Regularization of contract employees
-
తొలగింపు కుదరదు.. ఇకపై వద్దు
సాక్షి, హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ రాజ్యాంగ విరుద్ధమని, ఇకపై రెగ్యులరైజ్ చేయడం చెల్లదని హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. తెలంగాణ (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీసెస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ ప్యాటర్న్ అండ్ పే స్ట్రక్చర్) చట్టం 1994లోని సెక్షన్ 10ఏ చెల్లదని.. చట్టవిరుద్ధమైన ఈ సెక్షన్‌ను రద్దు చేస్తున్నామని తేల్చిచెప్పింది. ఏళ్లుగా పని చేస్తున్న, ఇప్పటికే క్రమబద్ధీకరించిన కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చట్ట ప్రకారం జరగాలని, క్రమబద్ధీకరణ కుదరదని చెప్పింది. నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలని స్పష్టం చేసింది. క్రమబద్ధీకరణను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పాక్షికంగా అనుమతించినట్లు పేర్కొంది. జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కళాశాలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్లను గతంలో ప్రభుత్వం క్రమబద్ధీకరించింది. నిబంధనలకు విరుద్ధంగా వీరిని క్రమబద్ధీకరించారని, సెక్షన్ 10ఏను చేరుస్తూ తెచ్చిన జీవో 16 చట్టవిరుద్ధమంటూ పీజీ, పీహెచ్డీ పూర్తి చేసిన.. సెట్‌కు క్వాలిఫై అయిన పలువురు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన జస్టిస్ సుజోయ్‌పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వర్‌రావు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. ఈ తీర్పుతో దాదాపు 5,544 మంది ఉద్యోగులకు ఊరట లభించింది. పిటిషనర్ల వాదన.. ‘జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులను 1993, డిసెంబర్ 30న జీవో 302తో ప్రవేశపెట్టిన సర్వీస్ రూల్స్ ద్వారా భర్తీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ సర్వీస్ నిబంధనల్లోని రూల్ 3.. జూనియర్ లెక్చరర్ల పోస్టులను నోటిఫికేషన్ ఇచ్చి లేదా పదోన్నతితో భర్తీ చేయాలని చెబుతోంది. డిగ్రీ లెక్చరర్లకూ ఇలాంటి నిబంధనే వర్తిస్తుంది. మేమంతా జూనియర్, డిగ్రీ లెక్చరర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ల పోస్టులకు నిబంధనల మేరకు అర్హులం. జూనియర్, డిగ్రీ లెక్చరర్ల పోస్టులను కాలేజ్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసేలా ఆంధ్రప్రదేశ్ కాలేజ్ సర్వీస్ కమిషన్ చట్టం 1985ను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అయితే, ఈ చట్టం 2001లో రద్దయింది. ఆ తర్వాత నుంచి పారదర్శక విధానం లేకుండా కాంట్రాక్టు విధానంలో ఎంపిక కమిటీ పోస్టులను భర్తీ చేయడం ప్రారంభించింది. 2002 తర్వాత నుంచి నేరుగా ఈ పోస్టులను భర్తీ చేయలేదు. ఈ క్రమంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ కోసం 2016, ఫిబ్రవరి 26న ప్రభుత్వం చట్టవిరుద్ధంగా సెక్షన్ 10ఏను చేరుస్తూ ప్రభుత్వం జీవో16ను తెచ్చింది. దీంతో అర్హతలు లేని వారు ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు’ అని పిటిషనర్లు వాదించారు. విద్యాశాఖ వాదన.. ‘పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 మేరకు.. నిర్ణీత వ్యవధిలో ఇప్పటికే ఉన్న చట్టాన్ని సవరణ చేసే, రద్దు చేసే వీలు సర్కార్‌కు ఉంది. 2014, జూన్ 2కు ముందున్న వారినే క్రమబద్దీకరణ, రిజర్వేషన్లు కూడా వర్తింపు.. ఇలా సెక్షన్ 10ఏలో ఆరు నిబంధనలు చేర్చి ఆ మేరకే క్రమబద్దీకరించాం. భవిష్యత్తులో మరిన్ని పోస్టులను భర్తీ చేయనున్నందున నిరుద్యోగ యువత అవకాశాలను జీవో 16 నిర్వీర్యం చేస్తుందన్న పిటిషనర్ల ఆందోళన సరికాదు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా క్రమబద్దీకరణ జరిగిందనడం అర్థరహితం. జీవో 16 మేరకున్న పోస్టులను 2023, ఏప్రిల్ 30న జీవో 38 ద్వారా క్రమబద్దీకరించాం’ అని విద్యాశాఖ పేర్కొంది. 5,544 మందిని క్రమబద్దీకరిస్తే కొందరినే ప్రతివాదులుగా పేర్కొనడంపై అనధికారిక ప్రతివాదుల (క్రమబద్దీకరించిన వారు) తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీన్ని పరిగణనలోకి తీసుకుని రిట్ పిటిషన్లను కొట్టివేయాలన్నారు. ధర్మాసనం ఏమందంటే.. ‘విద్యాసేవా నిబంధనలు చట్టబద్ధంగా ఉన్నందున వాటిని రద్దు చేయడం, సవరించడం ఒక్కపూటలో సాధ్యం కాదు. చట్టబద్ధమైన నియమాల అమలులో సెక్షన్ 10ఏ ప్రభావం ఉండకూడదు. పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101 ప్రకారం ఇప్పటికే ఉన్న ఏదైనా చట్టాన్ని సవరించడానికి, రద్దు చేయడానికి ప్రభుత్వానికి అధికారం ఉంటుంది. అయితే సెక్షన్ 10ఏను చొప్పించడం పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 101కు విరుద్ధం. అందువల్ల 10ఏను కొట్టివేయడంలో మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. ఉమాదేవి కేసులో రాజ్యాంగ ధర్మాసనం తీర్పుపై ఇరుపక్షాలు ఆధారపడ్డాయి. తీర్పును జాగ్రత్తగా చదివితే కాంట్రాక్టు ఉద్యోగులతో ఎలాంటి సంబంధం లేదని తేలింది. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను 2009లో నియమించి ఆ తర్వాత రెగ్యులరైజ్ చేశారు. ఇలా 15 ఏళ్లకు పైగా ఉద్యోగాల్లో ఉన్నారు. అటువంటి కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించాలని ఆదేశించాలా లేక ప్రస్తుత పిటిషనర్లకు పోస్టులను ప్రకటించాలని సర్కార్‌ను ఆదేశించాలా అనేది మా ముందున్న ప్రశ్న. అయితే అన్ని పిటిషన్లలో క్రమబద్ధీకరించిన వారిని తొలగించాలని కోరలేదు. పోస్టులు భర్తీ చేసేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏళ్ల కింద నియమితులైన వారి అంశంలో జోక్యం కూడదని సుప్రీంకోర్టు గతంలో పేర్కొంది. అందుకే క్రమబద్దీకరణ అంశంలో జోక్యం చేసుకోవడం లేదు. కాంట్రాక్టు ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతాయనే కారణంతో గత నిర్ణయాలను రద్దు చేయడం లేదు’ అని ధర్మాసనం పేర్కొంది. -
కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ సర్కార్ దసరా కానుక
సాక్షి, విజయవాడ: కాంట్రాక్టు ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుకు గెజిట్‌ను గవర్నర్ జారీ చేశారు. (ఇది కూడా చదవండి: నిరుద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్‌న్యూస్) కాంట్రాక్టు ఉద్యోగుల చిరకాల వాంఛను సీఎం జగన్ నెరవేర్చారు. వివిధ శాఖల్లో సుమారు 10,117 మంది ఫుల్‌టైం కాంట్రాక్టు ఉద్యోగులు రెగ్యులరైజ్ అయ్యారు. వీలైనంత ఎక్కువ మందికి మేలు చేసేలా 2–6–2014కు ముందు ఐదేళ్లు సర్వీసు ఉండాలనే నిబంధనలను సీఎం జగన్ సడలించిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్ చేస్తున్నందుకు సీఎంకు ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. -
గురుకుల ఉపాధ్యాయులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
హైదరాబాద్: ఉపాధ్యాయ దినోత్సవం కానుకగా తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల్లో గత 16 సంవత్సరాలుగా పని చేస్తున్న 567 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులను క్రమబద్దీకరీస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి కెసిఆర్ ఇటీవల ప్రకటించినట్టుగానే గురుకుల ఉపాధ్యాయులను క్రమబద్దీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నెంబర్ 11ను జారీ చేసింది. సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యాయులకు 12 నెలల జీతం, బేసిక్ పేతో పాటు ఆరు నెలల ప్రసూతి సెలవులను కూడా ప్రకటించింది ప్రభుత్వం. సాంఘిక గురుకుల ఉపాధ్యాయులను రెగ్యులరైజ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం పట్ల కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షురాలు శెట్టి రజని, ప్రధాన కార్యదర్శి సిరిమళ్ల జానకమ్మ, కోశాధికారి విక్టోరియా, స్వప్నారెడ్డి, సునీత, కిరణ్మయి, చంద్రశేఖర్ ప్రసూన, గాయత్రిలు మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను కలిసి కృతఙ్ఞతలు తెలిపారు. ఇది కూడా చదవండి: పొలిటికల్ గేమ్.. కాంగ్రెస్ నేతతో ఎమ్మెల్యే రాజయ్య భేటీ! -
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ
సాక్షి, అమరావతి: కాంట్రాక్టు ఉద్యోగులకు స్వాతంత్య్ర దినోత్సవ వేళ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభవార్త అందించారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమ బద్ధీకరణకు సంబంధించి ఐదేళ్ల సర్వీసు నిబంధనను ఎత్తివేస్తూ తాజాగా కీలక నిర్ణయం తీసుకు న్నారు. ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన మాట ప్రకా రం కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తూ గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇందుకు 2014 జూన్ 2వ తేదీ నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న కాంట్రాక్టు ఉద్యోగులనే రెగ్యులరైజేషన్ చేసేలా నిబంధన విధించారు. తాజాగా సీఎం జగన్ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ సంబంధిత ఫైలుకు మంగళవా రం ఆమోద ముద్ర వేశారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేయాలనే ఉద్దేశంతో ఏ సంఘం డిమాండ్ చేయకుండానే స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఐదేళ్ల నిబంధనను తొలగిస్తూ నిర్ణయం తీసు కున్నారు. ఈ నిర్ణయంతో 2014 జూన్ 2వ తేదీకి ముందు నియమితులై ఇప్పటి వరకు కొన సా గుతున్న కాంట్రాక్టు ఉద్యోగులందరి సర్వీసును రెగ్యులరైజ్ చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఉత్తర్వులు త్వరలో వెలువడనున్నాయి. వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేస్తా నని గత ఎన్నికల ముందు సీఎం జగన్ హామీ ఇచ్చి న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల కాంట్రాక్టు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల కుటుంబాలకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ధన్యవాదాలు తెలియ చేస్తున్నారు. నాడు బాబు సర్కారు నమ్మక ద్రోహం.. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయబోమని, సుప్రీం కోర్టు తీర్పు అందుకు అనుమతించదని గ తంలో చంద్రబాబు ప్రభుత్వం సాకులు చెప్పింది. ఎ న్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చకుండా సుప్రీం కోర్టు తీర్పు పేరుతో కాంట్రాక్టు ఉద్యోగులను మో సం చేసింది. కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యు లరైజేషన్పై ముగ్గురు మంత్రుల బృందాన్ని నియ మిస్తూ 2014 సెప్టెంబర్ 9న చంద్రబాబు సర్కారు జీవో 3080 జారీ చేసింది. ఐదేళ్ల పాటు సమావేశాలతో సాగదీసిన మంత్రుల బృందం చివ రికి కోర్టు తీర్పును బూచిగా చూపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ సాధ్యం కాదంది. నేడు మాట నిలబెట్టుకున్న సీఎం జగన్ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేర కు న్యాయపరమైన, చట్టపరమైన చిక్కులను అధిగ మించి కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజ్‌కు సిద్ధ మైంది. ప్రభ్వుత్వ శాఖల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులను అర్హత, సర్వీసును పరిగణలోకి తీసుకుని వీ లైనంత ఎక్కువ మందిని రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫేస్టోలో హామీ ఇచ్చారు. ఆ ప్రకారం రెగ్యులరైజేషన్‌పై ప్రభుత్వం సుదీర్ఘ కసరత్తు చేసింది. మంత్రుల కమిటీతో పాటు సీఎస్ అధ్యక్షతన వర్కింగ్ క మిటీని నియమించింది. ఈ కమిటీలు న్యాయ పరమైన, చట్టపరమైన చిక్కులపై చర్చించాయి. రెగ్యులరైజేషన్‌పై నిషేధం విధిస్తూ 1994లో చేసిన చట్టంలో సవరణలు చేయాలని కమిటీలు సూచించాయి. ప్రభుత్వ ఉద్యోగాలను పొందేందుకు కాంట్రాక్ట్ ఉద్యోగాలు దొడ్డి దారి కాకూడదని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. కాంట్రాక్టు ఉద్యోగు ల క్రమబద్ధీకరణకు చిక్కులు ఎదురుకాకుండా న్యా యపరంగా అన్ని అంశాలను ప్రభుత్వం పరిగణ లోకి తీసుకుంది. నాడు బాబు సర్కారు కోర్టు తీ ర్పును బూచిగా చూపిస్తూ కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయకుండా మోసగించగా సీఎం జగన్ ప్రభుత్వం కోర్టు ఆదేశాలను పరిగణలోకి తీసుకుంటూనే క్రమబద్ధీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం హర్షం కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసు రెగ్యులరైజేషన్ విషయంలో తొలుత విధించిన ఐదేళ్లు సర్వీసు నిబంధనను తొలగిస్తూ ముఖ్యమంత్రి జగన్ నిర్ణయం తీసుకోవడంపై రాష్ట్ర పాలిటెక్నిక్ ఆల్ కాంట్రాక్టు లెక్చరర్ల అసోసియేషన్ అధ్యక్షుడు గోవర్ధన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. సీఎం జగన్ తీసుకున్న నిర్ణయంతో ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు జరుగుతుందన్నారు. మాట నిలబెట్టుకున్న సీఎం జగన్‌కు కృతజ్ఞతలు వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను నిలబెటు్టకున్న ముఖ్యమంత్రి జగన్‌కు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్, కాంట్రాక్ట్ ఉద్యోగుల తరపున హృదయ పూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి తెలిపారు. వేల మందికి మేలు ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో వేలాది మంది కాంట్రాక్టు ఉద్యోగులకు మేలు చేకూరుతోందని ఎమ్మెల్సీ తమటం కల్పలత పేర్కొన్నారు. వీలైనంత ఎక్కువ మందిని రెగ్యులర్ చేస్తామని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం జగన్‌కు కాంట్రాక్టు ఉద్యోగులందరూ రుణపడి ఉంటారన్నారు. మనసున్న ముఖ్యమంత్రి వీలైనంత ఎక్కువ మంది కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించేలా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు. సీఎం వైఎస్ జగన్ మనసున్న ముఖ్యమంత్రిగా మరోసారి నిరూపించుకున్నారు. కాంట్రాక్టు ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటారు. – కె.మురళిరెడ్డి, యూనివర్సిటీస్ వైఎస్సార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు చిరస్మరణీయమైన రోజు కాంట్రాక్టు ఉద్యోగులకు ఇది జీవితంలో మరిచిపోలేని రోజు అని తూర్పు రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయంతో కాంట్రాక్టు అధ్యాపకులు కూడా రెగ్యులరైజ్ అవుతారని తెలిపారు. ఎన్నికల హామీని నిలబెట్టుకున్న సీఎం జగన్‌కు కాంట్రాక్టు ఉద్యోగుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు చెప్పారు. – ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి వెలుగులు నింపిన సీఎం ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న దాదాపు 5 వేల మందిని రెగ్యులరైజ్ చేసేలా ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న నిర్ణయం తమ జీవితాల్లో వెలుగులు నింపుతోందని గవర్నమెంట్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ హర్షం వ్యక్తం చేసింది. మాటకు కట్టుబడ్డ సీఎం జగన్‌కు సంఘం నేతలు వై.రామచంద్రారెడ్డి, చంద్రమోహన్‌రెడ్డి, కరీంఖాన్ కృతజ్ఞతలు తెలిపారు. అందరినీ రెగ్యులర్ చేస్తున్న సీఎం జగన్‌కు రుణపడి ఉంటామని ఏపీ పాలిటెక్నిక్ ఆల్ కాంట్రాక్టు లెక్చరర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు పి.సాయిరాజు పేర్కొన్నారు. – గవర్నమెంట్ కాంట్రాక్టు లెక్చరర్స్ ఫెడరేషన్ -
తెలంగాణ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామన్న ప్రభుత్వ హామీపై హైకోర్టు నీళ్లు చల్లింది. ప్రభుత్వం జారీ చేసిన 16 జీవోను కొట్టేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. క్రమబద్దీకరణ చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది. గతంలో జీవో 16ను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్ధులు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం తాజా ఆదేశాలను జారీ చేసింది. 1996 తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన కోర్టు దీనికి సంబంధించిన జీవో 16 ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది. కాగా న్యాయస్థానం తీర్పుపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది. -
తెలంగాణ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
-
కదం తొక్కిన కాంట్రాక్ట్ అధ్యాపకులు
భారీ ర్యాలీ చేపట్టిన నిరుద్యోగులు దద్దరిల్లిన గాంధీభవన్.. ఓయూ హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు కదం తొక్కారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వేసిన కేసులు ఉపసంహరించుకోవాలంటూ శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. క్రమబద్ధీకరణపై కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గాంధీభవన్‌ను ముట్టడించారు. మరోవైపు తమని కాదని ఇచ్చిన క్రమబద్ధీకరణ జీవో అశాస్త్రీయమంటూ నిరుద్యోగులు ఉస్మానియాలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. దీంతో ఇరు ప్రాంతాలూ ఆందోళనలతో అట్టుడికి... ఉద్రిక్తలకు దారితీశాయి. గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత... ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జీవో నం.16 ఇచ్చింది. ఈ జీవోపై కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన బాటపట్టారు. బినామీల పేరుతో కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కేసులు వేయించిందంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ (టీజీసీసీఎల్‌ఏ) ఆధ్వర్యంలో వందలాదిమంది గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి తాము గాంధీభవన్‌కు వస్తే పోలీసులు అప్రజాస్వామికంగా ప్రవర్తించారని టీజీసీసీఎల్‌ఏ అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం ఆరోపించారు. కాంగ్రెస్ వేసిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు. జర్నలిస్ట్‌పై దాడి చేసిన ఎస్సై బదిలీ గాంధీభవన్ వద్ద శుక్రవారం కాంట్రాక్ట్ లెక్చరర్ల ధర్నా కవర్ చేయడానికి వెళ్లిన టీన్యూస్ జర్నలిస్ట్ యుగంధర్‌పై సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై జి.తిమ్మప్ప దాడి చేశారు. జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించిన ఆయన తిమ్మప్పను టాస్క్‌ఫోర్స్ నుంచి కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు. ఓయూలో భారీ ర్యాలీ... కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించవద్దంటూ నిరుద్యోగులు చేపట్టిన ర్యాలీతో ఓయూ దద్దరిల్లింది. కేసులు ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘం నేతలు దేవిప్రసాద్, మధుసూదన్‌రెడ్డి తమను బెదిరిస్తున్నారని, వారిని అరెస్టు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశా రు. రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కె.మానవతారాయ్ ఆధ్వర్యంలో ఆందోళనకారు లు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు. -
క్రమబద్ధీకరణపై 9న కీలక భేటీ
* జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ! * ఈ అంశంపై సీఎస్ ఆధ్వర్యంలో సమావేశం * డీఎస్సీల్లో నష్టపోయిన వారిపైనా చర్చ సాక్షి, హైదరాబాద్: విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లోని కాంట్రాక్టు లెక్చరర్ల సర్వీసు క్రమబద్ధీకరణపై ఈ నెల 9న కీలక సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ ఆధ్వర్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, విద్యా శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఆర్థిక శాఖ అధికారులు పాల్గొననున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు కాలేజీల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సర్వీసు క్రమబద్ధీకరణకు సంబంధించిన అంశంపై విద్యాశాఖ దృష్టి సారించింది. మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు పోస్టులు మంజూరు కాని కాలేజీల్లో పని చేస్తున్న లెక్చరర్ల క్రమబద్ధీకరణకూ చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జూన్ 2 నాటికి విద్యాశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులు, లెక్చరర్లను క్రమబద్ధీకరించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలిసింది. త్వరలో క్రమబద్ధీకరణ మార్గదర్శకాలు ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,796 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే అందులో అందరిని ఒకేసారి క్రమబద్ధీకరిస్తారా? లేదా దశలవారీగా సీనియారిటీ ఆధారంగా క్రమబద్ధీకరణకు చర్యలు చేపడతారా? అన్న అంశాలను కూడా సీఎస్ ఆధ్వర్యంలో జరిగే సమావేశంలో తేల్చి మార్గదర్శకాలు రూపొందించే అవకాశం ఉంది. మరోవైపు డిగ్రీ కాలేజీల్లోనూ పనిచేస్తున్న 966 మంది లెక్చరర్ల క్ర మబద్ధీకరణపై చర్చించనున్నారు. ఇక 1998 నుంచి 2012 వరకు నిర్వహించిన డీఎస్సీల్లోనూ నష్టపోయిన వారికి న్యాయం చేసేలా విద్యాశాఖ కసరత్తు చేసింది. ఈ నేపథ్యంలో జరిగే కీలక సమావేశంలో వారి అంశంపైనా చర్చించి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. -
అవినీతికి కాంట్రాక్టు!
* కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అవినీతి గ్రహణం * భారీగా సొమ్ము చేసుకుంటున్న ఉన్నతాధికారులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు ‘అవినీతి’ గ్రహణం పట్టింది. దొరికిందే తడవంటూ అందినకాడికి దండుకోవాలని చూస్తున్న ‘అధికార భూతం’... వేలాది మంది ఆశలను పట్టి మింగేస్తోంది. క్రమబద్ధీకరణ ఫైళ్లను ఎక్కడికక్కడ తొక్కిపెట్టి కాంట్రాక్టు ఉద్యోగుల్లో ఆందోళన నింపుతోంది. కొర్రీలు పెట్టేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకే సరికొత్త భాష్యాలు చెబుతోంది. ఎంతో కొంత ‘సమర్పించు’కుంటే పనవుతుందంటూ బేరసారాలూ మొదలుపెట్టింది. దీంతో ఎప్పుడెప్పుడు తమ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయా.. అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పంపింది రెండు విభాగాలే రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ప్రాథమిక గణాంకాల ప్రకారం 47 విభాగాల పరిధిలోని 13,671 మంది కాంట్రాక్టు ఉద్యోగులు క్రమబద్ధీకరణకు తగిన అర్హతలు కలిగి ఉన్నట్లు సమాచారం. ఏప్రిల్ 24వ తేదీకల్లా అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులందరి వివరాలతో ప్రతిపాదనలు పంపించాలని ప్రభుత్వం అన్ని శాఖలకు గతంలోనే లేఖలు రాసింది. స్వయంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ అన్ని శాఖల కార్యదర్శులతో సమావేశమై ఏప్రిల్ నెలాఖరులోగా ఈ ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు కూడా. కానీ ఆ గడువు దాటి రెండు వారాలు కావస్తున్నా కేవలం రెండు విభాగాల నుంచే ప్రతిపాదనలు అందాయని... అందులోనూ పది మందికి మించి అర్హులైన వారు లేరని ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. మరి మిగతా విభాగాలన్నీ ఉలుకూ పలుకు లేనట్లుగా వ్యవహరించడానికి కారణం తెర వెనుక సాగుతున్న అవినీతి భాగోతమేననే ఆరోపణలు వినవస్తున్నాయి. కొన్ని విభాగాల్లో బడా అధికారులే అవినీతికి ద్వారాలు తెరిచారని, పలు చోట్ల సిబ్బంది ఏకంగా బేరసారాల కోసం కౌంటర్లు తెరిచారని చెబుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో మాయలు! ఎక్కువ సంఖ్యలో కాంట్రాక్టు ఉద్యోగులున్న వైద్యారోగ్య శాఖ క్రమబద్ధీకరణ ప్రక్రియలో చిత్ర విచిత్రాలకు పాల్పడుతోంది. ప్రభుత్వం జారీ చేసిన చెక్‌లిస్టుకు భిన్నంగా... ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగం ఉన్నతాధికారులు కేవలం పారా మెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఎంపీహెచ్‌ఏల క్రమబద్ధీకరణకు మాత్రమే ప్రతిపాదనలు పంపాలని జిల్లాలకు లేఖలు రాశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు అయోమయంలో పడ్డారు. ప్రజారోగ్య విభాగం పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 280 మంది కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు పనిచేస్తున్నారు. వారిలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం 148 మంది అర్హులున్నట్లు సమాచారం. కానీ వారి జాబితాలను పంపకపోవడం వెనుక మతలబేమిటనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇదే శాఖ పరిధిలోని వైద్య విధాన పరిషత్ పరిధిలో పనిచేస్తున్న 147 మంది కాంట్రాక్టు సివిల్ అసిస్టెంట్ సర్జన్ల క్రమబద్ధీకరణ ప్రతిపాదనల తయారీ వేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎవరిని ప్రసన్నం చేసుకుంటే తమ ఫైలు వేగంగా కదులుతుందోనని కాంట్రాక్టు ఉద్యోగులు సెక్రటేరియట్‌లోని విభాగాల అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల ఆత్రుతను, ఆరాటాన్ని అదనుగా చేసుకొని.. కొందరు ఉద్యోగులు అందిన కాడికి వసూలు చేసుకుంటున్నారు. చేద్దాం... చూద్దాం..! కొన్ని శాఖల అధికారులు ఉద్దేశపూర్వకంగానే క్రమబద్ధీకరణ ఫైళ్లకు అవినీతి గ్రహణం పట్టిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ‘ఇంకా నిబంధనలు రాలేదు.. మీ విషయం ఇంకా తేలలేదు.. మీకిస్తే మిగతా వాళ్లు నష్టపోతారు కదా.. అందరినీ రెగ్యులరైజ్ చేద్దామని అనుకుంటున్నాం..’ అంటూ కొందరు ఉన్నతాధికారులు తమకు తోచిన సమాధానాలతో కాంట్రాక్టు ఉద్యోగులను వేధిస్తున్నారు. మరి కొందరు విభాగాధిపతులు ఫైలుపై ఏవో కొర్రీలు రాసి నిలిపేస్తున్నారు. ‘ఎంతో కొంత ముట్టజెపితే ఫైలు ముందుకు కదులుతుంది.. లేకుంటే చూద్దాం.. ఇంకొంత కాలం వేచి చూద్దాం..’ అంటూ అవినీతికి తలుపులు తెరుస్తున్నారు. ఇదే అదనుగా కిందిస్థాయి ఉద్యోగులు నేరుగానే బేరసారాలు మొదలుపెట్టేస్తున్నారు. నిబంధనలకు కొత్త అర్థం ఇంటర్ విద్య విభాగంలో అత్యధికంగా 5,757 మంది, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ విభాగంలో 2,473 మంది కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో జూనియర్ లెక్చరర్లు, పీహెచ్‌సీల్లో పనిచేసే మెడికల్ ఆఫీసర్లు, పారా మెడికల్ సిబ్బంది ఉన్నారు. వీరిలో క్రమబద్ధీకరణ కోసం ఎవరి జాబితాలు పంపాలి, ఎవరివి అవసరం లేదనే షరతులేమీ ప్రభుత్వం విధించలేదు. ఆయా శాఖల పరిధిలోని అర్హులైన కాంట్రాక్టు ఉద్యోగులందరి ప్రతిపాదనలు విడివిడిగా పంపాలని మాత్రమే ఆదేశించింది. ఈ మేరకు అర్హులందరి ప్రతిపాదనలు పంపాల్సిన శాఖాధిపతులు, కార్యదర్శులు మాత్రం చెక్‌లిస్టుల తయారీలో చక్రం తిప్పుతున్నారు. అందుకే ఫైళ్లు ఆయా శాఖలు దాటి ముందుకు కదలటం లేదు. -
కేబినేట్ సబ్ కమిటీ భేటీ
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ కేబినేట్ సబ్ కమిటీ మంగళవారం సమావేశమైంది. విజయవాడ స్టేట్ గెస్ట్‌హౌస్‌లో సమావేశమైన కమిటీ కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, మహిళా, రైతు సాధికారిత, టెక్స్టైల్ అంశాలపై చర్చించనున్నారు. కేబినేట్ సబ్ కమిటీ సభ్యులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత, కామినేని శ్రీనివాస్, పల్లె రఘునాథరెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. -
ఉస్మానియా ఉద్రిక్తం
* కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై నిరసన వెల్లువ * ఉద్రిక్తతకు దారి తీసిన చలో అసెంబ్లీ ర్యాలీ * పోలీసులపై రాళ్ళు రువ్విన ఆందోళనకారులు * లాఠీచార్జి...ఐదుగురికి గాయాలు * నిరుద్యోగ జేఏసీ నేతలు అరెస్టు, విడుదల ఉస్మానియా యూనివర్సిటీ: కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ మరోసారి ఉద్రిక్తతకు నెలవైంది. కాంట్రాక్టు ఉద్యోగులక్రమబద్ధీకరణ అంశంతో క్యాంపస్ భగ్గుమంది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర అలజడి రేపింది. ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఆగ్రహించిన ఆందోళనకారులు వారిపై రాళ్లు రువ్వారు. వలయాలను చేధించుకుని ముందుకు దూసుకు వ స్తున్న ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఈ ఘటనలో ఐదుగురికి గాయాలయ్యాయి. ఇదే సమయంలో మరికొంత మంది ఆందోళనకారులు పోలీసుల కళ్లుగప్పి గన్ పార్కు వ ద్దకు చేరుకున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకం గా నినాదాలు చేస్తూ... అసెంబ్లీ వైపు దూసుకేళ్లేందుకు యత్నించారు. వారిని పోలీ సులు అడ్డుకుని దొరికిన వారిని దొరికినట్లే చితకబాదారు. 