outsourced employees
-
ఉద్యోగం నుంచి తొలగిస్తే.. పురుగుల మందే దిక్కు
పులివెందుల: తమను ఉద్యోగం నుంచి తొలగిస్తే పురుగుల మందు తాగి చనిపోతామంటూ ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో పనిచేస్తున్న ఇద్దరు చిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేసిన ఘటన వైఎస్సార్ జిల్లాలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఔట్‌సోరి్సంగ్ పద్ధతిలో నియమితులై పులివెందుల మార్కెట్‌యార్డులో పనిచేస్తున్న నలుగురిని, సింహాద్రిపురం మార్కెట్‌యార్డులో ముగ్గురిని తొలగించేందుకు టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇప్పటికే వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తమను ఉద్యోగాల నుంచి తొలగిస్తారన్న ఆందోళనతో పులివెందుల మార్కెట్‌యార్డులో అటెండర్‌గా పనిచేస్తున్న అజార్, సెక్యూరిటీగార్డుగా పనిచేస్తున్న మహేశ్వరరెడ్డి బుధవారం స్థానిక మార్కెట్‌యార్డులో పురుగుమందు డబ్బాలు, పెట్రోలు తీసుకెళ్లి ఆత్మహత్యాయత్నం చేశారు. ఘటనాస్థలానికి వచ్చిన మీడియాతో అజార్, మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ టీడీపీ నేతల ఆదేశాలతో.. సరైన కారణాలు చూపకుండా ఇప్పటికే అధికారులు తమకు రెండు షోకాజ్ నోటీసులు అందజేశారన్నారు. ఆఫీసులో రిజిష్టర్‌ను దాచిపెట్టి తాము సంతకాలు పెట్టేందుకు వీలులేకుండా చేస్తున్నారని చెప్పారు. తమకు జీవనాధారం అయిన ఈ ఉద్యోగాలను తీసేస్తే.. ఆత్మహత్యలే శరణ్యమని విలపించారు. దీంతో మార్కెట్‌యార్డు సెక్రటరీ శ్రీధర్‌రెడ్డి అక్కడికి చేరుకుని ‘మీరు కోర్టును ఆశ్రయించారు కాబట్టి.. కోర్టు ద్వారా వచ్చే నిర్ణయాన్ని బట్టి తాము చర్యలు తీసుకుంటాం’ అని చెప్పడంతో వారు ఆందోళన విరమించారు. దీనిపై సెక్రటరీని వివరణ కోరగా తాము ఎవర్ని విధుల నుంచి తొలగించలేదని తెలిపారు. -
ఆస్తి ఆడపడుచులకు.. మరి నాకు, ముగ్గురు పిల్లలకు మిగిలేదేంటి?
హైదరాబాద్: మమ్మల్ని అల్లారు ముద్దుగా చూసుకునే భర్త అనారోగ్యంతో చనిపోయాడు... మాకు రావలసిన ఆస్తిని తన పిల్లలకు కాకుండా ఆడపడుచులకు ఇచ్చి అత్త అన్యాయం చేస్తుందని, తనకు, తన పిల్లలకు న్యాయం చేయాలని ఓ మహిళ మౌన దీక్షకు దిగింది. మణికొండ మున్సిపాలిటీ కేంద్రంలోని శివాజీనగర్ కాలనీలో ఈ సంఘటన మంగళవారం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెలితే... మణికొండ గ్రామ పంచాయతీకి వార్డు సభ్యునిగా పనిచేసిన ధన్‌రాజ్ అనారోగ్యంతో మూడు సంవత్సరాల క్రితం మరణించాడు. దాంతో ఇద్దరు కూతుర్లు, ఓ కుమారుని భారం భార్య సుధారాణిపై పడింది. మున్సిపాలిటీ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తూ వారిని చదివిస్తుంది. తన భర్త సంపాదించిన ఆస్తిని తన పిల్లలకు చెందనివ్వకుండా అత్త యాదమ్మ ఇటీవల ఆడపడుచులు సావిత్రి, రేణుకల పేరుపైకి మార్చింది. అది తెలిసి తనకు న్యాయం చేయాలని కాలనీ, గ్రామ పెద్దలకు మొరపెట్టుకున్నా స్పందన లేకపోయింది.దీంతో పిల్లలతో కలిసి తనకు న్యాయం చేయాలని శివాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద మౌన దీక్షకు దిగింది. వారంలో న్యాయం చేస్తాం... ఆమె పరిస్థితిని తెలుసుకుని కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రమేష్, వార్డు కౌన్సిలర్ యాలాల లావణ్య నరేష్, రాయదుర్గం పోలీసులు స్పందించి వారం రోజుల్లో చర్చించి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. దాంతో ఆమె ఆందోళనను విరమించింది. -
‘బ్లీచింగ్ పౌడర్ కొట్టించారు.. జీతం అడిగితే తొలగించారు’
సాక్షి, కరీంనగర్: జీతాలు రాకపోవడంతో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇచ్చే అరకొర జీతాలు కూడా ప్రభుత్వం సక్రమంగా ఇవ్వడంలేదని వాపోతున్నారు. అప్పులతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ‘రెండు నెలలు బ్లీచింగ్ పౌడర్ కొట్టించారు.. జీతం అడిగితే తొలగించారు’’ అంటూ సోషల్ మీడియాలో కరీంనగర్ నగరపాలక సంస్థ పొరుగు సేవల ఉద్యోగి పోస్ట్ వైరల్‌గా మారింది. దళితుడినయినా తనకు న్యాయం చేకూర్చాలంటూ కరీంనగర్‌కు చెందిన పొరుగు సేవల ఉద్యోగి కొండ్ర సుధాకర్ కొండ్ర విజ్ఞప్తి చేస్తున్నారు. బ్లీచింగ్ పౌడర్ వల్ల ఆరోగ్యం దెబ్బ తిందని ఆవేదన చేస్తున్న సుధాకర్.. తనకు అన్యాయం జరిగిందని ఉద్యోగం ఇవ్వాలంటూ మొర పెట్టుకున్నారు. Bleeching powder valla health sick 3days live 4days job join ayyan 2month work chesaka salary adegithe job nuddi tholigichnaru kindla sir please any section gave the job sir I am sc B KNR thank you sir pic.twitter.com/KlE1BbfZRp — Sudhakar Kondra (@KondraSudh67685) May 19, 2023 -
Layoffs: ఏవియేషన్ దిగ్గజం ఉద్యోగాల కోత; టీసీఎస్‌లో ఆ ఉద్యోగులకు ఎఫెక్ట్
న్యూఢిల్లీ: దిగ్గజ సంస్థలు సమా పలు కంపెనీలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. తాజాగా ఏవియేషన్ దిగ్గజం బోయింగ్ కూడా వేలాది ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. ఈ ఏడాది ఫైనాన్స్, హెచ్ఆర్ వర్టికల్స్‌లో 2,000 ఉద్యోగాలను తొలగించనుంది. వీరిలో ఎక్కువగా టీసీఎస్ అవుట్ సోర్స్ ద్యోగులు ప్రభావితం కానున్నారని తాజా నివేదికల ద్వారా తెలుస్తోంది. మొత్తం 5,800 కంపెనీల నుండి ఫైనాన్స్‌లో దాదాపు 1,500, హెచ్ఆర్లో 400 ఉద్యోగులను తొలగించనుంది. ఫైనాన్స్ , హెచ్ఆర్ సపోర్ట్ సేవలను తగ్గించిన నేపథ్యంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్టు బోయింగ్‌లో కమ్యూనికేషన్స్ సీనియర్ డైరెక్టర్ మైక్ ఫ్రైడ్మాన్ ఉటంకిస్తూ సీటెల్ టైమ్స్ నివేదించింది. అయితే కంపెనీ వాటిలో మూడింట ఒక వంతు ఉద్యోగాలను బెంగళూరులోని టీసీఎస్కి అవుట్సోర్స్ చేసిందని మీడియా నివేదించింది. ఇండియాలో బోయింగ్‌లో ఇప్పుడుదాదాపు 3,500 మంది డైరెక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అలాగే టీసీఎస్ సహా ఇతర సంస్థలకు సంబంధించి మరో 7వేల మంది ఉద్యోగులున్నారు. కాగా రానున్న కాలంలో వ్యయాలను తగ్గించుకునే క్రమంలో మరింత మందిని తొలగించాలని బోయింగ్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే 2022 ఏడాదిలో ఉద్యోగుల వార్షిక పనితీరు సమీక్షలను సిద్ధం చేయడానికి మేనేజర్లను కోరింది. అంచనాలను అందుకోవడంలో విఫలమైన సిబ్బందిలో 10 శాతం మందిని వర్గీకరించాలని కోరింది. -
ఆభరణాల మరమ్మతుల మార్కెట్‌గా భారత్
ముంబై: ఆభరణాల మరమ్మతుల (బాగు చేయడం/రీపేర్) సేవలకు ఔట్‌సోర్స్ మార్కెట్‌గా భారత్ అవతరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకురావాలని జెమ్స్ అండ్ జ్యుయలరీ ఎగుమతుల ప్రోత్సాహక మండలి (జీజేఈపీసీ) డిమాండ్ చేసింది. విధానపరమైన ప్రోత్సాహంతో అంతర్జాతీయ జ్యులయరీ రిపేర్ మార్కెట్లో భారత్ వాటాను 10–20 శాతానికి తీసుకెళ్లొచ్చని సూచించింది. 2026 నాటికి భారత మార్కెట్ వాటా 5.75 బిలియన్ డాలర్లకు (రూ.47,150 కోట్లు) చేరుకోవచ్చని అంచనా వేసింది. ‘‘ప్రస్తుతం ఈ మార్కెట్లో అంతర్జాతీయంగా భారత్ కేవలం 3 శాతం వాటా కలిగి ఉంది. కేవలం 196.8 మిలియన్ డాలర్ల మేర విక్రయాలు ఉన్నాయి. కానీ, ఇదే మార్కెట్లో అమెరికాకు 30 శాతం వాటా ఉంటే, చైనా 9.2 శాతం వాటా కలిగి ఉంది. చేతితో తయారు చేసే ఆభరణాల్లో భారత్‌కు సహజ సిద్ధంగా ఉన్న నైపుణ్యాల దృష్ట్యా జ్యుయలరీ రిపేర్ రంగంలోనూ భారత్ తన సత్తా చూపించగలదు. ఇందుకు సంబంధించి తగిన విధానాన్ని తీసుకొస్తే ప్రపంచ మార్కెట్లో మన వాటాను 10–20 శాతానికి తీసుకెళ్లొచ్చు. బిలియన్ డాలర్ల పెట్టుబడులతోపాటు ఎన్నో ఉపాధి అవకాశాలను ఇది తీసుకొస్తుంది’’అని జీజేఈపీసీ చైర్మన్ విపుల్‌షా తెలిపారు. మరమ్మతుల విధానాన్ని ప్రకటించినట్టయితే ప్రముఖ బ్రాండ్లు భారత్‌లో తమ సేవా కేంద్రాలను ఏర్పాటు చేస్తాయన్నారు. ప్రస్తుతం ఇవి ఎక్కువగా దుబాయి, టర్కీ, హాంగ్‌కాంగ్ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు చెప్పారు. అన్ని రకాల జ్యుయలరీని దిగుమతి చేసుకుని, మరమ్మతులు చేయాలంటే అందుకు దేశీయంగా ఆభరణాల తయారీ పరిశ్రమలో టెక్నాలజీ ఉన్నతీకరణ అవసరపడుతుందని జీజేఈపీసీ తెలిపింది. పెద్ద ఎగుమతిదారులు తమ కస్టమర్లకు సంబంధించిన మరమ్మతుల అవసరాలను తీర్చే అవకాశం లభిస్తుందని పేర్కొంది. -
గాంధీభవన్ వేదికగా 48 గంటల నిరాహార దీక్ష
-
చిరుద్యోగుల ఇళ్లల్లో చీకట్లే!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు... ఈరోజు ప్రభుత్వ శాఖలు పనిచేస్తున్నాయంటే దిగువస్థాయిలో వీరి సేవలు కీలకం! ప్రతి శాఖలోనూ వీరెంతో కీలకమయ్యారు. కానీ దీపావళి పండుగ వచ్చినా వారి కుటుంబాల్లో మాత్రం వెలుగులు పూయని జీవితం అయిపోయింది. వివిధ ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్న వీరికి మూడు నుంచి ఆర్నెళ్లుగా జీతాలు అందలేదు. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న వీరికి అప్పులు కూడా దొరకని పరిస్థితి. ఇప్పటికే తిత్లీ తుపాను చేసిన గాయంతో జిల్లాలో ప్రజలు నిరాశల్లో ఉన్నారు. పంటలు, తోటలు, పాడి, ఇళ్లు నష్టపోయారు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో చిరుద్యోగులూ ఇబ్బంది పడుతున్నారు. జీతాల బకాయిలతో వారిని ప్రభుత్వం కష్టాల్లో ముంచేసింది. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ సుమారుగా పదివేల మందికి పైగా ఉన్నారు. వీరంతా జీతాల కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం జీతాలు విడుదల చేయకపోవడంతో నిరాశ, నిçస్పృహలతో కొట్టుమిట్టాడుతున్నారు. ♦ ప్రధాన ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా జీతాలు విడుదల కాని దుస్థితి ఏర్పడింది. ♦ రిమ్స్‌లో సెక్యూరిటీ గార్డులు, ఎస్టీపీ ప్లాంట్ సిబ్బంది, ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ పారామెడికల్ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, ఇతర సిబ్బందికిమూడు నెలలుగా జీతాలు లేవు. ♦ రాజీవ్ విద్యామిషన్‌లో కాంట్రాక్ట్ విధానంలో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు విడుదల కాలేదు. ♦ రాజీవ్ విద్యామిషన్ పరిధిలో ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులకు మూడు నెలలుగా జీతాలు రాలేదు. అదే పాఠశాలలో వివిధ చిరుద్యోగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఐదు నెలలుగా జీతాలు మంజూరు చేయలేదు. ♦ వైద్య ఆరోగ్యశాఖ విభాగంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ఆర్సీహెచ్–1, ఆర్సీహెచ్–2, ఆర్సీహెచ్–3లుగా పనిచేస్తున్న ఉద్యోగులకు మూడు నెలలుగా బకాయిలు ఉన్నాయి. ఎన్ఆర్హెచ్ఎం ఉద్యోగులకు, డేటాఎంట్రీ ఆపరేటర్లకు, ఆరోగ్యమిత్రలకు ఆరు నెలలుగా జీతాలు విడుదల కాలేదు. ♦ సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖల్లో ఔట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న కుక్, హమాటీ, వాచ్మన్లకు గడచిన మూడు నెలలుగా జీతాలు అందలేదు. ♦ విద్యాశాఖలో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఎంఆర్సీల్లో పనిచేస్తున్న సిబ్బందికి మూడు నెలలుగా జీతాలు లేవు. ♦ రెవెన్యూ విభాగంలో తహసీల్దార్ కార్యాలయాలు, ఆర్డీవో కార్యాలయాలు, కలెక్టరేట్, ప్రత్యేక భూసేకరణ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఎటెండర్లు, రికార్డు అసిస్టెంట్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లుకు మూడు నెలలుగా జీతాలు బకాయి ఉంది. ♦ నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, పారిశుద్ధ్య కార్మికులకు, పర్యవేక్షకులకు మూడు నెలలుగా జీతాలు లేక అవస్థలు పడుతున్నారు. ♦ పై శాఖలే కాకుండా పశుసంవర్ధకశాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనం, ఏపీఎంఐపీ తదితర ప్రభుత్వ విభాగాలలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి జీతాలు బకాయిలు ఉన్నాయి. -
వెట్టిచాకిరీ చేస్తున్నాం సార్..
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు)/కోవెలకుంట్ల: ఏళ్ల తరబడి ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్నామని, వెట్టిచాకిరీ నుంచి తమకు విముక్తి కల్పించాలని వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలల కాంట్రాక్ట్/అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు వేడుకున్నారు. చాలీ చాలని జీతాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు. అర్హులైన వారందరినీ రెగ్యులర్ చేయించాలని కోరారు. ఇందుకు వైఎస్ జగన్ స్పందిస్తూ త్వరలోనే మంచి కాలం వస్తుందని భరోసా ఇచ్చారు. -
‘విద్యుత్’ సమ్మె విరమణ
♦ ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ నేతలతో మంత్రి జగదీశ్‌రెడ్డి చర్చలు సఫలం ♦ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాలకు ప్రభుత్వం సుముఖం ♦ మూడు నెలల్లో డిమాండ్ల పరిష్కారానికి హామీ సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వమే నేరుగా తమకు జీతాలు చెల్లించాలన్న ఔట్సోర్సింగ్ విద్యుత్ ఉద్యోగుల డిమాండ్‌ను మూడు నెలల్లో పరిష్కరిస్తామని విద్యుత్‌శాఖ మంత్రి జి. జగదీశ్‌రెడ్డి హామీ ఇచ్చారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా పనిచేస్తున్న 1,100 మంది కాంట్రాక్టు జూనియర్ లైన్మెన్లను వెంటనే క్రమబద్ధీకరిస్తామన్నారు. దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న 34 డిమాండ్లను పరిష్కరించకుంటే బుధవారం నుంచి సమ్మెకు దిగుతామని తెలంగాణ విద్యుత్ ట్రేడ్ యూనియన్ల ఫ్రంట్ ప్రకటించిన నేపథ్యంలో జగదీశ్‌రెడ్డి మంగళవారం సచివాలయంలో ఫ్రంట్ నేతలతో సుదీర్ఘ చర్చలు జరిపారు. ఫ్రంట్ నేతలను సమ్మె విరమణకు ఒప్పించారు. అనంతరం ట్రాన్స్‌కో, జెన్కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి, ట్రేడ్ యూనియన్ల నేతలతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల దోపిడీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేయడంతో మధ్య దళారి వ్యవస్థ లేకుండా మూడు నెలల్లో శాశ్వత పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చామని జగదీశ్‌రెడ్డి తెలిపారు. అలాగే విధి నిర్వహణలో ప్రమాదానికి గురై మృత్యువాతపడే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి చెల్లించే ఎక్స్‌గ్రేషియాను ప్రస్తుతమున్న రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచేందుకు (గతంలో రూ. 2 లక్షలుగా ఉన్న ఎక్స్‌గ్రేషియాను తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం రూ. 5 లక్షలకు పెంచింది. దీన్ని రూ. 25 లక్షలకు పెంచాలని ట్రేడ్ యూనియన్లు డిమాండ్ చేశాయి) అంగీకరించామన్నారు. అలాగే విధి నిర్వహణలో గాయపడే ఔట్ సోర్సింగ్ సిబ్బందికి పూర్తి వైద్య ఖర్చులను విద్యుత్ సంస్థలే భరిస్తాయని హామీ ఇచ్చారు. ఔట్ సోర్సింగ్ కార్మికుల బీమాను రూ. 10 లక్షలకు పెంచేందుకు చట్టపరమైన అడ్డంకులున్నాయని, వాటిని అధిగమించి ఈ డిమాండ్‌ను సైతం నెరవేరుస్తామని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. విద్యుత్ శాఖలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు అదనపు పోస్టులను మంజూరు చేసి సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గిస్తామన్నారు. ప్రభుత్వోద్యోగుల కోసం వైద్యశాఖ త్వరలో ప్రకటించనున్న నూతన పాలసీ అమల్లోకి వచ్చాక విద్యుత్ ఉద్యోగులకు సైతం వర్తింపజేస్తామన్నారు. రెండు వేర్వేరు మాస్టర్ పే స్కేళ్ల అమలు వల్ల నష్టపోతున్న కొందరు విద్యుత్ ఉద్యోగులకు రాబోయే పీఆర్సీ నుంచి ఒకే మాస్టర్ పే స్కేల్‌ను అమలు చేస్తామన్నారు. విద్యుత్ ఉద్యోగుల పెన్షన్ పథకాన్ని ఈపీఎఫ్ నుంచి జీపీఎఫ్‌కు మార్చే అంశాన్ని పరిశీలిస్తామని... దీనివల్ల పడే అదనపు భారాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఉద్యోగులకు ట్రస్ట్ ద్వారా పెన్షన్‌ను చెల్లించేందుకు అంగీకరించామన్నారు. విద్యుత్ ట్రేడ్ యూనియన్లు తొందరపడి సమ్మె నోటిసు ఇచ్చినప్పటికీ సానుభూతితో స్పందించిన సీఎం కేసీఆర్ ఏళ్ల తరబడిగా అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు ఒప్పుకున్నారని జగదీశ్‌రెడ్డి తెలిపారు. విద్యుత్‌శాఖ పనితీరుపై ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులను తగ్గించుకోవాలని ఫ్రంట్ నేతలకు ఆయన సూచించారు. ప్రభుత్వానికి కృతజ్ఞతలు యూనియన్ల ఫ్రంట్ నేతలు మంత్రి జగదీశ్‌రెడ్డితో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, 3 నెలల్లో సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇవ్వడంతో సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నామని ట్రేడ్ యూనియన్ల ఫ్రం ట్ చైర్మన్, కన్వీనర్లు పద్మారెడ్డి, శ్రీధర్ తొలుత ప్రకటించారు. అయితే వెంటనే కలగజేసుకున్న జగదీశ్‌రెడ్డి సమ్మెను విరమిస్తున్నట్లు ప్రకటించాలని కోరగా ‘ప్రస్తుతానికి సమ్మెను విరమిస్తున్నాం’ అని వారు ప్రకటించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నేరుగా జీతాల చెల్లింపుతోపాటు 22 వేల అదనపు పోస్టుల మంజూరు తదితర ప్రధాన డిమాండ్లను పరిష్కరించేందుకు అంగీకరించినందుకు మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు సీఎండీలకు కృతజ్ఞతలు తెలిపారు. -
‘స్మార్ట్’గా దోచేద్దాం!
విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు సర్కారు సిద్ధం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య నేత ఓ ప్రైవేటు కంపెనీతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. సదరు సంస్థకు కోట్ల రూపాయలు కట్టబెట్టడం, కమీషన్ల రూపంలో భారీయెత్తున ముడుపులు బొక్కేయడమే దీని వెనుక అసలు రహస్యమనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే జరిగితే రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌ల పరిధిలో మీటర్ రీడింగ్ తీసే దాదాపు 4,500 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉంది. వాణిజ్య, పారిశ్రామిక విద్యుత్ కనెక్షన్ల రీడింగ్‌లో అవకతవకలు, క్షేత్రస్థాయి సిబ్బంది యజమానులతో కుమ్మక్కై తక్కువ రీడింగ్ నమోదు చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో.. అవకతవకలు అరికట్టాలంటే స్మార్ట్ మీటర్లు అవసరమని అధికారులు నివేదించారు. 500 యూనిట్లు దాటుతున్న వినియోగదారులకు స్మార్ట్ మీటర్లు బిగించాలని డిస్కమ్‌లు సిఫారసు చేశాయి. వాణిజ్య, పారిశ్రామిక కనెక్షన్లే ఈ కేటగిరీలో ఉన్నాయి. ఇలాంటి వినియోగదారులు కేవలం 83,110 మంది మాత్రమే ఉంటారు. అయితే ముడుపులపై కన్నేసిన ముఖ్యనేత గృహ వినియోగానికీ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కన్నీళ్లే
క్రమబద్ధీకరణ సాధ్యం కాదన్న రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, విజయవాడ బ్యూరో: క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న 30 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది. ఔట్సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ(రెగ్యులరైజ్) సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. అయితే, వేతనాలను మాత్రం నెలకు రూ.2,500 పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మంగళవారం విజయవాడలో జరిగిం ది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఆర్థికమంత్రి యనమల మీడియాకు తెలిపారు. పెరిగిన వేతనాలు జూన్‌లో అందుతాయి రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30 వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులు 9 కేటగిరీల్లో ఉన్నారని, వీరందరినీ 3 కేటగిరీలుగా విభజించి, వేతనాలు పెంచుతున్నట్లు యనమల తెలిపారు. రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వివిధ కేటగిరీల్లో పనిచేసే ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం వేతనాల కింద ఏడాదికి రూ.375 కోట్లు చెల్లిస్తున్నామని, పెంపువల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా అదనంగా 90 కోట్ల భారం పడుతుందన్నారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఏప్రిల్, మే మాసాలతో కలిపి జూన్‌లో ఉద్యోగులకు అందుతాయన్నారు. 5%కంటే ఎక్కువ మినహాయించుకోవద్దు రాష్ట్రంలో 20,506 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా, ఇందులో 1,003 మంది రెగ్యులరైజ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి యనమల చెప్పారు. 1994 యాక్టు ప్రకారం సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అన్ని అర్హతలున్న వారికే ఈ అవకాశం లభిస్తుందన్నారు. మెడికల్ డిపార్ట్మెంట్లో 14,776, హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగంలో 1,000, స్కూల్ ఎడ్యుకేషన్, శిశు సంక్షేమ తదితర శాఖల్లో మరో 4 వేల మంది వరకు కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారని తెలిపారు. వీరిలో 1,003 మందిని సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టించి, క్రమబద్ధీకరించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిందన్నారు. మిగతా పోస్టులపై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమై చర్చించాల్సి ఉందన్నారు.సబ్ కమిటీ నిర్ణయాలను ప్రభుత్వానికి సిఫార్సులుగా నివేదిస్తున్నామని వివరించారు. -
సర్కారుకు పట్టని ‘ఔట్ సోర్సింగ్’ గోడు
పదో పీఆర్సీ అమలుకు వినతి సాక్షి, హైదరాబాద్: సచివాలయం నుంచి కిందిస్థాయి కార్యాలయాల వరకు రకరకాల పోస్టుల్లో సేవలందిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వం ఇస్తున్న అరకొర వేతనాలు చాలక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సూటు బూటు ధరించే కన్సల్టెంట్లకు నెలకు రూ.లక్షల్లో చెల్లిస్తున్న రాష్ట్ర సర్కారు ఔట్ సోర్సింగ్ సిబ్బందిపై మాత్రం కనికరం చూపడం లేదు. రాష్ట్రంలో అన్ని శాఖల్లో కలిపి 60 వేల మంది ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరు రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నారు. పని వేళల్లో కూడా మార్పు లేదు. కానీ, రెగ్యులర్ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది వేతనాల మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ప్రభుత్వ అటెండర్, ప్రభుత్వ డ్రైవర్, ప్రభుత్వ డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు వేతనాలు భారీగా ఉంటాయి. ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే అటెండర్, డ్రైవర్, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు మాత్రం ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే వేతనాల్లో సగం కూడా రాకపోవడం గమనార్హం. నాలుగో తరగతి ఉద్యోగాలను భర్తీ చేయకుండా గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిషేధం విధించింది. ఔట్ సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చింది. అప్పటి నుంచి డ్రైవర్, అటెండర్లను ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఈ విధానంలో పనిచేసే అటెండర్‌కు నెలకు రూ.7,500, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు నెలకు రూ.9,500 ఇస్తున్నారు. ఇదే పనిని ప్రభుత్వ ఉద్యోగులు చేస్తే నెలకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకు ఇస్తున్నారు. తొమ్మిదో పీఆర్సీ లాస్ట్ గ్రేడ్ పే సిఫార్సులను ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం అమలు చేసింది. పదో పీఆర్సీ లాస్ట్ గ్రేడ్ పేగా రూ.14,860ను సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే అటెండర్లకు నెలకు రూ.14,860, డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్లకు రూ.18,400 పెంచాల్సి ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ సిఫార్సులపై దృష్టి సారించడం లేదు. సచివాలయంలో ఒకచోటు నుంచి మరో చోటుకి ఫైళ్లు కానీ, కాగితం కానీ కదలాంటే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుండాలి. వారు రాకపోతే ఫైళ్లు కదలవు. ఉన్నతాధికారుల వాహనాల డ్రైవర్లు ఔట్ సోర్సింగ్ విధానంలోనే పనిచేస్తున్నారు. వారు లేకపోతే అధికారులు సచివాలయానికి రాలేరు. జీవన వ్యయం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో తమ వేతనాలను వెంటనే పెంచాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కోరుతున్నారు. -
వారికేనా వేతనాల పెంపు?
జీవో 224, 225లపై ఔట్సోర్సింగ్ ఉద్యోగుల కలవరం కేవలం పారిశుధ్య కార్మికులకే పెరిగిన వేతనం సమ్మె చేసినా ఇతరులకు దక్కని ప్రయోజనం విశాఖపట్నం సిటీ : ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంచుతూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 224, 225లపై ఉద్యోగుల్లో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 224 జీవో ప్రకారం కేవలం పారిశుధ్య కార్మికుల జీతాలను మాత్రమే పెంచుతున్నట్టు స్పష్టంగా పేర్కొన్నారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లు కూడా ఆ 15 రోజులు సమ్మె చేసినా, వారికి జీతాలు పెంచుతున్నట్టు జీవోలో పేర్కొనలేదు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులంతా సమ్మెకు దిగితే కేవలం పారిశుధ్య కార్మికులకే జీతాలు పెంచడాన్ని తప్పుబడుతున్నారు. తాజా జీవోల వల్ల జీవీఎంసీ ప్రజారోగ్య శాఖలోని 5,019 మంది పారిశుధ్య కార్మికులకురూ. 8,300 నుంచి రూ. 11 వేలకు జీతాలు పెంచారు. ఇదే శాఖలోని ల్యాబ్ టెక్నీషియన్లు, ఎన్‌ఎన్‌ఎంలు, యూసీడీ, నీటి సరఫరా విభాగంలో టెక్నీషియన్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఇలా పలు శాఖల్లో పనిచేస్తున్న వారికి రూపాయి కూడా పెరగకపోవడంతో ఉసూరుమంటున్నారు. జీవీఎంసీతో పాటు వుడాలో పని చేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లు, అటెండర్లు, స్వీపర్లు, పార్కుల నిర్వాహకులున్నారు. వారికి కూడా ఈ జీవోల వల్ల ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో ఆయా వర్గాలు తీవ్ర నిరాశ చెందుతున్నాయి. పారిశుధ్య కార్మికులకు కూడా ఎప్పటి నుంచి జీతాలు ఇవ్వాలో ఎక్కడా ప్రకటించకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. -
ఇరుక్కుపోయారు!
* ఆందోళనలో ఔట్సోర్సింగ్ ఉద్యోగులు * హౌసింగ్ నుంచి ఇరిగేషన్‌కు బదలాయింపు * పని పొంతన లేదు.. పనికి వేతనం లేదు.. * ఇబ్బందిని అధిగమించి మిషన్‌కాకతీయ పనులు * ఐదు నెలలు గడుస్తున్నా అందని వేతనాలు సాక్షి, మంచిర్యాల : మిషన్ కాకతీయ.. ఇప్పటి వరకు ఎలాంటి సత్ఫలితాలిచ్చిందో తెలియదు.. రైతులకు ఎలాంటి మేలు చేకూర్చిందో దేవుడే ఎరుగు. కానీ.. జిల్లాలో 49 మంది కుటుంబాలను మాత్రం అయోమయంలో నెట్టేసింది. ఈ పథకం పుణ్యమా అని ఐదు నెలల క్రితమే గృహనిర్మాణ శాఖ నుంచి మైనర్ ఇరిగేషన్‌కు బదిలీ అయిన ఔట్ సోర్సింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లు కష్టాల కడలిలో కొట్టుమిట్టాడుతున్నారు. గృహనిర్మాణ శాఖలో ని ర్వర్తించిన విధులకు ప్రస్తుతం నిర్వహిస్తున్న విధులకు పొంతన అసలే లేదు. అనేక కష్టాలకోర్చి మి షన్ కాకతీయ పనుల్ని పర్యవేక్షిస్తున్నా పాలకులు మాత్రం వీరిపై కనికరం చూపడం లేదు. ఐదు నె లలుగా వేతనాలు లేక.. అసలు అవి వస్తాయో రా వోననే బెంగతో విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి వే తనాల విషయంలో సంబంధిత ఏజెన్సీ పట్టింపులేకుండా వ్యవహరించడం.. అధికారులూ స్పష్టత ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. మొదటి 32.. తర్వాత 68 మంది.. ఇందిరమ్మ మొదటి విడతలో భాగంగా జిల్లాకు మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను పర్యవేక్షించేం దుకు 2007-08లో అప్పటి ప్రభుత్వం ఔట్సోర్సింగ్ పద్ధతిలో తొలుత 32 మంది వర్క్ఇన్స్పెక్టర్లను నియమించింది. క్రమంగా జిల్లాకు ఎక్కువ ఇళ్లు మంజూరు కావడం.. పనులు పర్యవేక్షించే వా రు కొరతగా ఉండడంతో వివిధ సందర్భాల్లో మొ త్తం 68 మంది వర్క్ఇన్స్పెక్టర్లను తీసుకుంది. పనిభారాన్ని బట్టి పలు మండలాలకు అధికారులు ముగ్గురు చొప్పున బాధ్యతలు అప్పగించారు. తొ లుత సికింద్రాబాద్‌కు చెందిన శక్తి అనే ఏజెన్సీకి కాంట్రాక్టు అప్పగించిన ప్రభుత్వం రెండేళ్ల క్రితమే ఎన్కే ఎంటర్‌ప్రైజెస్‌కు వీరి బాధ్యతలు ఇచ్చారు. ఆయా సంస్థలు ప్రతి నెలా రూ.8,500 వేతనం ఖరారు చేశాయి. అందులో 11 శాతం పీఎఫ్ కోత విధించి.. రూ.7,345 చెల్లిస్తూ వచ్చాయి. కష్టాలు మొదలయ్యాయి ఇలా.. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్ల మంజూ రులో అవకతవకలు జరిగాయి. ప్రభుత్వం ఇంది రమ్మ ఇళ్ల నిర్మాణాల మంజూరుకు బ్రేక్ వేసింది. ఇదే క్రమంలో అప్పటి వరకు హౌసింగ్‌లో కొనసాగుతున్న వర్క్ ఇన్స్పెక్టర్లకు బాధ్యతలు లేకపోవడంతో.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీ య పనుల్లో వీరి సేవలను వినియోగించుకోవాలని నిర్ణయం తీసుకుంది. వీరిని ఇరిగేషన్ శాఖకు బదిలీ చేస్తూ.. ఈ ఏడాది ఏప్రిల్ 9న ఉత్తర్వులు జారీ చేసింది. రెండు మూడ్రోజుల్లో నిర్మల్‌లోని ఎస్ఈ ఇరిగేషన్ కార్యాలయానికి వెళ్లి మిషన్‌కాకతీయ బాధ్యతలు స్వీకరించాలని ఆదేశించింది. వీ రిలో 49 మంది మాత్రమే విధుల్లో చేరారు. మే 20 నుంచి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఇరిగేషన్ ఏఈ ల కింద బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే.. గ తంలో వారు చేసిన పనికి ప్రస్తుతం చేయాల్సిన పనికి పొంతన లేకున్నా ఔట్సోర్సింగ్ ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్ వర్క్స్‌పై అవగాహన ఉన్న ఉద్యోగులు పలుచోట్ల ఏఈల స్థాయి లో పనులు చేస్తున్నారు. అయినా.. వీరికి వేతనాల విషయంలో ఇంతవరకు స్పష్టత ఇవ్వలేదు. ఈ విషయమై ‘సాక్షి’ మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్ భగవంతరావు వివరణ కోసం ప్రయత్నించగా ఆయన ఫోన్లో అందుబాటులో లేరు. -
జీతాలు ఇస్తారా.. చావమంటారా..!
