సులోనే ఈ బాధ్యతలు చేపట్టే అవకాశం దక్కడం మరో విశేషం.
దాదాపు 20 ఏళ్ల తర్వాత గుంటూరు జిల్లాకు రంజీ సారథ్యం లభించడం విశేషం. ఎంఎస్‌కే ప్రసాద్ తర్వాత రషీదే కావడం గమనార్హం. గల్లీ క్రికెట్ నుంచి ఢిల్లీ క్రికెట్ వరకు లభించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతోపాటు ఆడే ప్రతి జట్టుకు నమ్మదగిన బ్యాటర్‌గా చక్కని సేవలందిస్తున్నాడు. రెండేళ్ల నుంచి చైన్నె సూపర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతి సాధారణ కుటుంబంలో పుట్టిన ఈ యువకుడు స్థానిక ఎన్జీఓ కాలనీలో కుటుంబంతో జీవిస్తున్నాడు.
జీవితాన్ని మార్చేసిన అండర్–19 భారత జట్టు స్థానం
2021లో అండర్–19 భారత జట్టులో రషీద్ స్థానం సంపాదించడంతోపాటు వైస్ కెప్టెన్ బాధ్యతలు చేపట్టాడు. 2022లో భారత జట్టు ప్రపంచ కప్ సాధించడంలో కీలక భూమిక పోషించాడు. దీంతోపాటు చాలెంజర్స్ ట్రోఫీకి ఎంపికవ్వడమే కాకుండా ఇండియా –డి జట్టుకు సారథ్యం వహించి తన జట్టును చాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ ట్రోఫీలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌తోపాటు 274 పరుగులు సాధించాడు. 2022లో కోల్‌కొత్తాలో జరిగిన ట్రయాంగిల్ సిరీస్, ఏషియన్ పోటీలోనూ చక్కగా రాణించాడు. ఈ ఏడాది దులీప్ ట్రోఫీలో మ్యాచ్‌లు ఆడుతున్నాడు.
కొహ్లి ఆటంటే ఎంతో ఇష్టం
రషీద్ కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్. మైదానంలో సొగసైన డ్రైవ్స్‌తో అందరినీ ఆకట్టుకుంటాడు. తడబాటుకు తావులేకుండా ఆడడమే తన విజయ రహస్యమంటాడు. ప్రతి మ్యాచ్‌లోనూ ఔటైన విధానాన్ని నెట్ ప్రాక్టీస్‌లో సరి చేసుకుంటాడు. దీని కోసం బౌలర్లకు కఠిన పరీక్షలు పెడతాడని సహచర క్రికెటర్లు సరదాగా అంటుంటారు. ముఖ్యంగా రషీద్‌కు విరాట్ కోహ్లి ఆరాధ్య క్రికెటర్. కోహ్లి ఆడే విధానం, అతడి దృఢ చిత్తం గొప్పవరమని రషీద్ అంటాడు. కోహ్లి ఆటతోపాటు ఫిట్‌నెస్‌పై తీసుకునే జాగ్రత్తలు ప్రతి క్రికెటర్‌కు మార్గదర్శకాలని కితాబునిస్తాడు.
Comments
Please login to add a commentAdd a comment