తెలంగాణ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తామన్న ప్రభుత్వ హామీపై హైకోర్టు నీళ్లు చల్లింది. ప్రభుత్వం జారీ చేసిన 16 జీవోను కొట్టేస్తూ రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం బుధవారం తీర్పు ఇచ్చింది. క్రమబద్దీకరణ చెల్లదని హైకోర్టు తేల్చిచెప్పింది.
గతంలో జీవో 16ను వ్యతిరేకిస్తూ ఉస్మానియా విద్యార్ధులు వేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన న్యాయస్థానం తాజా ఆదేశాలను జారీ చేసింది. 1996 తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయవద్దంటూ మధ్యంతర ఉత్తర్వులను ఇచ్చిన కోర్టు దీనికి సంబంధించిన జీవో 16 ను కొట్టివేస్తూ తీర్పును వెల్లడించింది. కాగా న్యాయస్థానం తీర్పుపై ప్రభుత్వం స్పందించాల్సి ఉంది.