నీటి ట్యాంక్ ఎక్కిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఏడు నెలలుగా ఇవ్వకుంటే ఎలా బతకాలి? రెండు గంటల పాటు జిల్లా ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత డీఎస్పీ చొరవతో ఆందోళన విరమణ ప్రొద్దుటూరు క్రైం: ‘మీరైతే నెల ఒకటో తారీఖున జీతాలు తీసుకుంటారే.. చిన్న ఉద్యోగస్తులం.. పైగా మాలో కొంత మందికి ఉద్యోగాలు పీకేశారు.. ఏడు నెలలుగా జీతాలు రాకుంటే ఎలా బతకాలి.. ఇన్ని రోజుల నుంచి ఆందోళన చేస్తున్నా మా మొర ఆలకించరా.. బాడుగ ఇవ్వలేదని ఇంటికి తాళం వేసి బయటికి గెంటేస్తున్నారు..ఇంతటి అవమానాల మధ్య మేం ఎలా బతకాలి.. ఇంతటి మానసిక వేదనను అనుభవిస్తూ బతకడం ఎందుకు.. ఈ బతుకు బతకడం కన్నా చావడమే మేలు కదా’.. అని జిల్లా ఆస్పత్రిలో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వాపోయారు. వీరంతా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆస్పత్రిలో ఉన్న నీటి ట్యాంక్ ఎక్కారు. ఆస్పత్రి ప్రాంగణమంతా పెద్ద ఎత్తున కేకలు.. వద్దూ వద్దూ దిగండి అంటూ కింద ఉన్న వారంతా అరవ సాగారు. అయితే ఉద్యోగులు మాత్రం నేరుగా ట్యాంక్ చివరకు వెళ్లారు. ఇదంతా సోమవారం ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలో జరిగింది. విషయం తెలియడంతో డీఎస్పీ పూజిత నీలం హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 నెలలుగా జీతాలు ఇవ్వకుంటే ఎలా బతకాలి మేడం.. అప్పటికే ఆస్పత్రి సూపరింటెండెంట్ బుసిరెడ్డి, ఆర్ఎంఓ డేవిడ్ సెల్వరాజ్‌లు ట్యాంక్ వద్దకు చేరుకొని ఆందోళన విరమించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న జీతాలు ఇవ్వడం అనేది మా చేతుల్లో లేనిదని వారు చెప్పుకొచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలానే ఉందని అధికారులు చెప్పారు. అయినప్పటికీ ట్యాంక్‌పై ఉన్న యూనియన్ నాయకులు, ఉద్యోగులు వినిపించుకోలేదు. డీఎస్పీ పూజిత నీలం సంఘటనా స్థలానికి వచ్చారు. జీతాలు ఇవ్వలేదని ఇలా ట్యాంక్ ఎక్కి బెదరించడం మంచిది కాదన్నారు. మీకేదైనా అన్యాయం జరిగిందనిపిస్తే ఉన్నతాధికారులకు తెలపాలన్నారు. ఇప్పటికే అనేక సార్లు అధికారులకు విన్నవించుకున్నాం, ధర్నాలు చేశాం, నిరాహారదీక్షలు చేసినా ఫలితం లేదని ఉద్యోగులు డీఎస్పీతో అన్నారు. ఇక చేసేదేమిలేక చివరి ప్రయత్నంగా ఇలా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు జీతాలు రాకుంటే ఊరుకుంటారా- జయశ్రీ ఒక్క నెల జీతం ఇవ్వకుంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఊరుకుంటారా అని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అన్నారు. చాలీ చాలని జీతంతో పని చేస్తున్న వీళ్లకి ఏడు నెలల నుంచి జీతం రాకుంటే ఎలా బతుకుతారని ఆమె పేర్కొన్నారు. 106 మందికి జూలై నుంచి జీతాలు రావాల్సి ఉందని, వీరితో వెట్టి చాకిరి చేయించుకున్న అధికారులకు ఆ మాత్రం బాధ్యత లేదా అని ప్రశ్నించారు. ప్రస్తుతం పని చేస్తున్న వారితో పాటు తొలగించిన 58 మందికి పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. డీఎస్పీ చొరవతో ఆందోళన విరమణ అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన డీసీహెచ్‌ఎస్‌లతో డీఎస్పీ పూజిత నీలం ఫోన్లో మాట్లాడారు. ఈ జిల్లాల్లో కూడా ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ జీతాలు మంజూరు కాలేదన్నారు. ఇదే విషయాన్ని డీఎస్పీ యూనియన్ నాయకులకు వివరించారు. తర్వాత ఏపీ వైద్య విధాన పరిషత్ కమిషనర్ కనకదుర్గతో మాట్లాడారు. మూడు రోజుల క్రితమే ఫైల్‌పై సంతకం చేశానని, ఆర్థిక శాఖ అనుమతి అనంతరం జీతాలు వస్తాయని కమిషనర్ తెలిపారు. ఇదే విషయాన్ని డీఎస్పీ ఆందోళన చేస్తున్న వారితో చెప్పారు. ఆమె హామీ మేరకు ఆందోళన విరమిస్తున్నట్లు ఉద్యోగులు ప్రకటించారు. సీఐ మహేశ్వరరెడ్డి, ఎస్ఐలు వెంకటేశ్వర్లు, నారాయణయాదవ్, సిబ్బంది ఆస్పత్రి ప్రాంగణంలో పరిస్థితిని సమీక్షించారు. సీఐటీయూ నాయకుడు రామ్మోహన్‌రెడ్డి, రాజు, లత, ప్రసాద్, కృష్ణాలతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకుడు ధనుంజయరెడ్డి, సీఐటీ యూ నాయకులు అన్వేష్, గురుస్వామితోపాటు పలువురు నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
జాబు ఇస్తామని ఉన్న వారినే తొలగిస్తారా?
అనంతపురం అగ్రికల్చర్ : ‘బాబు వస్తే జాబు’ అంటూ ఎన్నికల ముందు నిరుద్యోగ వర్గాల్లో లేనిపోని ఆశలు కల్పించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి రాగానే ఉన్నవారినే తొలగించాలని కుట్ర చేస్తున్నారని ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ధ్వజమెత్తారు. ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలనే డిమాండ్‌తో సోమవారం స్థానిక ఉద్యానశాఖ కార్యాలయం ఎదుట ఉద్యాన సిబ్బంది, ఏపీఎంఐపీలో పనిచేస్తున్న సిబ్బంది ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అంటూ ఎన్నికల ముందు గ్రామ గ్రామాన గోడరాతలతో పాటు ఉపన్యాసాలతో నిరుద్యోగ వర్గాలు, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ సిబ్బందిల్లో ఆశలు రేకెత్తించారని వారు మండిపడ్డారు. అధికారం చేపట్టగానే అన్నీ మరచిపోవడం దారుణమన్నారు. కొత్తవి అటుంచితే ఉన్నవాటినే తొలగిం చడానికి ప్రయత్నించడం సమంజసం కాదన్నారు. 11 సంవత్సరాలుగా తక్కువ వేతనాలతోనే పనిచేస్తున్నామని, ఏదో ఒక రోజు శాశ్వత ఉద్యోగులుగా గుర్తిస్తారనే ఆశతో నెట్టుకొస్తున్నామన్నారు. ఉన్నఫలంగా ఇప్పుడు తొలగించే ప్రయత్నాలు చేస్తే తమ కుటుంబాల గతి ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించేదాకా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అనంతరం అక్కడి నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. -
ప్రైవేట్ ఉద్యోగులూ అర్హులే..
భువనగిరి :ఆహారభద్రతా (రేషన్) కార్డులకు ప్రైవేటు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అర్హులేనని పౌర సరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. శాసనసభలో జరిగిన చర్చలు, సభ్యులనుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో ప్రభుత్వం నిబంధనలను కొంతమేర సడలించింది. ఈ మేరకు జిల్లా యంత్రాంగానికి అదివారం ఈ అదేశాలు అందాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఏడాదికి రూ.లక్షన్నర, పట్టణ ప్రాం తాల్లో రూ.2లక్షల అదాయ పరిమితినే ప్రాతిపదికగా తీసుకొని అర్హులకు కార్డులు జారీ చేయాలని అ శాఖ అధికారులు సూచించారు. అక్టోబర్ 10వ తేదీ వరకు జిల్లాలో 10,67,004 మంది ఆహార భద్రతాకార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే దర ఖాస్తుల పరిశీలనకు ఉన్న నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఒకే ఇంట్లో రెండు, మూడు కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే వాటిపై పరిశీలనాధికారి పరిశీలించి సంతృప్తి చెందితే వారికి కార్డులు జారీ చేయవచ్చని స్పష్టం చేశారు. ఇప్పటికే పింఛన్ల దరఖాస్తులో ఆహార భద్రతాకార్డుల పరిశీలన చేశారు. మారిన నిబంధనల నేపథ్యంలో గతంలో పరిశీలన జరిపిన దరఖాస్తులకు కొత్త పరిమితుల మేరకు పునఃపరిశీలన చేయాల్సి ఉంటుంది. ఆహార భద్రతా కార్డుల జారీలో ఎలాంటి అవకతవకలు జరిగినా, అర్హులకు అందకున్నా, అనర్హులకు అందినా సంబంధిత అధికారులపై చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకోసం పకడ్బందీగా విచారణ జరపాలని కిందిస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ అయ్యాయి. కార్డులజారీపై వినతుల స్వీకరణకు గ్రీవెన్స్ సెల్ సీనియర్ అధికారులతో బృందాలు ఏర్పాటు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. వచ్చే నెలలో నూతనకార్డులు జారీ చేసే అవకాశం ఉంది. 16 నుంచి 30 కిలోలకు పెరగనున్న బియ్యం ఆహార భద్రతాకార్డు కింద యూనిట్‌కు బియ్యం కోటా పెరగనుంది. ఇప్పటివరకు రేషన్‌కార్డులో యూనిట్‌కు నాలుగు కిలోల చొప్పున బియ్యం సరఫరా చేసేవారు. గరిష్టంగా 16 కిలోలు ఇచ్చేవారు. ఇప్పుడు ఆహార భద్రత కార్డు కింద ఒక్కో సభ్యుడికి(యూనిట్) ఆరు కిలోల చొప్పున బియ్యం ఇవ్వనున్నారు. కార్డుకు ఐదు యూనిట్లు వరకే పరిమితి చేశారు. కార్డుకు గరిష్టంగా 30 కిలోలు అందజేస్తారు. అంత్యోదయ కార్డులకు గతంలో ఇచ్చినట్టుగానే 3 కిలోల బియ్యం ఇస్తారు. కిలో బియ్యం రూపాయికే సరఫరా చేస్తారు. -
పెట్టుబడిదారుల ముద్దుబిడ్డ మోడీ
ఖమ్మం మయూరిసెంటర్: పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనం కోసమే మోడీ ప్రభుత్వం పనిచేస్తోందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధాభాస్కర్ విమర్శించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసమే ప్రధాని తహతహలాడుతున్నారన్నారు. తెలంగాణ మావల్లే అభివృద్ధి చెందుతుందన్న కేసీఆర్ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిందేమీ లేదన్నారు. ఎన్నికలకు ముందు కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులరైజేషన్ చేస్తామన్న టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మాటమార్చిందన్నారు. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సాయిబాబా అధ్యక్షతన ఖమ్మం పెవిలియన్‌గ్రౌండ్‌లో శుక్రవారం జరిగిన రాష్ట్ర మహాసభలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసి, ఔట్‌సోర్పింగ్ ఉద్యోగులను చేయమనడం కేసీఆర్‌కు తగదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసేందుకు వేసిన కమిటీ ఎప్పటికి నివేదిక ఇస్తుందో తెలియదన్నారు. అంగన్వాడీలు ప్రభుత్వాలపై పోరాటాలు చేస్తూనే ఉన్నా స్పందించడం లేదన్నారు. ఏ రంగంలో పనిచేసే వారికైనా రూ.15వేల కనీస వేతనం ఉండాలని కార్మికవర్గం పోరాటం చేస్తోందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో లక్షన్నర మంది మధ్యాహ్న భోజన వర్కర్లు ఉన్నారన్నారు. తెలంగాణలో 70 వేల మంది వరకు పనిచేస్తున్నారని తెలిపారు. వీర్ని తొలగించాలనే యో చనలో ప్రభుత్వం ఉందన్నారు. పొరుగు రా ష్ట్రాల్లో ఓ జాబ్‌కార్డు ఉంది..మనరాష్ట్రంలో ఉ ద్యోగం ఎప్పుడు పోతుందో తెలియదన్నారు. వరంగల్‌లో ఇనుపఖనిజాలు ఉన్నాయని 1953 నుంచి చెబుతున్నా ఇప్పటి వరకు వా టిని వెలికి తీసిన దాఖలాలు లేవన్నారు. ఆ దిలాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాలో పత్తి బాగా పండుతుందని తెలిసినా ఏ ప్రభుత్వ మూ టెక్స్టైల్స్ ఇండస్ట్రీని నెలకొల్పదన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వాలపై ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సీఐటీయూ జాతీయ కార్యదర్శి హేమలత అన్నారు. ధ రలు తగ్గిస్తారని, ఉద్యోగ అవకాశాలు మె రుగుపడుతాయని, లంచగొండి తనాన్ని రూపుమాపుతారని ఆశాపడ్డారని తెలిపా రు. ప్రభుత్వాలు ఏర్పడి వందరోజులైనా ఆ దిశగా చేసిన ప్రయత్నాలు ఏవీ లేవన్నారు. ఎన్నికలకుముందు ఏమి చెప్పి అధికారంలోకి వచ్చారో ఆ వాగ్దానాలకు కట్టుబడి ఉంటాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలను కోరుతున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సాయిబాబా పేర్కొన్నారు. అసంఘిత రంగంలో ఉన్న వారికి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి మాటలు, పనితీరుపై సందేహాలను ఆయనే నివృత్తి చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్.వీరయ్య కోరారు. ఇటీవల జరిపిన సమగ్ర కుటుంబ సర్వేపై పేదలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం వేస్తున్న అడుగులు అనుమానాస్పదంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో దళితులకు మూడు ఎకరాల భూమి అంటూ ఆగస్టు 15న పట్టాలు ఇచ్చారు కానీ నేటికీ భూమి అప్పగించలేదన్నారు. సింగరేణిని అద్భుత సంస్థగా అభివృద్ధి చేస్తామని, సింగరేణికి చెందిన కేంద్ర వాటాలు కొనుగోలు చేస్తామని కేసీఆర్ గతంలో ప్రకటించారన్నారు. ఆర్టీసీ, విద్యుత్ రంగాల్లో వస్తున్న పరిణామాలు సింగరేణి గురించి ఆందోళన పడేలా చేస్తున్నాయన్నారు. జిల్లాలోని 5,500 మంది ఆశావర్కర్లకు 18 నెలల నుంచి వేతనాలు ఇవ్వడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య సభ దృష్టికి తీసుకొచ్చారు. జూన్ 5న భద్రాచలం వచ్చిన ఉప ముఖ్యమంత్రి రాజయ్య దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లగా వెంటనే ఇస్తామని వాగ్దానం చేసి నేటికీ దాన్ని నెరవేర్చలేదన్నారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్యాణం వెంకటేశ్వరరావు వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ సభలో రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజారావు, రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, జిల్లా అధ్యక్షుడు ఎ.జె.రమేష్, ఆహ్వానసంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ యర్రా శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షులు చుక్కా రామయ్య, ఎస్.ఎన్.రెడ్డి, భిక్షమయ్య, రాష్ట్ర కార్యదర్శులు భూపాల్, వెంకటేష్, వీరారెడ్డి, ఎస్.రమ, చుక్కయ్య, వంగూరి రాములు, ఎండి.అబ్బాస్, టి.విష్ణువర్దన్, అఫ్రోజ్సమీన, వై.విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్మికులు గ్రెయిన మార్కెట్ నుంచి పెవిలియన్ గ్రౌండ్ వరకు ఎర్రజెండాలు చేబూని ప్రదర్శనగా తరలివచ్చారు. -
‘బాబు’ రాగానే జాబు పోయింది
ఒంగోలు అర్బన్ : జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల్లో ప్రచారం చేశారని, కానీ, బాబు రాగానే జాబు పోయిందని గృహ నిర్మాణ సంస్థ (హౌసింగ్) ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తొలగించిన హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో భాగంగా పదో రోజైన శుక్రవారం ఉద్యోగులంతా నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని మౌనంగా నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన కొనసాగింది. అనంతరం నిర్వహించిన ధర్నాలో అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి.మస్తాన్‌రావుమాట్లాడుతూ హౌసింగ్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పట్ల ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు. ఆందోళనలో పాల్గొని మద్దతు తెలిపిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ వైస్ చైర్మన్ బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ పేదలకు గృహాలు నిర్మించడంలో హౌసింగ్ శాఖలోని రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పనిచేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగించడం అన్యాయమన్నారు. వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మినిస్టీరియల్ స్టాఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అడకా స్వాములు, జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి శరత్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శివకుమార్, నగర ప్రెసిడెంట్ తాడి శ్రీనివాసులు, యునెటైడ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షుడు ఏవీబీ బ్రహ్మచారి, కార్యదర్శి జీవీ రాగయ్య, యూనియన్ జిల్లా కోశాధికారి ఆర్.ఉదయ్‌కుమార్, వైస్ ప్రెసిడెంట్ సీహెచ్ మురళీమోహన్, నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదం
- రాజీవ్ విద్యామిషన్‌లో కాంట్రాక్టు ఉద్యోగుల పునరుద్ధరణపై ప్రభుత్వం తాత్సారం - ఆందోళనలో 425 మంది ఉద్యోగులు ఏలూరు సిటీ : ‘జాబు రావాలంటే బాబు రావాలన్న’ నినాదంతో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్త ఉద్యోగాల సంగతి అటు ఉంచితే ఉన్న ఉద్యోగులను తొలగిస్తోంది. వివిధ శాఖల్లో ఏళ్ల తరబ డి పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగిస్తూ వారి కుటుంబాలను రోడ్డుపైకి నెడుతోంది. జిల్లాలో రాజీవ్ విద్యామిషన్‌లో భాగంగా 425 మంది ఉద్యోగులు కాంట్రాక్టు పద్ధతిపై పని చేస్తున్నారు. పాఠశాలల క్లస్టర్ల పరిధిలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్లుగా 243 మంది, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కో-ఆర్డినేటర్లు 46, మానసిక, శారీరక వికలాంగుల శిక్షణకు సంబంధించి ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ టీచర్స్(ఐఈఆర్టీఎస్) 36 మంది, డివిజన్ లిమిట్ మానిటరింగ్ టీమ్స్(డీఎల్ఐఎంటీఎస్)లో 10 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 44 మంది, మండల విద్యాధికారుల కార్యాలయాల్లో వికలాంగులకు ఉపాధి కల్పిస్తూ మెసెంజర్లుగా 46 మందిని గతంలో నియమించారు. వీరిని పరీక్షలు, ఇంటర్య్వూల ఆధారంగా గతంలో ఉన్నతాధికారులు నియమించారు. సర్వీస్ పునరుద్ధరణైపై తాత్సారం కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసును ఏటా ప్రభుత్వం పునరుద్ధరిస్తూ వస్తోంది. ఈ విద్యాసంవత్సరంలో సర్వీస్ పునరుద్ధరణకు ఉద్యోగుల పనితనాన్ని పరిగణనలోకి తీసుకుంటామని అధికారులు చెప్పారు. అయినా ఆర్వీఎంలో ఇంతవరకు ఏ ఉద్యోగి సర్వీస్‌ను పునరుద్ధరించలేదు. ప్రభుత్వం కావాలనే ఉద్యోగుల సర్వీస్‌ను పునరుద్ధరించకుండా తాత్సారం చేస్తోందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొన్ని శాఖలకు చెందిన కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తొలగిం చడంతో తమను కూడా తొలగిస్తారనే ఆందోళన వారిలో నెలకొంది. మండల విద్యాధికారుల కార్యాలయాల్లో పనిచేస్తున్న వికలాంగులైన మెసెంజర్లను విధుల నుంచి తొలగించటంపైనా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఉద్యోగాలు లేకుంటే తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, అధికారులు సత్వరమే పునరుద్ధరించాలని కాంట్రాక్టు ఉద్యోగులు కోరుతున్నారు.