కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీసిన కేటీఆర్
నోటిఫికేషన్లు అంటూ బూటకపు హామీలు ఇచ్చారు
మెగా డీఎస్సీ అని దగా చేశారు
నిరుద్యోగులకు అండగా ఉంటాం
అన్ని చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
సాక్షి, హైదరాబాద్: ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు అరచేతిలో వైకుంఠం చూపించి, గెలిచిన తరువాత వారిని కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారక రామారావు విమర్శించారు. గురువారం ఆయనను పలువురు నిరుద్యోగులు కలిసి తమ పోరాటానికి అండగా ఉండాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేటీఆర్ వారి పోరాటానికి బీఆర్‌ఎస్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు జాబ్ కేలెండర్ పేరుతో పెద్ద ఎత్తున పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారని, దాదాపు 10 పరీక్షలకు సంబంధించి తేదీలతో సహా నోటిఫికేషన్లు అంటూ బూటకపు హామీలు ఇచ్చారని ధ్వజమెత్తారు.
అయి తే వాటికి సంబంధించి ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు విడుదల చేయలేదన్నారు. జాబ్ కేలెండర్ ఏమైందని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇచ్చిన హామీ మేరకు వెంటనే ఆ నోటిఫికేషన్లను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మొదటి కేబినెట్ భేటీలోనే మెగా డీఎస్సీ అని చెప్పి నిరుద్యోగులను దగా చేశారన్నారు. గ్రూప్–1కు సంబంధించి తమ ప్రభుత్వం ఇచి్చన నోటిఫికేషన్‌కు కేవలం 60 ఉద్యోగాలు మాత్రమే కలిపారని పేర్కొన్నారు. ఉద్యోగాలు పెంచమని అడిగితే సాంకేతిక కారణాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈ ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ ఎట్టి పరిస్థితుల్లో వదలదని, అన్ని చట్టసభల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు. గ్రూప్– 1 మెయిన్స్‌కు సంబంధించి 1:100 ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపిక చేయాలని ప్రస్తుత డిప్యూటీ సీఎం గతంలో డిమాండ్ చేశారని, కానీ ఇప్పుడు ఎందుకు అలా చేయడంలేదని ప్రశ్నించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. జాబ్ కేలెండర్‌ను వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు. హామీలు అమలు చేయకపోతే ఏ నిరుద్యోగులైతే ఈ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో.. వారే ప్రభుత్వాన్ని గద్దె దించే పరిస్థితి వస్తుందని కేటీఆర్ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment