
మలి దశ ఉద్యమానికి సన్నద్ధం
హైదరాబాద్: కొంతకాలంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలతో అట్టుడికిన ఉస్మానియా యూనివర్సిటీలో తాజాగా కాంట్రాక్టు ఉ ద్యోగుల క్రమబద్ధీకరణ సెగలు అగ్గిరాజేస్తున్నా యి. గత 60 రోజుల నుంచి ఈ అంశంపై సాగుతున్న ఘర్షణలు మరింత తీవ్రమవుతున్నాయి. ప్రభుత్వ చర్యకు నిరసనగా తెలంగాణలోని 40 లక్షల మంది నిరుద్యోగులను ఏకం చేసి, మ లిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని తెలంగా ణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ నిర్ణయిం చింది. ఖాళీల వివరాలు, రిజర్వేషన్లు, నోటిఫికేషన్, విద్యార్హత, పరీక్షల్లో ప్రతిభ, ఇంటర్వ్యూ వంటి అంశాలను పట్టించుకోకుండా అక్రమపద్ధతిలో ఉద్యోగాలు పొందిన కాంట్రాక్టు ఉద్యోగులను ఏకపక్షంగా క్రమబద్ధీకరిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించింది.
ఇందుకు నిరసనగా త్వరలో చలో అసెంబ్లీ కార్యక్రమంతో పాటు ఆర్ట్స్ కాలేజీ ముందు లక్ష మంది విద్యార్థులతో భారీ బ హిరంగ సభను నిర్వహించనున్నట్లు తెలంగా ణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ నేతలు ప్రకటిం చారు. ఇందుకోసం అన్ని వర్గాల మద్దతును కూడగటడుతున్నట్లు తెలిపారు. అయితే తాము కూడా ఇదే మట్టిలో పుట్టామని, ఇదే వర్సిటీలో చదువుకున్నామని, దయ చేసి తమపొట్ట కొట్టొద్దని తెలంగాణ యూనివర్సిటీస్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు.
శ్వేతపత్రం విడుదల చేయాలి
ప్రభుత్వ రంగ సంస్థల్లో వివిధ విభాగాల్లో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పని చేస్తున్న వారిలో నూటికి 80 శాతం మంది బ్యాక్‌డోర్ నుంచి వచ్చిన వారే. గతంలో పని చేసిన ప్రభుత్వం, అధికారులు కలిసి అర్హత, అనుభవం లేని వారిని రిజర్వేషన్‌తో సంబంధం లేకుండా బంధు, మిత్రులను తెచ్చిపెట్టుకున్నారు. ఈ నియామకాల్లో భాగస్వాములైన పెద్దలకు భారీ ముడుపులే ముట్టాయి. ఇలాంటి వారిని ఏకపక్షంగా క్రమబద్ధీకరిస్తామంటే చూస్తూ ఊరుకోం. ఆయా విభాగాల్లోని ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలి. భర్తీలో విధివిధానాలేమిటో స్పష్టం చేయాలి. కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీ, వయోపరిమితి సడలింపుపై మాకె లాంటి అభ్యంతరం లేదు. - కె.మానవతారాయ్,
అధ్యక్షుడు, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ సంఘం
మీరేనాడైనా జైలుకెళ్లారా..?
నీళ్లు, నిధులు, ఉద్యోగాలే లక్ష్యంగా కొనసాగిన తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు కీలకపాత్ర పోషించారు. చదువులు, పోటీ పరీక్షలు, ఉద్యోగాలు ఇలా అన్ని వదులుకొని ఉద్యమించాం. జైలుకు కూడా వెళ్లి వచ్చాం. మా జీవితాలను పణంగా పెట్టి పోరాడి తెలంగాణ సాధించి కేసీఆర్‌ను సీఎం కుర్చీపై కూర్చోబెడితే మాకిచ్చే బహుమానం ఇదేనా.? ఉద్యమంలో వాడుకుని పక్కన పెడుతున్నారు.
- వీరబాబు, నాయకుడు, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ సంఘం
ఫోర్త్‌క్లాస్ ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మేం వ్యతిరేకం కాదు
ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పని చేస్తున్న 3, 4వ తరగతి ఉద్యోగుల క్రమబద్ధీకరణపై మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ అర్హత ఆధారంగా భర్తీ చేసే వాటినే మేం వ్యతిరేకిస్తున్నాం. పోస్టులపై స్పష్టత ఇచ్చి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చి రిజర్వేషన్, పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా భర్తీ చేయాలి. అన్ని అర్హతలున్న, ప్రతిభగల అభ్యర్థులను ఎంపిక చేయడం ద్వారానే సీఎం కేసీఆర్ కలలుగన్న బంగారు తెలంగాణ సాధ్యం. తెలంగాణలోని 40 ల క్షల మంది నిరుద్యోగులను ఏకం చేస్తాం. మలిదశ ఉద్యమానికి మళ్లీ శ్రీకారం చుడతాం.
- కళ్యాణ్ నాయక్, చైర్మన్, తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ సంఘం
మా పొట్టకొట్టొద్దు
మేమూ తెలంగాణలోనే పుట్టాం. ఉద్యమంలో భాగస్వాములమయ్యాం. దయ చేసి మా పొట్ట కొట్టొద్దు. సమైక్యాంధ్రలో మేమంతా తీవ్రంగా నష్టపోయాం. సామాజిక, ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అన్నీ వదులుకుని పొట్టకూటి కోసం 18 ఏళ్ల క్రితం కాంట్రాక్టు ఉద్యోగంలో చేరాం. ఈ కాంట్రాక్ట్ వ్యవస్థను తెచ్చింది నాటి సీఎం చంద్రబాబు అయితే...ఈ స మస్యకు సీఎం కేసీఆర్ శాశ్వత పరిష్కారం చూపాలని భావిస్తున్నారు. మా అంశాన్ని టీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలు మేనిఫెస్టోల్లో చేర్చాయి. ఇచ్చిన హామీ మేరకు కేసీఆర్ ముందుకు పోతుంటే, ఇది గిట్టని కొన్ని రాజకీయ శక్తులు దీనికి అడ్డుపడుతున్నాయి. క్రమబద్ధీకరణలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందనే ఆరోపణల్లో వాస్తవం లేదు. నిపుణులతో కమిటీ వేసింది. విద్యార్హత, వయసు, రిజర్వేషన్, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకునే నిర్ణయం తీసుకుంటుంది.
- డాక్టర్ వేల్పుల కుమార్,
అధ్యక్షుడు, తెలంగాణ వర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్