సాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల ఉసురుతీస్తోంది. ప్రధానంగా ఎక్సైజ్ శాఖలో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని 15వేల మంది సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌ను చంద్రబాబు ప్రభుత్వం తొలగించింది. కలెక్టర్ల ఆధ్వర్యంలోని జిల్లా ఎంపిక కమిటీలు ద్వారా పారదర్శకంగా నియమితమైన తమను తొలగించవద్దన్న వారి విజ్ఞప్తిని ప్రభుత్వం పెడచెవిన పెట్టింది.
తమను ఇతర శాఖల్లో సర్దుబాటు చేయాలన్న వారి వినతిని తిరస్కరించింది. తాజాగా రాష్ట్రంలోని మద్యం డిపోల్లో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్ ఆపరేటర్లు, స్కానర్లను తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. ఒక్కో డిపోలో పది నుంచి 15మంది చొప్పున మొత్తం 400మందికిపైగా ఆపరేటర్లు, స్కానర్లు పదేళ్లుగా విధుల్లో కొనసాగుతున్నారు. వారిలో 50శాతం మందిని నవంబరు 1 నుంచి తొలగించాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఎక్సైజ్ శాఖ 200మందిపై వేటు వేసింది. ఇక రెండో విడతలో మిగిలిన 200మందిని కూడా తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది.
మద్యం డిస్టిలరీల్లో సీఐడీ సోదాలు
రాష్ట్రంలోని పలు మద్యం డిస్టిలరీల్లో సీఐడీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. మొత్తం ఎనిమిది బృందాలుగా ఏర్పడిన అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు. బీరు తయారీ కంపెనీలు, మొలాసిస్ యూనిట్లలోనూ తనిఖీలు నిర్వహించారు. గతేడాది కాలంలో ఆ కంపెనీల ఉత్పత్తులు, సరఫరా రికార్డులను పరిశీలించారు. పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
జత్వానీ కేసు విచారణ చేపట్టిన సీఐడీ
హనీట్రాప్ కేసుల్లో నిందితురాలైన కాదంబరి జత్వానీ ఇచ్చిన ఫిర్యాదుపై నమోదు చేసిన కేసు దర్యాప్తును సీఐడీ చేపట్టింది. ఆ కేసును ఇప్పటివరకు విజయవాడ పోలీసులు దర్యాప్తు చేసిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment