గ్రూప్ 1 సహా నిరుద్యోగుల డిమాండ్లు అన్నీ నెరవేర్చాలి
‘నీట్’ లీకేజీపై కిషన్‌రెడ్డి, బండి స్పందించాలి: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల అభ్యర్థులు, నిరుద్యోగులు ప్రజా దర్బార్‌లో కాంగ్రెస్ నేతల కాళ్ల మీద పడుతున్నా కనికరించడం లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాట తప్పుతోందన్నారు.
గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ వద్దకు వచ్చి విన్నవించుకుంటున్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డితో కలిసి తెలంగాణ భవన్‌లో సోమవారం హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు.
నిరుద్యోగులు కొత్త హామీలు కోరుకోవడం లేదని, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల తరపున ప్రభుత్వం ముందు తాము పెడుతున్న ఐదు డిమాండ్లను నెరవేర్చాలన్నారు. గ్రూప్ 1 మెయిన్స్‌కు 1:100 చొప్పున అవకాశం ఇవ్వాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి మరో ఐదు వేల ఉద్యోగాలు కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. టీజీపీఎస్సీతో పాటు డీఎస్సీ పరీక్షలకు నడుమ కనీసం రెండు నెలల వ్యవధి ఉండేలా చూడాలన్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ కేలండర్ ఇస్తామనే హామీ నిలబెట్టుకోవాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.
‘నీట్’పై కేంద్ర మంత్రులు స్పందించాలి
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, నీట్ పరీక్ష విధానం, గ్రేస్ మార్కులు ఇవ్వడంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని హరీశ్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ స్పందించాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ కార్యకర్తను.. పార్టీ మారను
తాను పార్టీ మారుతున్నట్లు ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. వ్యూస్ పెంచుకునేందుకు ఒక నాయకుడి నిబద్ధత, నిజాయతీ దెబ్బతీయొద్దు. నేను బీఆర్‌ఎస్ కార్యకర్తను, పార్టీలోనే కొనసాగుతాను. ఇలాంటి వార్తలు మానుకోకపోతే లీగల్ నోటీసులు పంపిస్తా అని హరీశ్‌రావు హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment