న్యూఢిల్లీ: పలు కీలక ప్రభుత్వ విభాగాల్లో సీనియర్ స్థాయి ఉన్నతాధికారుల పోస్టులకు పబ్లిక్, ప్రైవేటు రంగాల్లోని నిపుణులకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దేశ నిర్మాణానికి దోహదం చేసే ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రముఖ దినపత్రికల్లో ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ప్రకారం.. రెవెన్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎకనమిక్ అఫైర్స్, వ్యవసాయం, రైతు సహకారం, సంక్షేమం, రోడ్డు రవాణా, హైవేలు, నౌకాయానం, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు, నూతన, పునరుత్పాదక ఇంధనం, పౌర విమానయానం, వాణిజ్య మంత్రిత్వ శాఖలకు నిపుణులైన పది మంది ప్రతిభావంతులైన వ్యక్తులు కావాలని ప్రభుత్వం ప్రకటించింది.
లేటరల్ రిక్రూట్‌మెంట్ కింద ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారిని మూడేళ్ల కాల పరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో జాయింట్ సెక్రటరీలుగా నియమిస్తామని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ కాంట్రాక్టు గడువును పనితీరు ఆధారంగా ఐదేళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, అలాగే వివిధ పథకాల అమలులో జాయింట్ సెక్రటరీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు వివిధ మంత్రిత్వ శాఖల్లో అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్, వాటి అనుబంధ సర్వీసుల నుంచి వచ్చే సెక్రటరీ, అదనపు సెక్రటరీల కింద పనిచేయాల్సి ఉంటుంది. వేతనం నెలకు రూ.1.44 లక్షల నుంచి 2.18 లక్షలు. దరఖాస్తులకు ఆఖరి తేదీ జూలై 30.
సంఘీలకు స్థానం కల్పించేందుకే
ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగాల్లో ‘సంఘీ’ (ఆరె స్సెస్ వ్యక్తులు)లను కూర్చోబెట్టడానికే ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment