- రాజీవ్ విద్యామిషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల పునరుద్ధరణపై ప్రభుత్వం తాత్సారం
- ఆందోళనలో 425 మంది ఉద్యోగులు
ఏలూరు సిటీ : ‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సంగతి అటు ఉంచితే ఉన్న ఉద్యోగులను తొలగిస్తోంది. వివిధ శాఖల్లో ఏళ్ల తరబ డి పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ వారి కుటుంబాలను రోడ్డుపైకి నెడుతోంది. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్‌లో భాగంగా 425 మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు.
పాఠశాలల క్లస్టర్ల పరిధిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లుగా 243 మంది, మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్లు 46, మానసిక, శారీరక వికలాంగుల శిక్షణకు సంబంధించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్(ఐఈఆర్‌టీఎస్) 36 మంది, డివిజన్ లిమిట్ మానిటరింగ్ టీమ్స్(డీఎల్‌ఐఎంటీఎస్)లో 10 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 44 మంది, మండల విద్యాధికారుల కార్యాలయాల్లో వికలాంగులకు ఉపాధి కల్పిస్తూ మెసెంజర్లుగా 46 మందిని గతంలో నియమించారు. వీరిని పరీక్షలు, ఇంటర్య్వూల ఆధారంగా గతంలో ఉన్నతాధికారులు నియమించారు.
సర్వీస్ పునరుద్ధరణైపై తాత్సారం
కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును ఏటా ప్రభుత్వం పునరుద్ధరిస్తూ వస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో సర్వీస్ పునరుద్ధరణకు ఉద్యోగుల పనితనాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. అయినా ఆర్‌వీఎంలో ఇంతవరకు ఏ ఉద్యోగి సర్వీస్‌ను పునరుద్ధరించలేదు. ప్రభుత్వం కావాలనే ఉద్యోగుల సర్వీస్‌ను పునరుద్ధరించకుండా తాత్సారం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే కొన్ని శాఖలకు చెందిన కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను తొలగిం చడంతో తమను కూడా తొలగిస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. మండల విద్యాధికారుల కార్యాలయాల్లో పనిచేస్తున్న వికలాంగులైన మెసెంజర్లను విధుల నుంచి తొలగించటంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగాలు లేకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, అధికారులు సత్వరమే పునరుద్ధరించాలని కాంట్రాక్టు ఉద్యోగులు కోరుతున్నారు.
‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదం
Published Sat, Jul 12 2014 1:29 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM
Advertisement
Advertisement