కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణపై తేల్చిచెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధమని, ఇకపై రెగ్యులరైజ్ చేయడం చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్‌మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం 1994లోని సెక్షన్ 10ఏ చెల్లదని.. చట్టవిరుద్ధమైన ఈ సెక్షన్‌ను రద్దు చేస్తున్నామని తేల్చిచెప్పింది.
ఏళ్లుగా పని చేస్తున్న, ఇప్పటికే క్రమబద్ధీకరించిన కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చట్ట ప్రకారం జరగాలని, క్రమబద్ధీకరణ కుదరదని చెప్పింది. నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పాక్షికంగా అనుమతించినట్లు పేర్కొంది.
జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా వీరిని క్రమబద్ధీకరించారని, సెక్షన్ 10ఏను చేరుస్తూ తెచ్చిన జీవో 16 చట్టవిరుద్ధమంటూ పీజీ, పీహెచ్‌డీ పూర్తి చేసిన.. సెట్‌కు క్వాలిఫై అయిన పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దాదాపు 5,544 మంది ఉద్యోగులకు ఊరట లభించింది.
పిటిషనర్ల వాదన..
‘జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులను 1993, డిసెంబర్ 30న జీవో 302తో ప్రవేశపెట్టిన సర్వీస్ రూల్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనల్లోని రూల్ 3.. జూనియర్ లెక్చరర్ల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి లేదా పదోన్నతితో భర్తీ చేయాలని చెబుతోంది. డిగ్రీ లెక్చరర్లకూ ఇలాంటి నిబంధనే వర్తిస్తుంది. మేమంతా జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులకు నిబంధనల మేరకు అర్హులం.
జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులను కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేలా ఆంధ్రప్రదేశ్ కాలేజ్ సర్వీస్ కమిషన్ చట్టం 1985ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ చట్టం 2001లో రద్దయింది. ఆ తర్వాత నుంచి పారదర్శక విధానం లేకుండా కాంట్రాక్టు విధానంలో ఎంపిక కమిటీ పోస్టులను భర్తీ చేయడం ప్రారంభించింది. 2002 తర్వాత నుంచి నేరుగా ఈ పోస్టులను భర్తీ చేయలేదు. ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ కోసం 2016, ఫిబ్రవరి 26న ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సెక్షన్ 10ఏను చేరుస్తూ ప్రభుత్వం జీవో16ను తెచ్చింది. దీంతో అర్హతలు లేని వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు’ అని పిటిషనర్లు వాదించారు.
విద్యాశాఖ వాదన..
‘పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 మేరకు.. నిర్ణీత వ్యవధిలో ఇప్పటికే ఉన్న చట్టాన్ని సవరణ చేసే, రద్దు చేసే వీలు సర్కార్‌కు ఉంది. 2014, జూన్ 2కు ముందున్న వారినే క్రమబద్దీకరణ, రిజర్వేషన్లు కూడా వర్తింపు.. ఇలా సెక్షన్ 10ఏలో ఆరు నిబంధనలు చేర్చి ఆ మేరకే క్రమబద్దీకరించాం. భవిష్యత్తులో మరిన్ని పోస్టులను భర్తీ చేయనున్నందున నిరుద్యోగ యువత అవకాశాలను జీవో 16 నిర్వీర్యం చేస్తుందన్న పిటిషనర్ల ఆందోళన సరికాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా క్రమబద్దీకరణ జరిగిందనడం అర్థరహితం. జీవో 16 మేరకున్న పోస్టులను 2023, ఏప్రిల్ 30న జీవో 38 ద్వారా క్రమబద్దీకరించాం’ అని విద్యాశాఖ పేర్కొంది. 5,544 మందిని క్రమబద్దీకరిస్తే కొందరినే ప్రతివాదులుగా పేర్కొనడంపై అనధికారిక ప్రతివాదుల (క్రమబద్దీకరించిన వారు) తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని రిట్ పిటిషన్లను కొట్టివేయాలన్నారు.
ధర్మాసనం ఏమందంటే..
‘విద్యాసేవా నిబంధనలు చట్టబద్ధంగా ఉన్నందున వాటిని రద్దు చేయడం, సవరించడం ఒక్కపూటలో సాధ్యం కాదు. చట్టబద్ధమైన నియమాల అమలులో సెక్షన్ 10ఏ ప్రభావం ఉండకూడదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం ఇప్పటికే ఉన్న ఏదైనా చట్టాన్ని సవరించడానికి, రద్దు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అయితే సెక్షన్ 10ఏను చొప్పించడం పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101కు విరుద్ధం.
అందువల్ల 10ఏను కొట్టివేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉమాదేవి కేసులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై ఇరుపక్షాలు ఆధారపడ్డాయి. తీర్పును జాగ్రత్తగా చదివితే కాంట్రాక్టు ఉద్యోగులతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను 2009లో నియమించి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేశారు. ఇలా 15 ఏళ్లకు పైగా ఉద్యోగాల్లో ఉన్నారు.
అటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ఆదేశించాలా లేక ప్రస్తుత పిటిషనర్లకు పోస్టులను ప్రకటించాలని సర్కార్‌ను ఆదేశించాలా అనేది మా ముందున్న ప్రశ్న. అయితే అన్ని పిటిషన్లలో క్రమబద్ధీకరించిన వారిని తొలగించాలని కోరలేదు. పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏళ్ల కింద నియమితులైన వారి అంశంలో జోక్యం కూడదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. అందుకే క్రమబద్దీకరణ అంశంలో జోక్యం చేసుకోవడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయనే కారణంతో గత నిర్ణయాలను రద్దు చేయడం లేదు’ అని ధర్మాసనం పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment