apclc
-
సహజ వనరులు దోచిపెట్టేందుకే మారణకాండ
జంగారెడ్డిగూడెం : గ్రీన్‌హంట్ పేరుతో ప్రభుత్వాలు దండకారణ్య ప్రాంతంలో ఉద్యమకారులను, ఆదివాసీలను దారుణగా కాల్చి చంపుతున్నాయని ఏపీ సీఎల్సీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నంబూరి శ్రీమన్నారాయణ ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ కార్పొరేట్ శక్తులకు సహజ వనరులు కట్టబెట్టేందుకు ఈ మారణకాండ కొనసాగిస్తున్నాయని ధ్వజమెత్తారు. రాజ్యహింసను పౌరహక్కుల సంఘం తీవ్రంగా ఖండిస్తుందన్నారు. చత్తీస్ఘడ్, ఒడిశా ప్రాంతాల్లో పౌరులను, ఆదివాసీలను, నక్సల్స్‌ను కాల్చి చంపడం రాజ్యాంగ వ్యతిరేకమన్నారు. నక్సల్స్ సమస్య సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య అని ఈ సమస్య పరిష్కారానికి ఎన్కౌంటర్ల పేరుతో హత్యలు చేయడం సమంజసంకాదన్నారు. ఇదే విషయాన్ని హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా స్పష్టం చేశాయన్నారు. సామాజిక, ఆర్థిక, రాజకీయ సమస్య పరిష్కారానికి తుపాకీతో సమాధానం చెప్పాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఎ¯ŒSకౌంటర్ నిలుపుదల చేసి సహజ వనరుల పరిరక్షణ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. శాంతియుత సమాజం కోసం ఎన్కౌంటర్లు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రూ.1,000, రూ.500 నోట్లు రద్దు వల్ల ఏర్పడిన సమస్యల పరిష్కారానికి కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. నగదు రహిత సమాజం భారతీయ సమాజంలో సాధ్యం కాదని పేర్కొన్నారు. కెన్యా తదితర చిన్నదేశాల్లో ఈ విధానం అమలు చేయడం వల్ల ద్రవ్యోల్భణం పెరిగి ఆయా దేశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయాయని గుర్తుచేశారు. -
'బాబు, కేసీఆర్ నియంతల్లా వ్యవహారిస్తున్నారు'
తిరుపతి: ఏపీ, తెలంగాణలో ఎమర్జెన్సీ పాలన కొనసాగుతోందని పౌర హక్కుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీమన్నారాయణ ఆరోపించారు. ఆ రెండు రాష్ట్రాల సీఎంలు నియంతల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అంతేకాకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని అన్నారు. ఆదివారం తిరుపతి నగరంలో శ్రీమన్నారాయణ విలేకర్లతో మాట్లాడుతూ... తిరుపతిలో గ్రీన్‌హంట్ సదస్సును భగ్నం చేయడం దారణమన్నారు. గృహనిర్బంధం చేసిన పౌరహక్కుల సంఘం నేతలు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతిలో జరగనున్న గ్రీన్‌హంట్ సదస్సుకు హాజరుకావాల్సిన పలువురు ఏపీసీఎల్సీ నేతలను ఈ రోజు అనంతపురంలో గృహ నిర్బంధంలోకి తీసుకున్నారు. వారిలో ఏపీసీఎల్సీ రాష్ట్ర అధ్యక్షుడు శేషయ్య, హరినాథరెడ్డి, విజయకుమార్‌లు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల అడవులను నాశనం చేసేందుకు చేపట్టిన ఆపరేషన్ గ్రీన్‌హంట్‌ను తక్షణం ఆపివేయాలని ఏపీసీఎల్సీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ క్రమంలో గ్రీన్‌హంట్ సదస్సును ఏర్పాటు చేసింది. దీంతో పలువురు నాయకులు అరెస్ట్‌తో ఆ సదస్సు వాయిదా పడింది. -
గడ్చిరోలి ఎన్కౌంటర్ బూటకం: ఏపీసీఎల్సీ
గత వారం గడ్చిరోలిలో జరిగినది బూటకపు ఎన్కౌంటర్ అని ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల కమిటీ మండిపడింది. ఆ సంఘటనలో పాల్గొన్న పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈనెల 18వ తేదీన మావోయిస్టులకు, సి-60 కమాండో దళాలకు కోర్చి తాలూకా బెట్కార్తి గ్రామంలో జరిగిన ఎన్కౌంటర్లో ఏడుగురు మావోయిస్టులు మరణించారు. అనంతరం ఏపీసీఎల్సీ నిజ నిర్ధారణ బృందం అక్కడకు వెళ్లి ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ బృందంతో కలిసి సంఘటనపై విచారణ జరిపింది. ఇది బూటకపు ఎన్కౌంటర్ అని, కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అని ఏపీసీఎల్సీ ప్రధాన కార్యదర్శి సీహెచ్ చంద్రశేఖర్ తెలిపారు. ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టులను పోలీసులు ఓ వాహనంలో తెచ్చారని, అప్పటికే వాళ్లకు విషం ఇచ్చారని, ఆ తర్వాత దగ్గరనుంచి కాల్చి చంపారు తప్ప పోలీసులు కథ అల్లుతున్నట్లుగా అక్కడ ఎన్కౌంటర్ ఏమీ జరగలేదని అన్నారు. సంఘటన స్థలంలో ఎక్కడా బుల్లెట్ల ఆనవాళ్లు లేవని, అలాగే మృతదేహాలకు పంచనామా చేయడం గానీ, స్థానిక మీడియాకు చెప్పడంగానీ జరగలేదని ఆయన ఆరోపించారు. మృతదేహాలను నేరుగా గడ్చిరోలి ప్రభుత్వాస్పత్రికి తెచ్చారన్నారు. ఆ సంఘటనలో పాల్గొన్న పోలీసులపై హత్యకేసు నమోదుచేసి, జ్యుడీషియల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.