
కదం తొక్కిన కాంట్రాక్ట్ అధ్యాపకులు
- భారీ ర్యాలీ చేపట్టిన నిరుద్యోగులు
- దద్దరిల్లిన గాంధీభవన్.. ఓయూ
హైదరాబాద్: ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు కదం తొక్కారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై వేసిన కేసులు ఉపసంహరించుకోవాలంటూ శుక్రవారం భారీ ఆందోళనకు దిగారు. క్రమబద్ధీకరణపై కోర్టుకు వెళ్లిన కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా గాంధీభవన్‌ను ముట్టడించారు. మరోవైపు తమని కాదని ఇచ్చిన క్రమబద్ధీకరణ జీవో అశాస్త్రీయమంటూ నిరుద్యోగులు ఉస్మానియాలో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. దీంతో ఇరు ప్రాంతాలూ ఆందోళనలతో అట్టుడికి... ఉద్రిక్తలకు దారితీశాయి.
గాంధీభవన్ వద్ద ఉద్రిక్తత...
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకుల క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం జీవో నం.16 ఇచ్చింది. ఈ జీవోపై కొందరు కోర్టుకు వెళ్లారు. దీంతో కాంట్రాక్టు లెక్చరర్లు ఆందోళన బాటపట్టారు. బినామీల పేరుతో కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలను అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కేసులు వేయించిందంటూ మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకుల అసోసియేషన్ (టీజీసీసీఎల్‌ఏ) ఆధ్వర్యంలో వందలాదిమంది గాంధీభవన్ ముట్టడికి యత్నించారు. పోలీసులు వారిని అరెస్టు చేశారు. దీంతో వాతావరణం ఉద్రిక్తంగా మారింది. శాంతియుతంగా నిరసన తెలియజేయడానికి తాము గాంధీభవన్‌కు వస్తే పోలీసులు అప్రజాస్వామికంగా ప్రవర్తించారని టీజీసీసీఎల్‌ఏ అధ్యక్షుడు సీహెచ్ కనకచంద్రం ఆరోపించారు. కాంగ్రెస్ వేసిన కేసులు ఉపసంహరించుకోవాలన్నారు.
జర్నలిస్ట్‌పై దాడి చేసిన ఎస్సై బదిలీ
గాంధీభవన్ వద్ద శుక్రవారం కాంట్రాక్ట్ లెక్చరర్ల ధర్నా కవర్ చేయడానికి వెళ్లిన టీన్యూస్ జర్నలిస్ట్ యుగంధర్‌పై సెంట్రల్ టాస్క్‌ఫోర్స్ ఎస్సై జి.తిమ్మప్ప దాడి చేశారు. జర్నలిస్ట్ సంఘాల ప్రతినిధులు నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు. తక్షణం స్పందించిన ఆయన తిమ్మప్పను టాస్క్‌ఫోర్స్ నుంచి కమిషనర్ కార్యాలయానికి బదిలీ చేశారు. ఈ ఉదంతంపై విచారణకు ఆదేశించారు.
ఓయూలో భారీ ర్యాలీ...
కాంట్రాక్టు కార్మికులను క్రమబద్ధీకరించవద్దంటూ నిరుద్యోగులు చేపట్టిన ర్యాలీతో ఓయూ దద్దరిల్లింది. కేసులు ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘం నేతలు దేవిప్రసాద్, మధుసూదన్‌రెడ్డి తమను బెదిరిస్తున్నారని, వారిని అరెస్టు చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేశా రు. రాష్ట్ర నిరుద్యోగ జేఏసీ చైర్మన్ కె.మానవతారాయ్ ఆధ్వర్యంలో ఆందోళనకారు లు సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు.