సహజ వనరులు దోచిపెట్టేందుకే మారణకాండ
Published Sat, Dec 17 2016 2:20 AM | Last Updated on Mon, Sep 4 2017 10:53 PM
జంగారెడ్డిగూడెం : గ్రీన్‌హంట్ పేరుతో ప్రభుత్వాలు దండకారణ్య ప్రాంతంలో ఉద్యమకారులను, ఆదివాసీలను దారుణగా కాల్చి చంపుతున్నాయని ఏపీ సీఎల్‌సీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నంబూరి శ్రీమన్నారాయణ ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు సహజ వనరులు కట్టబెట్టేందుకు ఈ మారణకాండ కొనసాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యహింసను పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చత్తీస్‌ఘడ్, ఒడిశా ప్రాంతాల్లో పౌరులను, ఆదివాసీలను, నక్సల్స్‌ను కాల్చి చంపడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. నక్సల్స్ సమస్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య అని ఈ సమస్య పరిష్కారానికి ఎన్‌కౌంటర్ల పేరుతో హత్యలు చేయడం సమంజసంకాదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేశాయన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య పరిష్కారానికి తుపాకీతో సమాధానం చెప్పాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎ¯ŒSకౌంటర్ నిలుపుదల చేసి సహజ వనరుల పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. శాంతియుత సమాజం కోసం ఎన్‌కౌంటర్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూ.1,000, రూ.500 నోట్లు రద్దు వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. నగదు రహిత సమాజం భారతీయ సమాజంలో సాధ్యం కాదని పేర్కొన్నారు. కెన్యా తదితర చిన్నదేశాల్లో ఈ విధానం అమలు చేయడం వల్ల ద్రవ్యోల్భణం పెరిగి ఆయా దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని గుర్తుచేశారు.
Advertisement
Advertisement