contract method
-
మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏడాది కాలానికి వీరిని కాంట్రాక్టు ప్రాతిపదికన నియమిస్తారు. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రా మగుండం, కామారెడ్డి, వికారాబాద్, జనగాం, కరీంనగర్, ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, సిరిసిల్ల, ఆదిలాబాద్ రిమ్స్, నిజామాబాద్, మహబూబ్‌నగర్, సిద్దిపేట, నల్లగొండ, సూర్యాపేటల్లోని మెడికల్ కాలేజీల్లోని ఖాళీలను ఈ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్లలో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను నియమిస్తారు. నోటిఫికేషన్ నాటికి అభ్యర్థి వయసు 69 ఏళ్ల కంటే తక్కువ ఉండాలి. ఆసక్తి కలిగినవారు వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం 5 గంటలకల్లా అవసరమైన డాక్యుమెంట్లతో dmerecruitment.contract@mail.com కు మెయిల్ ద్వారా దరఖాస్తు చేయాలని రమేశ్‌రెడ్డి కోరారు. అదే నెల 9న కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ప్రొఫెసర్, అసో సియేట్ ప్రొఫెసర్లకు ఆ రోజు ఉదయం 10 గంటలకు, అసిస్టెంట్ ప్రొఫెసర్లకు మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులు అదే నెల 24వ తేదీ నాటికి వారికి కేటాయించిన కాలేజీల్లో చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. లక్షన్నర, అసిస్టెంట్ ప్రొఫెసర్ల వేతనం నెలకు రూ. 1.25 లక్షలుగా ఖరారు చేశారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ ఫ్యాకల్టిలకు రెమ్యునరేషన్‌తోపాటు అదనంగా నెలకు రూ. 50 వేల ప్రోత్సాహకం ఇస్తారు. వీరి ఎంపిక దేశవ్యాప్తంగా వచ్చే అభ్యర్థుల నుంచి ఉంటుంది. స్థానిక అభ్యర్థులు అందుబాటులో లేకుంటే ఇతర రాష్ట్రాల వారిని తీసుకుంటారు. -
బ్యూరొక్రాట్లుగా ప్రైవేట్ నిపుణులు
న్యూఢిల్లీ: పలు కీలక ప్రభుత్వ విభాగాల్లో సీనియర్ స్థాయి ఉన్నతాధికారుల పోస్టులకు పబ్లిక్, ప్రైవేటు రంగాల్లోని నిపుణులకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. దేశ నిర్మాణానికి దోహదం చేసే ప్రతిభావంతులైన, నైపుణ్యం కలిగిన వారి నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రముఖ దినపత్రికల్లో ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన ప్రకారం.. రెవెన్యూ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎకనమిక్ అఫైర్స్, వ్యవసాయం, రైతు సహకారం, సంక్షేమం, రోడ్డు రవాణా, హైవేలు, నౌకాయానం, పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పులు, నూతన, పునరుత్పాదక ఇంధనం, పౌర విమానయానం, వాణిజ్య మంత్రిత్వ శాఖలకు నిపుణులైన పది మంది ప్రతిభావంతులైన వ్యక్తులు కావాలని ప్రభుత్వం ప్రకటించింది. లేటరల్ రిక్రూట్మెంట్ కింద ప్రభుత్వం చేపట్టిన ఈ నియామక ప్రక్రియలో ఎంపికైన వారిని మూడేళ్ల కాల పరిమితితో కాంట్రాక్టు పద్ధతిలో జాయింట్ సెక్రటరీలుగా నియమిస్తామని సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సర్క్యులర్‌లో పేర్కొంది. ఈ కాంట్రాక్టు గడువును పనితీరు ఆధారంగా ఐదేళ్ల వరకూ పొడిగించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ విధానాల రూపకల్పన, అలాగే వివిధ పథకాల అమలులో జాయింట్ సెక్రటరీలు కీలక పాత్ర పోషిస్తున్నారు. వీరు వివిధ మంత్రిత్వ శాఖల్లో అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, వాటి అనుబంధ సర్వీసుల నుంచి వచ్చే సెక్రటరీ, అదనపు సెక్రటరీల కింద పనిచేయాల్సి ఉంటుంది. వేతనం నెలకు రూ.1.44 లక్షల నుంచి 2.18 లక్షలు. దరఖాస్తులకు ఆఖరి తేదీ జూలై 30. సంఘీలకు స్థానం కల్పించేందుకే ఉన్నత స్థాయి ప్రభుత్వోద్యోగాల్లో ‘సంఘీ’ (ఆరె స్సెస్ వ్యక్తులు)లను కూర్చోబెట్టడానికే ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. -
