క్రమబద్ధీకరణ సాధ్యం కాదన్న రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, విజయవాడ బ్యూరో: క్రమబద్ధీకరణ, వేతనాల పెంపు కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న 30 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు మళ్లీ నిరాశే మిగిలింది. ఔట్‌సోర్సింగ్ సిబ్బంది క్రమబద్ధీకరణ(రెగ్యులరైజ్) సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. అయితే, వేతనాలను మాత్రం నెలకు రూ.2,500 పెంచబోతున్నట్లు ప్రకటించింది. ఈ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశం మంగళవారం విజయవాడలో జరిగిం ది. ఇందులో తీసుకున్న నిర్ణయాలను ఆర్థికమంత్రి యనమల మీడియాకు తెలిపారు.
పెరిగిన వేతనాలు జూన్‌లో అందుతాయి
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ శాఖల్లో దాదాపు 30 వేల మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 9 కేటగిరీల్లో ఉన్నారని, వీరందరినీ 3 కేటగిరీలుగా విభజించి, వేతనాలు పెంచుతున్నట్లు యనమల తెలిపారు. రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం వివిధ కేటగిరీల్లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ప్రస్తుతం వేతనాల కింద ఏడాదికి రూ.375 కోట్లు చెల్లిస్తున్నామని, పెంపువల్ల రాష్ట్ర ఖజానాపై ఏటా అదనంగా 90 కోట్ల భారం పడుతుందన్నారు. పెంచిన వేతనాలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ఏప్రిల్, మే మాసాలతో కలిపి జూన్‌లో ఉద్యోగులకు అందుతాయన్నారు.
5%కంటే ఎక్కువ మినహాయించుకోవద్దు
రాష్ట్రంలో 20,506 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఉండగా, ఇందులో 1,003 మంది రెగ్యులరైజ్ అయ్యే అవకాశం ఉందని మంత్రి యనమల చెప్పారు. 1994 యాక్టు ప్రకారం సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అన్ని అర్హతలున్న వారికే ఈ అవకాశం లభిస్తుందన్నారు. మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో 14,776, హయ్యర్ ఎడ్యుకేషన్ విభాగంలో 1,000, స్కూల్ ఎడ్యుకేషన్, శిశు సంక్షేమ తదితర శాఖల్లో మరో 4 వేల మంది వరకు కాంట్రాక్టు సిబ్బంది ఉన్నారని తెలిపారు. వీరిలో 1,003 మందిని సూపర్‌న్యూమరరీ పోస్టులు సృష్టించి, క్రమబద్ధీకరించడానికి మంత్రివర్గ ఉపసంఘం ఆమోదం తెలిపిందన్నారు. మిగతా పోస్టులపై కేబినెట్ సబ్ కమిటీ మరోసారి సమావేశమై చర్చించాల్సి ఉందన్నారు.సబ్ కమిటీ నిర్ణయాలను ప్రభుత్వానికి సిఫార్సులుగా నివేదిస్తున్నామని వివరించారు.
ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కన్నీళ్లే
Published Wed, Apr 20 2016 1:44 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement
Advertisement