12 మందిని అరెస్టు చేసి, సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. ఎన్సీసీ గేటు వద్ద... కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్ధీకరణను నిరసిస్తూ తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో వర్సిటీకి చెందిన వందలాది మంది విద్యార్థులు ఇంటర్నల్ పరీక్షలను, తరగతులను బహిష్కరించారు. చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల నుంచి ఉదయం 11 గంటలకు ర్యాలీగా బయలుదేరారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఎన్సీసీ గేటు వద్దకు చేరుకున్నారు. అప్పటికే గేటు వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిర్వహిస్తున్న తమ ర్యాలీని అడ్డుకోవడం అప్రజస్వామికమని ఆరోపిస్తూ ఎన్సీసీ గేటు వద్దే సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. అదే సమయంలో కొంతమంది విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వగా, ప్రతిగా పోలీసులు లాఠీలు ఝళిపించారు. ఈ ఘటనలో జేఏసీ చైర్మన్ కళ్యాణ్, టీఎన్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ఉపాధ్యక్షుడు కిరణ్‌గౌడ్, జేఏసీ అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి, వీరబాబు, సోలంకి శ్రీనివాస్ గాయపడ్డారు. మరోవైపు తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు కోటూరి మానవతరాయ్తో పాటు భీంరావ్నాయక్, రాము, బొప్పని ఈశ్వర్, శ్రీకాంత్, మల్లేష్, కమలాకర్, విజయ్‌కుమార్, రాజ్‌కుమార్, తిరుపతి, రాజారమేష్ తదితరులను చితకబాది అరెస్ట్ చేశారు. షహనాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు తరలించి, రాత్రి పొద్దుపోయిన తర్వాత విడిచిపెట్టినట్టు తెలిసింది. అరెస్టుకు నిరసనగా నేడూ ధర్నాలు కేసీఆర్ అనుసరిస్తున్న అణిచివేత ధోరణులకు నిరసనగా మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపపట్టాలని టీఎన్ఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు ఆంజనేయగౌడ్ పిలుపునిచ్చారు. నిరుద్యోగుల సమస్యలను అసెంబ్లీలో లేవనెత్తేందుకు మంగళవారం వివిధ పార్టీల నేతలను సంప్రదించనునట్లు చెప్పారు. డిసెంబరు మొదటి వారంలో విద్యార్థి నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనునట్లు అధికార ప్రతినిధి నరేందర్‌రెడ్డి తెలిపారు. -
మలి దశ ఉద్యమానికి సన్నద్ధం
హైదరాబాద్: కొంతకాలంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలతో అట్టుడికిన ఉస్మానియా యూనివర్సిటీలో తాజాగా కాంట్రాక్టు ఉ ద్యోగుల క్రమబద్ధీకరణ సెగలు అగ్గిరాజేస్తున్నా యి. గత 60 రోజుల నుంచి ఈ అంశంపై సాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వ చర్యకు నిరసనగా తెలంగాణలోని 40 లక్షల మంది నిరుద్యోగులను ఏకం చేసి, మ లిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని తెలంగా ణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ నిర్ణయిం చింది. ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు, నోటిఫికేషన్, విద్యార్హత, పరీక్షల్లో ప్రతిభ, ఇంటర్వ్యూ వంటి అంశాలను పట్టించుకోకుండా అక్రమపద్ధతిలో ఉద్యోగాలు పొందిన కాంట్రాక్టు ఉద్యోగులను ఏకపక్షంగా క్రమబద్ధీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది. ఇందుకు నిరసనగా త్వరలో చలో అసెంబ్లీ కార్యక్రమంతో పాటు ఆర్ట్స్ కాలేజీ ముందు లక్ష మంది విద్యార్థులతో భారీ బ హిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలంగా ణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ నేతలు ప్రకటిం చారు. ఇందుకోసం అన్ని వర్గాల మద్దతును కూడగటడుతున్నట్లు తెలిపారు. అయితే తాము కూడా ఇదే మట్టిలో పుట్టామని, ఇదే వర్సిటీలో చదువుకున్నామని, దయ చేసి తమపొట్ట కొట్టొద్దని తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. శ్వేతపత్రం విడుదల చేయాలి ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పని చేస్తున్న వారిలో నూటికి 80 శాతం మంది బ్యాక్‌డోర్ నుంచి వచ్చిన వారే. గతంలో పని చేసిన ప్రభుత్వం, అధికారులు కలిసి అర్హత, అనుభవం లేని వారిని రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా బంధు, మిత్రులను తెచ్చిపెట్టుకున్నారు. ఈ నియామకాల్లో భాగస్వాములైన పెద్దలకు భారీ ముడుపులే ముట్టాయి. ఇలాంటి వారిని ఏకపక్షంగా క్రమబద్ధీకరిస్తామంటే చూస్తూ ఊరుకోం. ఆయా విభాగాల్లోని ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. భర్తీలో విధివిధానాలేమిటో స్పష్టం చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ, వయోపరిమితి సడలింపుపై మాకె లాంటి అభ్యంతరం లేదు. - కె.మానవతారాయ్, అధ్యక్షుడు, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ సంఘం మీరేనాడైనా జైలుకెళ్లారా..? నీళ్లు, నిధులు, ఉద్యోగాలే లక్ష్యంగా కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. చదువులు, పోటీ పరీక్షలు, ఉద్యోగాలు ఇలా అన్ని వదులుకొని ఉద్యమించాం. జైలుకు కూడా వెళ్లి వచ్చాం. మా జీవితాలను పణంగా పెట్టి పోరాడి తెలంగాణ సాధించి కేసీఆర్‌ను సీఎం కుర్చీపై కూర్చోబెడితే మాకిచ్చే బహుమానం ఇదేనా.? ఉద్యమంలో వాడుకుని పక్కన పెడుతున్నారు. - వీరబాబు, నాయకుడు, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ సంఘం ఫోర్త్‌క్లాస్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మేం వ్యతిరేకం కాదు ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పని చేస్తున్న 3, 4వ తరగతి ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. డిగ్రీ, పీజీ, పీహెచ్డీ అర్హత ఆధారంగా భర్తీ చేసే వాటినే మేం వ్యతిరేకిస్తున్నాం. పోస్టులపై స్పష్టత ఇచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి రిజర్వేషన్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయాలి. అన్ని అర్హతలున్న, ప్రతిభగల అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారానే సీఎం కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధ్యం. తెలంగాణలోని 40 ల క్షల మంది నిరుద్యోగులను ఏకం చేస్తాం. మలిదశ ఉద్యమానికి మళ్లీ శ్రీకారం చుడతాం. - కళ్యాణ్ నాయక్, చైర్మన్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ సంఘం మా పొట్టకొట్టొద్దు మేమూ తెలంగాణలోనే పుట్టాం. ఉద్యమంలో భాగస్వాములమయ్యాం. దయ చేసి మా పొట్ట కొట్టొద్దు. సమైక్యాంధ్రలో మేమంతా తీవ్రంగా నష్టపోయాం. సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్నీ వదులుకుని పొట్టకూటి కోసం 18 ఏళ్ల క్రితం కాంట్రాక్టు ఉద్యోగంలో చేరాం. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను తెచ్చింది నాటి సీఎం చంద్రబాబు అయితే...ఈ స మస్యకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. మా అంశాన్ని టీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు మేనిఫెస్టోల్లో చేర్చాయి. ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ ముందుకు పోతుంటే, ఇది గిట్టని కొన్ని రాజకీయ శక్తులు దీనికి అడ్డుపడుతున్నాయి. క్రమబద్ధీకరణలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందనే ఆరోపణల్లో వాస్తవం లేదు. నిపుణులతో కమిటీ వేసింది. విద్యార్హత, వయసు, రిజర్వేషన్, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటుంది. - డాక్టర్ వేల్పుల కుమార్, అధ్యక్షుడు, తెలంగాణ వర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ -
మార్గదర్శకాలు విడుదల చేయండి
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వానికి టీజేఏసీ వినతి హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కన్వీనర్ దేవీప్రసాద్, కో చైర్మన్ సి.విఠల్, ముఖ్యనేతలు శివశంకర్, మణిపాల్‌రెడ్డి, పిట్టల రవీందర్ తదితరులు జేఏసీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై జేఏసీ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసింది. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై విద్యార్థులు, నిరుద్యోగ యువకులు కొన్ని అభ్యంతరాలను, డిమాండ్లను లేవనెత్తుతున్నారని కోదండరాం చెప్పారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను విడుదల చేయాలని, వాటిని రూపొందించడానికి ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను క్రమబద్ధీకరించడంలో వివాదమేమీ లేదన్నారు. గెజిటెడ్ స్థాయి, ఆ స్థాయిని మించిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై అభ్యంతరాలున్నాయన్నారు. పెద్ద ఉద్యోగాలకు పోటీ పరీక్షలను నిర్వహించాలని, ఆ పరీక్షల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీని ఇవ్వాలని విద్యార్థులు చేస్తున్న వాదనంలో న్యాయం ఉందని చెప్పారు. అభ్యంతరాలపై విద్యార్థులతో చర్చించి న తర్వాతనే క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. పోలవరం ముం పు గ్రామాలను కాపాడటానికి ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం ముంపు గ్రామాలకోసం పోరాడుతోందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూనే కేంద్రప్రభుత్వంపై పోరాడుతామని కోదండరాం చెప్పారు. కన్వీనర్ దేవీ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు పట్టించుకోలేదన్నారు. అయితే సీఎం కేసీఆర్ ఒక్కరోజే 43 ప్రజా అనుకూల నిర్ణయాలను ప్రకటించారని ఆయన ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న 86 మందికి ఇంకా వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బోనాల పండుగ జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో తెలంగాణ ప్రభుత్వం సోమవారంనాడు సెలవును ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే హైదరాబాద్‌లో కార్యాలయాలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం లేదన్నారు. ఇక్కడి సంస్కృతిపై గౌరవం లేనివారు తెలంగాణలో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై కక్షసాధింపులను మానుకోకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని దేవీప్రసాద్ హెచ్చరించారు.