1,330 వైద్య ఉద్యోగాల భర్తీకి పచ్చజెండా
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) కింద రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్బీఎస్కే)లో భాగంగా జిల్లాల్లో వైద్య ఉద్యోగ ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేయాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా శనివారం ఉత్తర్వులు జారీచేశారు. మొత్తం 1,330 పోస్టులను భర్తీ చేస్తారు. ఇందులో 630 ఎంబీబీఎస్, ఆయుష్ డాక్టర్ పోస్టులున్నాయి. 300 ఏఎన్ఎం, 300 ఫార్మసిస్టులు సహా మరో 100 పోస్టుల్లో ఫిజియోథెరఫిస్టులు, స్టాఫ్ నర్సులు, సైకాలజిస్టులు తదితర ఉద్యోగాలున్నాయి. ఈ పోస్టులన్నింటినీ జిల్లా ఎంపిక కమిటీ (డీఎస్సీ)ల ద్వారా ప్రతిభ ఆధారంగా భర్తీ చేస్తారు. వచ్చే వారంలో జిల్లాల్లో నోటిఫికేషన్ జారీచేసి నెల రోజుల్లోపు భర్తీ ప్రక్రియను పూర్తిచేస్తారు. మొబైల్ హెల్త్ టీముల కోసం... 0 నుంచి 16 ఏళ్ల వయసు పిల్లల్లో 30 రకాల వ్యాధులను గుర్తించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తుంది. అన్ని జిల్లాల్లో 150 కమ్యూనిటీ హెల్త్, న్యూట్రిషన్ క్లస్టర్ల (సీహెచ్ఎన్సీ)ను ఏర్పాటు చేస్తుంది. ఒక్కో క్లస్టర్ కింద రెండు మొబైల్ హెల్త్ టీమ్ లు ఉంటాయి. ఆ ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 300 మొబైల్ హెల్త్ టీంలు సేవలు అందిస్తాయి. ఒక్కో టీమ్‌లో ఒక మహిళా డాక్టర్, ఒక పురుష డాక్టర్, ఒక ఏఎన్ఎం, ఒక ఫార్మసిస్టు ఉంటారు. మొత్తంగా ఈ మొబైల్ టీమ్‌ల కోసమే 1,200 మందిని నియమిస్తారు. పిల్లలకు వైద్యం చేయడానికి జిల్లాకొక డిస్ట్రిక్ట్ ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్ (డీఈఐసీ)ను ఏర్పాటు చేస్తారు. ఆయా కేంద్రాల్లో ఒక పిల్లల వైద్య నిపుణుడు, ఎంబీబీఎస్ మెడికల్ ఆఫీసర్, ఒక డెంటల్ మెడికల్ ఆఫీసర్ ఉంటారు. ఆ ప్రకారం 10 జిల్లాల్లో 30 మంది వైద్యులను డీఈఐసీ కేంద్రాల్లో నియమిస్తారు. వీటితోపాటు డీఈఐసీల్లో ఒక స్టాఫ్ నర్సు, ఒక ఫిజియోథెరఫిస్టు, ఆడియాలజిస్టు అండ్ స్పీచ్ థెరపిస్టు, సైకాలజిస్టు, ఆప్తమెట్రిస్ట్, స్పెషల్ ఎడ్యుకేటర్, స్పెషల్ వర్కర్, ల్యాబ్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్, డీఈఐసీ మేనేజర్ పోస్టులున్నాయి. అన్ని జిల్లాల్లోని కేంద్రాల్లో కలిపి 130 మందిని నియమిస్తారు. -
మూడు నెలలుగా అందని వేతనాలు
ఇబ్బందుల్లో ఐసీటీసీ ఉద్యోగులు, సిబ్బంది చెన్నూర్ : సమీకత సమగ్ర హైచ్ఐవీ పరీక్ష కేంద్రం (ఐసీటీసీ), ఎయిడ్స్ వ్యాధి నిరోధక కేంద్రం (ఏఆర్టీ) సెం టర్లలో పని చేస్తున్న ఉద్యోగులు, సిబ్బందికి గత మూడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు. రాష్ట్రాలు విడిపోయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్‌ను విభజించక పోవడంతో రెండు రాష్ట్రాల ఉద్యోగుల వేతనాల విడుదలలో జాప్యం జరుగుతోంది. తెలంగాణలోని 10 జిల్లాలోని ఐసీటీసీ, ఏఆర్టీ కేంద్రాల్లో కాంట్రాక్ట్ పద్ధతి పై సుమారు 1000 మందికి పైగా కౌన్సిలర్స్, ల్యాబ్ టెక్నిషియన్లు, ఏఆర్టీ సిబ్బంది పని చేస్తున్నారు. మూడు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విభజన జరగక పోవడమే.. రాష్ట్రలు విడిపోయినా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (ఏపీ శ్యాక్స్), తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ (టీఎస్ శ్యాక్స్) విడిపోలేదు. దీంతో జాతీయ స్టేట్ ఎయిడ్స్ నియంత్రణ మండలి (న్యాకో) ఢీల్లీ నుంచి వేతనాలు ఏపీ శ్యాక్స్ ఖాతాలో వేస్తున్నారని దీంతో వేతనాలు సకాలంలో రావడంలేదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లోని ఏపీ శ్యాక్స్, టీఎస్ శ్యాక్స్లను విభజించకపోతే ఈ సమస్య తీవ్రమవుతుంది తప్పా ఎలాంటి ప్రయోజనం ఉండదని ఉద్యోగులు పేర్కొంటున్నారు. రాష్ట్రాలు వేరుపడ్డాక అన్ని శాఖలు వేరైన నేటికి ఐసీటీసీ, ఏఆర్టీ సెంటర్లను వేరు చేయకపోవడం పట్ల రెండు ప్రాంతాల ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకొని ఉద్యోగులకు న్యాయం చేయాలని సిబ్బంది కోరుతున్నారు. -
మున్సిపాలిటీల్లో నిలిచిపోనున్న మీసేవ
నిర్వహణలోపం.. సేవలకు శాపం 27 నుంచి మూతపడనున్న కేంద్రాలు నిర్వాహకులకు కమీషన్లు చెల్లించకపోవడమే ప్రధాన కారణం కోదాడఅర్బన్: జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ఈ నెల 27 నుంచి మీసేవలు నిలిచిపోనున్నాయి. మీసేవ, ఈ సేవ కేంద్రాలను హెచ్‌సీఎల్ కంపెనీ కాంట్రాక్టు పద్ధతిలో నిర్వహిస్తోంది. ఈ కంపెనీ కమీషన్ చెల్లించకపోవడంతో కేంద్రాలను మూసివేయాలని ఈ మేరకు ఫ్రాంచైజీ నిర్వాహకులు నిర్ణయించారు. అంతేకాక కంపెనీ నిర్వహిస్తు న్న కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి కూడా వేతనాలు చెల్లించకపోవడంతో వారు కూడా సేవలను నిలిపివేసేందుకు సిద్ధమవుతున్నారు. అందని వేతనాలు జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో ప్రభు త్వ సర్వీసులను అందించేందుకు గాను హెచ్‌సీఎల్ కంపెనీ 53 మీసేవ కేంద్రాల ను ఫ్రాంచైజీల ద్వారా ఏర్పాటు చేసింది. వీటికి తోడు నల్లగొండ, సూర్యాపేట, భువనగిరి, మిర్యాలగూడలలో హెచ్‌సీఎల్ కంపెనీ సొంతంగా కేంద్రాలను ఏర్పాటుచేసి ప్రభుత్వ సర్వీసులను అందజేస్తోం ది. మీసేవ కేంద్రాలలోనే గతంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈసేవ సర్వీసులు కూ డా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. ఈ కేంద్రాల నిర్వహణకు గాను హెచ్సీఎ ల్ కంపెనీ ఫ్రాంచైజీ నిర్వాహకులకు వా రు అందించే సేవలను బట్టి కమీషన్ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే తమ సొం త కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బందికి కూ డా హెచ్‌సీఎల్ కంపెనీ వేతనాలు చెల్లిం చాల్సి ఉంటుంది. కేంద్రాలు ప్రారంభిం చిన నాటి నుంచి ఫ్రాంచైజీలకు అంతంత మాత్రంగానే కమీషన్లు చెల్లించింది. ఇక ఎనిమిది నెలలుగా మాత్రం అసలు కమీషన్లు చెల్లించడాన్ని పూర్తిగా నిలిపివేసింది. మరోవైపు తమ కంపెనీ కేంద్రాలలో పని చేస్తున్న సిబ్బందికి కూడా నాలుగు నెల లుగా వేతనాలు చెల్లించడం లేదు. దీంతో వారు కేంద్రాలను నిర్వహించలేక నానా అవస్థలు పడుతున్నారు. ఆర్టీఏ సేవలపై ప్రభావం మున్సిపాలిటీలలో మీ సేవ కేంద్రాలు బంద్ పాటిస్తే దాని ప్రభావం ఆర్టీఏ సేవలపై ఎక్కువగా పడనుంది. ఆర్టీఏ సేవలను హెచ్‌సీఎల్ కంపెనీ పరిధిలోని కేంద్రాల్లో మాత్రమే లభించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వాహనాల ట్యాక్స్‌లను మూడు నెలలకోసారి చెల్లించే పద్ధతి ప్రస్తుతం అమల్లో ఉంది. దాని ప్రకారం ఈనెల 31వ తేదీలోపు మూడునెలల ట్యాక్స్‌ను వాహనదారులు చెల్సించాల్సి ఉంటుంది. గడువు దాటిన తర్వాత చెల్లించే పన్నులపై అధికంగా జరిమానా ఉంటుంది. ఈనెల 27 నుంచి మీసేవ, ఈ సేవ కేంద్రాలు బంద్ పాటిస్తే ట్యాక్స్ చెల్లించే వీలులేక వాహనదారులు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదముంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు. నిరవధిక బంద్‌కు నిర్ణయం హెచ్‌సీఎల్ కంపెనీ నుంచి కమీషన్లు సక్రమంగా రాకపోవడంతో ఫ్రాంచైజీల నిర్వాహకులు పలుమార్లు జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఈ నేపథ్యంలో ఇటీవల నల్లగొండలో సమావేశమైన మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఈ నెల 27వ తేదీ నుంచి హెచ్‌సీఎల్ కంపెనీ కింద జిల్లాలో ఉన్న అన్ని ఫ్రాంఛైజీలను నిరవధికంగా బంద్ చేసేందుకు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న కంపెనీ కేంద్రాలలో పనిచేస్తున్న సిబ్బంది కూడా వారితో పాటు బంద్‌లో పాల్గొనేందుకు నిర్ణయించారు. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో మీసేవ కేంద్రాలు మూతపడనున్నాయి. -
‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదం
- రాజీవ్ విద్యామిషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల పునరుద్ధరణపై ప్రభుత్వం తాత్సారం - ఆందోళనలో 425 మంది ఉద్యోగులు ఏలూరు సిటీ : ‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సంగతి అటు ఉంచితే ఉన్న ఉద్యోగులను తొలగిస్తోంది. వివిధ శాఖల్లో ఏళ్ల తరబ డి పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ వారి కుటుంబాలను రోడ్డుపైకి నెడుతోంది. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్‌లో భాగంగా 425 మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. పాఠశాలల క్లస్టర్ల పరిధిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లుగా 243 మంది, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్లు 46, మానసిక, శారీరక వికలాంగుల శిక్షణకు సంబంధించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్(ఐఈఆర్టీఎస్) 36 మంది, డివిజన్ లిమిట్ మానిటరింగ్ టీమ్స్(డీఎల్ఐఎంటీఎస్)లో 10 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 44 మంది, మండల విద్యాధికారుల కార్యాలయాల్లో వికలాంగులకు ఉపాధి కల్పిస్తూ మెసెంజర్లుగా 46 మందిని గతంలో నియమించారు. వీరిని పరీక్షలు, ఇంటర్య్వూల ఆధారంగా గతంలో ఉన్నతాధికారులు నియమించారు. సర్వీస్ పునరుద్ధరణైపై తాత్సారం కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును ఏటా ప్రభుత్వం పునరుద్ధరిస్తూ వస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో సర్వీస్ పునరుద్ధరణకు ఉద్యోగుల పనితనాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. అయినా ఆర్వీఎంలో ఇంతవరకు ఏ ఉద్యోగి సర్వీస్‌ను పునరుద్ధరించలేదు. ప్రభుత్వం కావాలనే ఉద్యోగుల సర్వీస్‌ను పునరుద్ధరించకుండా తాత్సారం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని శాఖలకు చెందిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిం చడంతో తమను కూడా తొలగిస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. మండల విద్యాధికారుల కార్యాలయాల్లో పనిచేస్తున్న వికలాంగులైన మెసెంజర్లను విధుల నుంచి తొలగించటంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగాలు లేకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, అధికారులు సత్వరమే పునరుద్ధరించాలని కాంట్రాక్టు ఉద్యోగులు కోరుతున్నారు.