
మార్గదర్శకాలు విడుదల చేయండి
కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై ప్రభుత్వానికి టీజేఏసీ వినతి
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను విడుదల చేయాలని తెలంగాణ జేఏసీ రాష్ట్రప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం, కన్వీనర్ దేవీప్రసాద్, కో చైర్మన్ సి.విఠల్, ముఖ్యనేతలు శివశంకర్, మణిపాల్‌రెడ్డి, పిట్టల రవీందర్ తదితరులు జేఏసీ కార్యాలయంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలపై జేఏసీ ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేసింది. అయితే కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణపై విద్యార్థులు, నిరుద్యోగ యువకులు కొన్ని అభ్యంతరాలను, డిమాండ్లను లేవనెత్తుతున్నారని కోదండరాం చెప్పారు. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను విడుదల చేయాలని, వాటిని రూపొందించడానికి ముందు ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. క్లాస్-3, క్లాస్-4 ఉద్యోగులను క్రమబద్ధీకరించడంలో వివాదమేమీ లేదన్నారు. గెజిటెడ్ స్థాయి, ఆ స్థాయిని మించిన కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించడంపై అభ్యంతరాలున్నాయన్నారు. పెద్ద ఉద్యోగాలకు పోటీ పరీక్షలను నిర్వహించాలని, ఆ పరీక్షల్లో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజీని ఇవ్వాలని విద్యార్థులు చేస్తున్న వాదనంలో న్యాయం ఉందని చెప్పారు. అభ్యంతరాలపై విద్యార్థులతో చర్చించి న తర్వాతనే క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలను విడుదల చేయాలని కోదండరాం డిమాండ్ చేశారు. పోలవరం ముం పు గ్రామాలను కాపాడటానికి ఎన్ని ఉద్యమాలు చేసినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా పోలవరం ముంపు గ్రామాలకోసం పోరాడుతోందన్నారు. ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూనే కేంద్రప్రభుత్వంపై పోరాడుతామని కోదండరాం చెప్పారు. కన్వీనర్ దేవీ ప్రసాద్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను ఇప్పటిదాకా రాజకీయ పార్టీలు పట్టించుకోలేదన్నారు. అయితే సీఎం కేసీఆర్ ఒక్కరోజే 43 ప్రజా అనుకూల నిర్ణయాలను ప్రకటించారని ఆయన ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న 86 మందికి ఇంకా వేతనాలు ఇవ్వకుండా వేధిస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బోనాల పండుగ జరుగుతున్న సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో తెలంగాణ ప్రభుత్వం సోమవారంనాడు సెలవును ప్రకటించిందని గుర్తుచేశారు. అయితే హైదరాబాద్‌లో కార్యాలయాలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించడం లేదన్నారు. ఇక్కడి సంస్కృతిపై గౌరవం లేనివారు తెలంగాణలో ఎందుకు ఉండాలని ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంత ఉద్యోగులపై కక్షసాధింపులను మానుకోకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని దేవీప్రసాద్ హెచ్చరించారు.